కోడెల కోరుకుంటున్నదదే

కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఇక సత్తెనపల్లి నియోజకవర్గం వైపు చూసే అవకాశం లేదు. కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. [more]

Update: 2019-10-28 11:00 GMT

కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఇక సత్తెనపల్లి నియోజకవర్గం వైపు చూసే అవకాశం లేదు. కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తండ్రి స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివరాం సత్తెనపల్లి నియోజకవర్గంలో అంతా తానే అయి చూశారు. ప్రతి పనిలో పర్సంటేజీలు దండుకున్నారన్న ఆరోపణలు విన్పించాయి. ఒక దశలో కోడెల శివప్రసాద్ కు కూడా చంద్రబాబు కుమారుడిని అదుపులో పెట్టుకోవాలని సూచించారంటే పరిస్థితి ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

సత్తెనపల్లిలో అడుగు పెట్టలేక….

ఇక ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ కు వ్యతిరేకంగా సత్తెన పల్లి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. కోడెల శివప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వవద్దని కూడా డిమాండ్ చేశారు. అయినా చంద్రబాబు కోడెల పై ఉన్న నమ్మకంతో ఆయనకే టిక్కెట్ ఇచ్చారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోడెల శివరాం సత్తెన పల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. సొంత పార్టీ నేతలే కోడెల శివరాంను దరి చేరనీయని పరిస్థితులు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి.

రాజకీయ భవిష్యత్ కోసం…..

అసలు కోడెల శివప్రసాద్ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. తండ్రి ఆత్మహత్యతో వివిధ కార్యక్రమాల్లో ఉన్న కోడెల శివరాం మాత్రం రాజకీయ వారసత్వాన్నొ కొనసాగించాలనుకుంటున్నారు. ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోడెల శివరాం సత్తెన పల్లిని దాదాపుగా వదిలేసుకున్నారని చెబుతున్నారు. కోడెల శివప్రసాద్ కు అత్యంత సన్నిహితులు, టీడీపీలో ఉన్న ప్రముఖులు కొద్దిరోజుల క్రితం రహస్య సమావేశం పెట్టి కోడెల శివరాం రాజకీయ భవిష్యత్ పై చర్చించారని తెలుస్తోంది.

చంద్రబాబు వద్దకు….

కోడెల శివరాంను నరసరావుపేట ఇన్ చార్జిగా చేయాలని వారంతా చంద్రబాబును త్వరలో కలసి కోరనున్నట్లు తెలిసింది. నరసరావుపేట నియోజకవర్గంలో ఇప్పటికీ డాక్టర్ కోడెలకు అభిమానులున్నారు. ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడయితేనే కోడెల శివరాం నెగ్గుకు రాగలడని కోడెల సన్నిహితులు విశ్వసిస్తున్నారు. అందుకే కోడెల సంస్మరణ సభలో చంద్రబాబు ఎదుట కొందరు కార్యకర్తలు కోడెల శివరాంకు నరసరావుపేట బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేసినా స్పందించలేదు. అయితే కోడెల సన్నిహితులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు చంద్రబాబును కలసి కోడెల శివరాం భవిష్యత్ పై త్వరలోనే చర్చించనున్నారని సమాచారం. కోడెల శివరాం మాత్రం నరసరావుపేటపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News