“బేడీ”లు వేస్తే ఎలా? “నారాయణ” ఎంత మాట?

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా సమయంలోనూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు, ముఖ్యమంత్రికి పొసగడం లేదు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయిన [more]

Update: 2020-04-25 18:29 GMT

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా సమయంలోనూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు, ముఖ్యమంత్రికి పొసగడం లేదు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయిన నాటి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు అనేక అంశాల్లో తలెత్తాయి. కోర్టులకు ఈ వివాదాలు చేరుకున్నాయి. చివరకు కరోనా సమయంలోనూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం విమర్శలకు దారి తీస్తుంది.

తొలి నుంచి వివాదాలే….

లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడి తమను పాలన చేసుకోనివ్వడం లేదన్నది ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపణ. ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి ఫైలును కిరణ్ బేడీ తొక్కి పెడుతున్నారని, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న ఆరోపిస్తున్నారు. దీనిపై నారాయణస్వామి గతంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతిని కలిసి లెఫ్ట్ నెంట్ గవర్నర్ పై ఫిర్యాదు చేశారు. అయినా వీరిద్దరి మధ్య విభేదాలు మాత్రం తొలిగిపోలేదు.

మంచిపేరున్నా….

నిజానికి కిరణ్ బేడీ పోలీస్ ఆఫీసర్ గా జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా ఆమె అందరికీ సుపరిచితమే. ఇక తీహార్ జైలు అధికారిణిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రశంసలు దేశ వ్యాప్తంగా అందుకున్నారు. నారాయణస్వామికి కూడా రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. ఆయనను నిజాయితీ పరుడిగానే ప్రజలు ఇప్పటికీ భావిస్తారు.
పాలనలో అవినీతి హెచ్చుమీరిందంటూ గతంలో కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. దీనిపై నారాయణస్వామి ఏకంగా అసెంబ్లీలోనే కిరణ్ బేడీకి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అధికారులను తన వద్దకు పిలుచుకుని సమీక్షలు చేయడాన్ని నారాయణస్వామి తప్పు పడుతున్నారు.

కరోనా సమయంలోనూ…

ఇప్పుడు కరోనా సమయంలోనూ బియ్యం పంపిణీపై నారాయణస్వామి కిరణ్ బేడీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో బియ్యం పంపిణీకి సంబంధించిన ఫైలు కిరణ్ బేడీ తొక్కి పెట్టారని నారయాణస్వామి ఆరోపించారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలన్నా కిరణ్ బేడీ వల్ల కుదరడం లేదని రాజకీయ ఆరోపణలు చేశారు. దీనికి కిరణ్ బేడీ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పేదలకు బియ్యం పంపిణీకి సంబంధించి తనవద్ద ఎలాంటి ఫైలు పెండింగ్ లో లేదని, నారాయణస్వామి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిరణ్ బేడీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద కిరణ్ బేడీ, నారాయణస్వామిల వివాదం కరోనా సమయంలోనూ తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News