బొత్స వ్యూహం కరెక్ట్ గా సెట్ అయితే?

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతంకాదు.. ఎవ‌రూ అతీతం కాదు. ఎవ‌రి ప్రయోజ‌నాలు వారివి.. ఎవ‌రి అవ‌స‌రాలు .. అవ‌కాశాలు వారివి. ఈ విష‌యంలో భార్యా-భ‌ర్త అయినా.. అన్నాత‌మ్ముడైనా.. సోద‌రీ-సోద‌రుడైనా.. [more]

Update: 2020-07-05 14:30 GMT

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతంకాదు.. ఎవ‌రూ అతీతం కాదు. ఎవ‌రి ప్రయోజ‌నాలు వారివి.. ఎవ‌రి అవ‌స‌రాలు .. అవ‌కాశాలు వారివి. ఈ విష‌యంలో భార్యా-భ‌ర్త అయినా.. అన్నాత‌మ్ముడైనా.. సోద‌రీ-సోద‌రుడైనా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదు. రాజ‌కీయాలంటేనే అంత‌. ఇలాంటి రాజ‌కీయాల్లో ఇప్పుడు స‌రికొత్త అంకం న‌డుస్తోంది. సొంత బాబాయి-కూతురే రాజ‌కీయంగా క‌త్తులు నూరుకుంటున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ.. రాజ‌కీయ వైరంతో ర‌గిలిపోతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వీరిద్దరి మ‌ధ్య పాలిటిక్స్ ప‌దును తేరుతున్నాయి.

పూసపాటి కుటుంబం…..

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన పూస‌పాటి రాజ కుటుంబం గురించి తెలియ‌నివారు ఎవ‌రూ ఉండ‌రు. వీరిలో పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయంగా ఇప్పటికీ చ‌క్రం తిప్పుతున్నారు. ఆయ‌న కుమార్తె అదితి కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఇద్దరూ పోటీ చేసి ఓడిపోయారు. త‌న కుమార్తెను ప‌ట్టుబ‌ట్టి విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీకి పోటీ చేయించిన అశోక్ ఎదురు దెబ్బతిన్నారు. అయితే, ఈ కుటుంబంలోనే అశోక్ అన్నగారు.. పూస‌పాటి ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు కుమార్తె (తొలి సంతానం) సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ వైరం త‌లెత్తింది. ఆది నుంచి అశోక్ టీడీపీలో ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయ‌న జిల్లాలో చ‌క్రం తిప్పారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా కూడా ప‌నిచేశారు.

అశోక్ కు చెక్ పెట్టడానికి…..

ఇక‌, ఆనంద‌గ‌జ‌ప‌తి కుమార్తె సంచయిత‌.. బీజేపీలో క్రియాశీల నాయ‌కురాలిగా ఉన్నారు. ఆనంద గ‌జ‌ప‌తి వైజాగ్ ఎంపీగా కూడా గెలిచారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం సంచ‌యిత బీజేపీలోకి వెళ్లారు. అయితే, ఇటీవల కాలంలో ఈ బాబాయి-అమ్మాయిల మ‌ధ్య రెండు నుంచి మూడు విష‌యాల్లో రాజ‌కీయం ర‌గులుతోంది. ఈ రాజ కుటుంబం చైర్మన్‌గా ఉన్న సింహాచ‌లం దేవ‌స్థానం స‌హా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ప‌ద‌వుల విష యంలో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విష‌యం కోర్టులో ఉంది. అయితే, దీనికి పూర్వప‌రిస్థితి చూస్తే.. టీడీపీ నేతైన‌.. అశోక్ ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి… జగన్ పూసపాటి ఫ్యామిలీకి చెందిన సంచయితని రంగంలోకి దించి, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ పదవి ఇచ్చేశారు.

వీరిద్దరికి పడకపోవడంతో…..

కానీ, ఈ రెండు ప‌ద‌వులు త‌మ‌కే చెందాల‌ని అశోక్ ర‌గ‌డ సృష్టించారు. దీనిపై రాజ‌కీయ విమ‌ర్శలు వ‌చ్చా యి. చివ‌ర‌కు న్యాయ వివాదంగా మారింది. బాబాయి-అమ్మాయి ఎక్కడా వెన‌క్కి త‌గ్గడం లేదు. పైగా వ‌చ్చే ఎన్నికల నాటికి పూస‌పాటి కుటుంబం నుంచే వైసీపీ త‌ర‌ఫున సంచ‌యిత విజ‌య‌నగ‌రం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వయసు మీద పడుతుండటంతో, ఆయన స్థానంలో సంచయితకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని చూస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ నేత కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి ప్రధాన రాజ‌కీయ ప్రత్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరికి ప‌డేది కాదు.

బొత్స అనుకున్నది జరిగితే….

ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే కోల‌గ‌ట్ల వ‌చ్చే ఎన్నికల నాటికి త‌న కుమార్తెను రంగంలోకి దించాల‌ని చూస్తున్నారు. అయితే బొత్స వ్యూహాత్మకంగా ఇటు అశోక్ ఫ్యామిలీతో పాటు అటు కోల‌గ‌ట్ల ఫ్యామిలీకి చెక్ పెట్టే క్రమంలో సంచ‌యిత‌ను విజ‌య‌న‌గ‌రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా రంగంలోకి దింపేందుకు చాప‌కింద నీరులా ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. ఒకవేళ అదేగనుక జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో సంచయిత-ఆదితిలు విజయనగరం బరిలో ఢీ కొట్టొచ్చు.మొత్తంగా చూస్తే.. విజ‌య‌న‌గ‌రంలో బాబాయి-అమ్మాయిల రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News