అందరూ కలిస్తేనే…? కలుస్తారా?

తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కొనాలంటే కలసికట్టుగా వెళ్లాలి. అది సాధ్యమవుతుందా? కోదండరామ్ దానిని సాధిస్తారా? నిజమే టీఆర్ఎస్ మీద ఒక్క గెలుపు పిలుపు విపక్షాలకు వినపడాలన్నా ఇప్పుడు [more]

Update: 2020-10-03 11:00 GMT

తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కొనాలంటే కలసికట్టుగా వెళ్లాలి. అది సాధ్యమవుతుందా? కోదండరామ్ దానిని సాధిస్తారా? నిజమే టీఆర్ఎస్ మీద ఒక్క గెలుపు పిలుపు విపక్షాలకు వినపడాలన్నా ఇప్పుడు అంతా ఒక్కటి కావాలి. అదే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక జరగబోతుంది. దీనికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగబోతున్నారు.

విపక్షాలన్నీ ఏకం చేసి…..

ఈ ఎన్నికలో విపక్షాలన్నింటినీ ఏకం చేయాలని కోదండరామ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం పార్టీలు ఎటూ కోదండరామ్ కు మద్దతిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక కాంగ్రెస్, బీజేపీ లు అంగీకరిస్తాయా? లేదా? అన్నది చూడాలి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలసి అన్ని పార్టీలతో మహాకూటమిని ఏర్పడటానికి కోదండరామ్ క్రియాశీల పాత్ర పోషించారు.

కాంగ్రెస్ మాత్రం…..

అసెంబ్లీ ఎన్నికల్లోనే కోదండరామ్ జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ, పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థి కావడంతో ఆయన బరిలోకి దిగలేదు. ఇప్పుడు కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతివ్వడమే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోదండరామ్ కు మద్దతివ్వాలన్న యోచనలోనే ఉన్నారు. పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు.

బీజేపీ విషయంలో…..

ఇక బీజేపీది విరుద్ధమైన పరిస్థితి. బీజేపీ సొంతంగా ఎదగాలనుకుంటోంది. కోదండరామ్ తో వ్యక్తిగతంగా సంబంధాలున్నప్పటికీ, పార్టీల పరంగా విభేదాలున్నాయి. కాంగ్రెస్ తో కలసి నడవడం బీజేపీకి ఇష్టముండదు. అందుకే బీజేపీ ఈ ప్రతిపాదనను అంగీకరించడం కష్టమేనంటున్నారు. అయితే అన్ని పార్టీలు కలసి ప్రొఫెసర్ కోదండరామ్ కు మద్దతిస్తే ఆయన విజయం నల్లేరు మీద నడకేనని చెప్పక తప్పదు.

Tags:    

Similar News