తగ్గినట్లా..? నెగ్గినట్లా?

Update: 2018-11-18 14:30 GMT

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ తర్వాత మారుమోగిన పేరు కోదండరామ్. అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి, ఆయన నాయకత్వాన్ని అంగీకరించాయి. రాజకీయ కార్యాచరణ సమితిగా ఏర్పాటై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిర్వహించాయి. 2010 నుంచి దాదాపు నాలుగేళ్లపాటు కోదండరామ్ కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ సహా అంతా ఆయన చెప్పినట్లే నడిచారని చెప్పవచ్చు. నచ్చకపోయినా ఉద్యమ విషయంలో కోదండరామ్ ను వ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు. రాష్ట్ర అవతరణ తర్వాత పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆయనను పక్కనపెట్టారు. తెలంగాణ ప్రజానీకంతో మమైకమైన వ్యక్తి కీలకంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందికరమన్న రాజకీయ సమీకరణతోనే పగ్గాలు వేశారు. ఆయన పట్ల ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా సొంత అజెండాతో కోదండరామ్ ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ పార్టీని స్థాపించుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ తెలంగాణ అజెండాను నిర్దేశించేందుకు అవసరమైనంత బలాన్ని సొంతంగా సమకూర్చుకోలేకపోయింది. కాంగ్రెసు తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంది. కోదండరామ్ పోటీలోనే లేకుండా పోయారు. దీనివెనక చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయమవుతున్నాయి.

టీఆర్ఎస్ వ్యూహం...

వ్యక్తిగతంగా కోదండరామ్ ను ప్రధాన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ చూస్తోంది. కాంగ్రెసు రాజకీయ ప్రత్యర్థి. కోదండరామ్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగానే తెలంగాణ సమాజంలో గౌరవభావం ఉంది. కూటమికి కొంత నైతికస్థైర్యం, ఆదరణ లభించేందుకు ఆయన కలయిక దోహదం చేసింది. ఉద్యమంతో పెనవేసుకుపోవడం, రాజకీయంగా వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోకుండా పనిచేయడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. తెలంగాణ జనసమితిని స్థాపించిన తర్వాత అందరూ అభినందించారు. కాంగ్రెసు పార్టీ తమకు అసలు పోటీయే కాదని టీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది. కోదండరామ్ చేతులు కలిపిన తర్వాత సమీకరణల్లో మార్పు చోటు చేసుకుంటోందని గ్రహించింది. ఫలితంగానే ఆయననే టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలకు తెర తీసింది. దాంతోపాటు కోదండరామ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించాలనే లక్ష్యంతో ఎదురుచూసింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికనే తయారు చేసినట్లు సమాచారం. తెలంగాణ జనసమితి ఆశించిన సంఖ్యలో సీట్లను కాంగ్రెసు కేటాయించలేకపోయింది. అంతేకాకుండా తాను అభ్యర్థిగా ఉంటే ఒక్క నియోజకవర్గానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాల ప్రచారానికి తగినంత వ్యవధి కేటాయించలేరు. టీజేఎస్ కు దక్కిన సీట్లలో అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రధానంగా తనపైనే ఉంటుంది. ఒకవైపు టీఆర్ఎస్ కక్ష సాధింపు ధోరణి, మరోవైపు తనపై ఉన్న బాధ్యత రెంటినీ ద్రుష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే కోదండరామ్ బరి నుంచి తప్పుకున్నారు.

కాంగ్రెసు భరోసా...

టిక్కెట్ల కోసం వెంపర్లాడుతున్న కాంగ్రెసు వర్గాలకు కోదండరామ్ ఒక గుణపాఠం చెప్పారనే భావించాలి. సొంతంగా తానే పోటీలో లేకుండా ఒక సంకేతాన్ని ఇచ్చారు. టీజేఎస్ లో అసమ్మతి స్వరాలను అదుపు చేయగలిగారు. కాంగ్రెసు నుంచి అధికసంఖ్యలో సీట్లు డిమాండు చేస్తున్నవారి నోటికి అడ్డుకట్ట పడింది. కోదండరామ్ పోటీ లో లేకపోవడం వల్ల ఆయనపై సొంతపార్టీలో విమర్శలు గుప్పించేవారి సంఖ్య దక్కింది. ఆయనకే సీటు లేకపోవడం వల్ల తమకు ఇప్పించలేదని ఆరోపణలు గుప్పించలేరు. కాంగ్రెసు పార్టీ సైతం కోదండరామ్ కు గట్టి భరోసానిచ్చింది. సాధారణ అభ్యర్థిగా పోటీ చేయడం కంటే మార్గదర్శిగా ఉండాలని కోరింది. రాజ్యసభ వంటి కీలక స్థానాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కూటమి గెలుపు బాధ్యతలో ముందువరసలో నిలవాలని సూచించింది. టీఆర్ఎస్ విష ప్రచారం, ఆయనను ఓడించేందుకు వేస్తున్న ఎత్తుగడలను వివరించింది. పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న కోదండరామ్ బరి లో నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ చివరిక్షణాల వరకూ ప్రకటించకుండా జాగ్రత్త వహించారు. దీంతో ఎన్నికల బరి నుంచి పారిపోయారన్న అపవాదు రాలేదు. కాంగ్రెసు కోసం త్యాగం చేశారన్న ముద్ర పడింది. రెండు విధాలా ఆయనకు, కూటమికి ఇది ప్లస్సు పాయింటుగా నిలిచింది.

సెంటిమెంటు ..పేరు

కామన్ మినిమమ్ ప్రోగ్రాం అమలు కమిటీ బాధ్యతలను కోదండరామ్ కే కూటమి అప్పగించింది. అధికారంలోకి వస్తే ఈ కూటమి ప్రకటించే ఎన్నికల హామీలను అమలు చేసే బాధ్యతలనూ ఆయనకే అప్పగించనున్నట్లు ప్రకటించారు. కేబినెట్ హోదాలో పదవిని ఇచ్చేందుకూ నిర్ణయించారు. కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కూటమి పేరుపై కూడా తర్జనభర్జనలు సాగాయి. 2009లో కాంగ్రెసు కు వ్యతిరేకంగా టీడీపీ నేత్రుత్వంలో అన్నిపార్టీలు జట్టు కట్టాయి. కానీ ఫలితం వికటించింది. అందుకే తాజాగా జట్టు కడుతున్న పార్టీలు బాగా పాపులర్ అయిన ఆపేరును వాడకుండా ప్రజాకూటమి అన్న కొత్త పేరును ఎంచుకుంటున్నాయి. టీఆర్ఎస్ తో పోలిస్తే ప్రచారంలో ఇంకా కూటమి వెనకబడే ఉందని చెప్పాలి. పూర్తిస్థాయిలో అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాని దుస్థితి. చివరి రోజు వరకూ ఎదురుచూడాల్సిన నియోజకవర్గాలూ ఉన్నాయి. ఏదేమైనా కాంగ్రెసు పార్టీకి మిత్రపక్షాలుగా నిలుస్తున్న పార్టీలు ఈ విడత సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నాయి. ఇది కూటమికి శుభపరిణామంగానే చెప్పుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News