కొడాలి నాని మౌనం వెనక… ?

జగన్ కి అత్యంత ఇష్టుడిగా పేరు పొందిన మంత్రి కొడాలి నాని. నానికి ఇష్టమైన వ్యక్తులు కొందరు ఉన్నారు. ఎన్టీఆర్ ని అన్నా జగన్ ని ఎవరు [more]

Update: 2021-08-05 08:00 GMT

జగన్ కి అత్యంత ఇష్టుడిగా పేరు పొందిన మంత్రి కొడాలి నాని. నానికి ఇష్టమైన వ్యక్తులు కొందరు ఉన్నారు. ఎన్టీఆర్ ని అన్నా జగన్ ని ఎవరు విమర్శించినా ఆయన అసలు సహించారు. తనదైన పదజాలంతో దూకుడు చేస్తారు. ఆయన చెప్పేది కూడా ఒక్కటే. జగన్ని ఎవరైనా అంటే మాత్రం తాను ఏదీ లెక్కచేయనని, వారు ఎంతటివారు అయినా వదిలేది కూడా లేదని అంటారు. అటువంటి కొడాలి నాని గొంతు కొంతకాలంగా వినిపించకపోవడం విడ్డూరమే. సొంత పార్టీలోనే దీనిమీద చర్చ సాగుతోందిట.

సొంత జిల్లాలో అయినా…?

ఈ మధ్యనే సొంత జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ వ్యవహారం అతి పెద్ద కలకలం రేపింది. అంతకు ముందు అక్రమ మైనింగ్ అంటూ ఉమ తన వారితో కలసి ఆ ప్రాంతాలకు వెళ్ళి హడావుడి చేశారు. ఇదంతా ఏపీని హీటెక్కించింది. అయితే ఇంత జరిగినా కూడా కొడాలి నుంచి పెద్దగా సౌండ్ లేకపోవడమే విశేషంగా చూడాలి. మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కౌంటర్ చేశారు కానీ ఆ ఇంపాక్ట్ రాలేదు. మొత్తానికి మొత్తం టీడీపీ ఈ విషయంలో ఒక్కటి అయింది. చంద్రబాబు అయితే దేవినేని ఉమ ఇంటికి వచ్చి మరీ పరామర్శ చేశారు. మరో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మల మీద ఇది దాడి అంటూ మాట్లాడారు. ఇంత జరిగినా కూడా కొడాలి నాని మాత్రం పెద్దగా మాట్లాడింది లేదు.

ఆలోచనలు మారాయా ..?

నిజానికి కమ్మ సామాజికవర్గం అంతా టీడీపీతో కలసి లేరు. అలా కనుక ఉంటే గుడివాడలో కొడాలి నాని ఎందుకు గెలుస్తారు. పైగా అది ఎన్టీయార్ పుట్టిన గడ్డ కూడా. అయితే వారంతా కూడా తటస్థంగా ఉండమనే నానికి చెబుతారుట. టీడీపీ మీద ఒంటి కాలుతో కొడాలి నాని పదే పదే లేవడాన్ని కూడా వారు తప్పు పడతారుట. విమర్శలు చేయవచ్చు కానీ చంద్రబాబుని పట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాత్రం వారు వద్దు అనే చెబుతారుట. ఇన్నాళ్ళూ వారి మాటలు వినని కొడాలి నానికి ఇపుడు ఏమైనా కొత్త ఆలోచనలు వస్తున్నాయా అన్న చర్చ కూడా పార్టీలో ఉందిట.

నిజంగా అంతేనా…?

టీడీపీ నేత గోరంట్ల అన్నారని కాదు కానీ వైసీపీలో నిజంగా కమ్మలకు అన్యాయం జరుగుతోందా. కొడాలి నాని తప్ప వేరే వారికి మంత్రి పదవి దక్కలేదు. ఇక ఇటీవల నామినేటెడ్ పదవుల జాతర జరిగినా కమ్మలకు సరైన పోస్టులు దక్కలేదు అన్న అసంతృప్తి ఆ సామాజికవర్గంలో ఉందని అంటారు. మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయం కూడా కమ్మలు రెడ్లు అన్నట్లుగానే విడిపోయింది. ఈ నేపధ్యం ముంచి చూసుకున్నపుడు కొడాలి నాని ఈ మధ్య కొంత వెనక్కు తగ్గుతున్నారా అన్నదే చర్చట. అయితే ఆయన జగన్ కి ఆప్తుడు అని వేరే విధంగా ఆలోచించాల్సింది లేదని సర్దిచెప్పేవారూ ఉన్నారు. కానీ ఏపీలో టీడీపీని తిట్టాలి అంటే కొడాలి నాని మాత్రమే కరెక్ట్ అన్నది వైసీపీలో బలంగా ఉండిపోయింది. ఇపుడు అదే కొడాలి నాని నోట మాటలు రాకపోవడంతోనే ఇంత చర్చ సాగుతోంది అంటున్నారు.

Tags:    

Similar News