కోడెలను పట్టించుకుందెప్పుడు…?

వైసీపీ సర్కార్ వేధింపుల వల్లనే పల్నాటి పులి లాంటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనదైన పోస్ట్ మార్టం [more]

Update: 2019-09-17 11:00 GMT

వైసీపీ సర్కార్ వేధింపుల వల్లనే పల్నాటి పులి లాంటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనదైన పోస్ట్ మార్టం రిపోర్టు ఇచ్చేశారు. మూడు నెలలుగా కోడెల శివప్రసాద్ నే టార్గెట్ గా చేసుకుని వైసీపీ సర్కార్ మానసికంగా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిందని కూడా ఆయన విశ్లేషించారు. అందువల్లనే ధైర్యానికి మారు పేరు అయిన కోడెల శివప్రసాద్ చివరకు తన సొంత ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని మరణించారని చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ వైసీపీ భాధితుల శిబిరాన్ని నిర్వహించి చలో ఆత్మకూరు అన్న టీడీపీ అధినాయకత్వం కోడెల శివప్రసాద్ విషయంలో ఎందుకు ఇలా వదిలేసిందన్నదే ఇపుడు చర్చగా ఉంది.

నిరాదరణేనా….?

కోడెల శివప్రసాద్ బతికి ఉన్నపుడు ఆయన్ని వైసీపీ సర్కార్ వేధింపులకు గురి చేసిందని చంద్రబాబు చెప్పేస్తున్నారు. అదే మాటతో టీడీపీ అధినేతగా తన వైఫల్యాన్ని కూడా అంగీకరించేస్తున్నారు. అదెలా అంటే కేవలం రెండు వేల మంది కూడా లేని ఆత్మకూరు కి చలో అంటూ భారీ ఆందోళనకు పిలుపు ఇచ్చిన చంద్రబాబు టీడీపీ పుట్టినప్పటినుంచి పార్టీలో ఉన్న కోడెల శివప్రసాద్ కు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సహజంగానే వస్తుందిపుడు. కోడెల శివప్రసాద్ ని వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీ అండగా ఉంటే నిజంగా ఈ రకంగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఉండరన్న మాట కూడా వినిపిస్తోంది. మరి వైసీపీ భాధిత శిబిరాన్ని నడిపి తాను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పిన చంద్రబాబు కోడెల శివప్రసాద్ రే ఏ రకమైన ధైర్యం చెప్పారన్న మాట కూడా వినవస్తోంది.

అదేనా అసలు బాధ…..

ఇక కోడెల శివప్రసాద్ కు ప్రభుత్వ వేధింపులు కొత్త కాదు అంటున్నారు. ఆయన నలభయ్యేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. తన మీద వచ్చిన అనేక రకాలైన ఆరోపణలను ధీటుగా ఎదుర్కొన్నారు. అటువంటిది వైసీపీ సర్కార్ వచ్చీ రాగానే కేవలం మూడు నెలల వ్యవధిలో ఆయన చనిపోయారంటే అది సర్కార్ వేధింపుల వల్ల కానే కాదని లాజిక్ తెలిసిన వారు చెబుతున్న మాట. గతంలో కోడెల శివప్రసాద్ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా పార్టీ వెన్నంటి ఉందన్న భరోసా ఉండేది, ఇపుడు అది కరవు కావడం వల్లనే కోడెల శివప్రసాద్ ఇంతకు తెగించారన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి. నిజానికి ఏ మనిషి అయినా కార్నర్ కావడం, తనకు మరో దారి లేకపోవడం వల్లనే ఆత్మహత్య పరిష్కారం అనుకుంటారని అంటున్నారు. కోడెల ఎపిసోడ్ చూస్తే అధికార పార్టీ వేధింపులు ఒక ఎత్తు అయింతే అంతకు మించి పార్టీ నుంచి నిరాదరణ కూడా మరో కారణంగా ప్రచారం సాగుతోందంటే అందులో నిజం ఉందిగా అంటున్నారు.

Tags:    

Similar News