పెద్దాయనా.. మమ్మల్ని క్షమించు

నిజమే.. ఈ మాట ప్రొఫెసర్ కోదండరామ్ కు వర్తిస్తుంది. వేలాది మందికి చదువులు చెప్పిన ప్రొఫెసర్ కు ఏదో ఒక సమయంలో విద్యార్థి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. [more]

Update: 2021-03-21 09:30 GMT

నిజమే.. ఈ మాట ప్రొఫెసర్ కోదండరామ్ కు వర్తిస్తుంది. వేలాది మందికి చదువులు చెప్పిన ప్రొఫెసర్ కు ఏదో ఒక సమయంలో విద్యార్థి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. తాను చేసిన పొరపాటుకు చింతించాల్సి వస్తుంది. మరోసారి ఈ తప్పు జరగదని వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ విషయంలోనూ సోషల్ మీడియాలో ఇదే మాట వినపడుతుంది. కోదండరామ్ గారూ క్షమించండి… మిమ్మల్ని ఎన్నుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాం. ఇవీ ప్రొఫెసర్ కోదండరామ్ విషయంలో నెట్టింట విన్పిస్తున్న కామెంట్స్.

రాజకీయం చేతకాక….

అవును.. కోదండరామ్ ఎందుకు ఓడిపోయారు. ఆయనకు రాజకీయం చేతకాదనా? అవును. కోదండరామ్ కు రాజకీయం చేతనవుతే కేసీఆర్ తో వైరం ఎందుకు పెట్టుకుంటారు. కేసీఆర్ తోనే సర్దుకుపోతే తెలంగాణలో మంత్రిగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉండాల్సి వచ్చేది కదా? ఎండనక, వాననక ఈ వయసులో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఓట్లు అడుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు పట్టేది? ఆయనే ఒక నిమిషం తలవంచి ఉంటే ఢిల్లీ స్థాయిలో తలెత్తుకు తిరిగేవారు.

గుడ్డిగా నమ్మిన….

అవును.. నిజమే కోదండరామ్ కు రాజకీయం తెలియదు. అందుకే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు తాను మద్దతిచ్చి పరకాల నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయనను పట్టించుకోలేదు. ఆయన రాజకీయమంటే తెలీదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు అయితే తనను గెలిపిస్తారని నమ్మడమే. నిజమే కోదండరామ్ కు ఎందుకు ఓటెయ్యాలి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకా? తెలంగాణ అంశాలపై రాజీ పడక పోవడం వల్లనేనా?

సోషల్ మీడియాలో…..

అవును… కోదండరామ్ కు ఎన్నికలలో డబ్బులు ఖర్చు చేయాలని తెలియదు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలని తెలీదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే. తనకు పెద్దల సభలో అవకాశమిస్తే అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలనుకోవడం. అదే కోదండరామ్ చేసిన తప్పు. అయితే కోదండరామ్ ఓటమి ఆయనది కాదు. ఆయనను కలుపుకుని రాజకీయం చేయాలనుకున్న పార్టీలది. ఆయనను ప్రజలు ఓడించలేదు. డబ్బు, రాజకీయ వ్యూహాలే ఓడించాయి. కానీ ఈ ఓటమితో కోదండరామ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన సానుభూతి కురుస్తోంది. చూద్దాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కోదండరామ్ పోటీకి దిగితే అప్పుడైనా ఆయన పక్షాన నిలబడతారో లేదో చూద్దాం.

Tags:    

Similar News