2024కు అంతా రెడీ చేస్తున్నారట

విజయనగరం జిల్లాలో వారసుల జోరు ఎక్కువగానే ఉంది. సీనియర్లు అయిన తండ్రులు తాము తప్పుకుని తమ బిడ్డలకు చాన్స్ ఇవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అనుకున్నదే తడవుగా అధినాయకత్వం వద్ద [more]

Update: 2021-06-08 13:30 GMT

విజయనగరం జిల్లాలో వారసుల జోరు ఎక్కువగానే ఉంది. సీనియర్లు అయిన తండ్రులు తాము తప్పుకుని తమ బిడ్డలకు చాన్స్ ఇవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అనుకున్నదే తడవుగా అధినాయకత్వం వద్ద కూడా ఒక మాట చెప్పేసి తమ వారిని రంగంలోకి దించుతున్నారు. విజయనగరం మహారాజు పూసపాటి వంశీకుడు అశోక్ గజపతిరాజు తన వారసురాలిగా కుమార్తె అతిథి గజపతిరాజుని ఇప్పటికే దించేశారు. ఆమె గత ఎన్నికల వేళ టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయింది. అయితే నాటి నుంచి నియోజకవర్గం వదలకుండా అతిథి తిరుగుతూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది.

కోలగట్ల ఆడపడుచు….

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఒక రికార్డు ఉంది. అదేంటి అంటే 2004లో నాటి రాష్ట్ర మంత్రి అశోక్ గజపతిరాజుని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. 2019 ఎన్నికల నాటికి అశోక్ కుమార్తె అతిధి గజపతిరాజు టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆమెను కూడా ఓడించి సంచలనం రేపారు. ఆ విధంగా తండ్రీ కూతుళ్ళను ఓడించిన నేతగా కోలగట్ల వీరభద్రస్వామి జిల్లాలోనే సత్తా చాటుకున్నారు. ఇపుడు ఆయన తన వారసురాలిగా కుమార్తె శ్రావణిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.

ఢీ కొడుతున్నారుగా …?

విజయనగరం వరకూ చూస్తే కార్పోరేషన్ కి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి తన కుమార్తెను పోటీకి పెట్టి మేయర్ గా చూడాలని కోలగట్ల వీరభద్రస్వామి ఆరాటపడ్డారు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయం మూలంగా బీసీలకు మేయర్ సీటు రిజర్వ్ అయింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవి అయినా దక్కించుకునేందుకు కుమార్తెను కోలగట్ల బరిలోకి దింపారు. ఇక తానే మొత్తం అన్నట్లుగా శ్రావణి ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె గత ఎన్నికల్లో తండ్రి తరఫున తిరిగి ప్రచారం చేసింది. ఆ అనుభవం ఉండడంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆమెకు పోటీగా టీడీపీ తరఫున అతిథి గజపతి రాజు ప్రచారం చేశారు. ఈ ఇద్దరు నారీమణుల ఎన్నికల సమరం చూసిన వారికి మాత్రం ముచ్చటగానే ఉందిట.

ఫ్యూచర్ స్టార్స్….

ఇక ఈ ఇద్దరికీ రాజకీయ వారసత్వం, తండ్రుల అశీర్వాదం నిండుగా ఉంది. 2024 ఎన్నికల నాటిని తన కుమార్తెను ఎమ్మెల్యేగా చేయాలని కోలగట్ల వీరభద్రస్వామి అంతా సిధ్ధం చేసి ఉంచుకున్నారు. జగన్ కూడా కోలగట్ల పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తారు అని చెబుతారు. ఆయన కోరితే కాదనే పరిస్థితి లేదు అని కూడా అంటారు. అంటే ఒక విధంగా వైసీపీకి 2024 ఎన్నికల్లో శ్రావణి అభ్యర్ధి అని తేలిపోయినట్లే. అదే టైంలో టీడీపీ తరఫున అతిథి గజపతిరాజు మరో మారు బరిలో నిలవడం ఖాయం. అంటే ఈ ఇద్దరికీ మునిసిపల్ ఎన్నిలకు సెమీ ఫైనల్స్ అయితే అసలైన ఎన్నికలు 2024లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవరు గెలిస్తే వారికి అక్కడ మరింత ధీటుగా నిలిచి గెలవడానికి బలం చేకూరుతుంది. మొత్తానికి ఈ ఇద్దరు వారసురాళ్ళ రాజకీయ యుధ్ధం మాత్రం జిల్లానే ఆకట్టుకుంటోంది అని చెప్పాలి.

Tags:    

Similar News