విశాఖ వైసీపీలో వీవీఐపీ… ?

దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దొంగలు అంటూ ఓల్డెన్ డేస్ లో సినిమాలు వచ్చి మంచి హిట్లు కొట్టాయి. సరే అవి సినిమాలు. దానికి దర్శకులు [more]

Update: 2021-09-06 08:00 GMT

దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దొంగలు అంటూ ఓల్డెన్ డేస్ లో సినిమాలు వచ్చి మంచి హిట్లు కొట్టాయి. సరే అవి సినిమాలు. దానికి దర్శకులు వేరేగా ఉంటారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు కావాలి అంటే వారిని జనమే ఎన్నుకోవాలి. ఎన్నికలు వచ్చినపుడు పోటీ చేసినపుడు జగన్ ఆశీర్వదించినపుడు ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ అవుతారు. కానీ విశాఖలో ఆయన వైసీపీ నేతల చలువతో చాలా ఇంపార్టెంట్ లీడర్ అయిపోయారు. 2019 ఎన్నికలలో ఓడిపోయినా కూడా ఆయనే మా ఎమ్మెల్యే అంటోంది వైసీపీ. అంతే కాదు, వచ్చేసారి కచ్చితంగా గెలుస్తాడు అంటూ రెండున్నరేళ్లకు ముందుగానే జోస్యం చెబుతోంది. ఆయనే కేకే రాజు.

మరీ అంతగా…?

నిజానికి కేకే రాజు అన్న ఆయన ఎవరో పాతిక లక్షల మంది విశాఖ నగర వాసులలో మెజారిటీకి తెలియదు. ఆయన 2019 ఎన్నికల వేళ నార్త్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఆ నియోజకవర్గానికి తెలిసింది. ఎమ్మెల్యే అయితే ఇంకా తెలిసేది ఏమో కానీ ఆయన ఓడిపోయారు. మరో వైపు ఆయన ఓడినా నార్త్ ఇంచార్జిగానే ఉన్నారు. ఆయనే అనధికార ఎమ్మెల్యే అని కూడా వైసీపీ హై కమాండ్ డిక్లేర్ చేసేసింది. మరో వైపు చూస్తే ఆయనకు ప్రతిష్టాత్మకమైన నెడ్ క్యాప్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది. దాంతో ఆయన ఇంకా పవర్ ఫుల్ అయ్యారు. ఇక ఆయన పదవీ ప్రమాణ స్వీకార ఘట్టం మంత్రి స్థాయిలో జరిగింది. వైసీపీకి చెందిన ముఖ్యనేతలు మంత్రులు అంతా రెక్కలు కట్టుకుని మరీ వచ్చి అక్కడ వాలిపోయారు.

ఈయనే విశాఖ ఐకాన్…

ఇక కే కే రాజే రేపటి విశాఖ ఆశాకిరణం అన్నట్లుగా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఆయన ఈసారి అసెంబ్లీకి రావడం ఖాయం కాబట్టి తాము ఇప్పటి నుంచే ఎమ్మెల్యేగానే చూస్తామంటూ కూడా ప్రకటించేశారు. కేేకే రాజు వంటి నేత విశాఖలో లేనేలేరని కూడా కితాబు ఇచ్చారు. మరో వైపు ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు చుట్టూ చేరి ఆయన మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని దీవించారు. అనగా మినిష్టర్ పదవి అన్న మాట. ఇక చూడబోతే విశాఖలో నామినేటెడ్ పదవులు చాలా మందికి దక్కాయి కానీ రాజు గారి హడావుడి మాత్రం ఎక్కడా లేదని వైసీపీలోనే చర్చ సాగుతోంది.

జగన్ నీడగానే …

జగన్ కి కే కే రాజు అత్యంత సన్నిహితులు అని మూడు జిల్లాల వైసీపీ నాయకులకు తెలుసు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఆయన గోదావరి జిల్లాలకు చెందిన వారు. ఆయనకు వైఎస్సార్ నుంచి కూడా ఆ ఫ్యామిలీతో పరిచయాలు ఉన్నాయని అంటారు. అయితే జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లో కూడా ఆయన బయటకు వచ్చి ఆర్భాటం చేయలేదు. కానీ 2019 ఎన్నికలలో మాత్రం జగనే ఆయన్ని బలవంతం పెట్టి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయించారు అని చెబుతారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడినా జగన్ ఆయన్ని చేరదీశారు. తానున్నాను అని గట్టి భరోసా ఇచ్చారు. దీంతో ఆయన జగన్ కి కావాల్సిన మనిషి అని అర్ధమైపోయే వైసీపీ బడా నేతలు అంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. మొత్తానికి జనంతో సంబంధం లేకుండా రాజుని ఎమ్మెల్యే చేసిన వైసీపీ నేతలు మంత్రిని కూడా చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News