ఆయన చుట్టూ ఇప్పటికీ వారేనట

అధికారం వచ్చినా ఏం లాభం? నోరుంటే ఎక్కడైనా చెలామణి కావచ్చు. అధికార పార్టీ ఏదైనా వారికి ఫరక్ ఏం పడదు. టీడీపీ, వైసీపీ వారికి ముఖ్యం కాదు. [more]

Update: 2021-07-31 13:30 GMT

అధికారం వచ్చినా ఏం లాభం? నోరుంటే ఎక్కడైనా చెలామణి కావచ్చు. అధికార పార్టీ ఏదైనా వారికి ఫరక్ ఏం పడదు. టీడీపీ, వైసీపీ వారికి ముఖ్యం కాదు. తమ పని జరిగిందా? లేదా? అన్నదే ప్రధానం. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా టీడీపీ హాయంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు. కాంట్రాక్టులు, పదవుల్లో వారికే ప్రాధాన్యత దక్కుతుండటంతో వాస్తవంగా వైసీపీ విజయం కోసం ఏళ్లుగా కష్టపడిన వారు చేష్టలుడిగి చూస్తున్నారు.

బలోపేతం చేయాల్సిన సమయంలో…

ఇందుకు పొన్నూరు నియోజకవర్గం ఉదాహరణ. ఇక్కడ వైసీపీ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీని ఓడించగలిగింది. అప్పుడు ఏం చేయాలి? పార్టీని మరింత బలోపేతం చేసుకోగలగాలి. పటిష్టమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవాలి. టీడీపీని బలహీనపర్చాలి. కానీ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఈ మూడింటిలో ఏ ఒక్కటీ చేయడం లేదు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఎక్కువ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనన్న విమర్శలున్నాయి.

సొంత పార్టీ నేతలను….?

కిలారు రోశయ్యను ఏరికోరి జగన్ పొన్నూరుకు తీసుకువచ్చారు. పార్టీ కోసం కష్టపడిన రావి వెంకటరమణను కాదని ఈయనకు టిక్కెట్ ఇచ్చారు. సమిష్టిగా కృషి చేయడం, అప్పటికే ఐదుసార్లుగెలిచిన ధూళిపాళ్ల నరేంద్రపై ఉన్న అసంతృప్తి వెరసి కిలారు రోశయ్య విజయానికి కారణాలుగా చెప్పాలి. అయితే గెలిచిన రెండేళ్ల నుంచి కిలారు రోశయ్య ప్రత్యర్థి పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర టీమ్ తో సఖ్యతగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నాడు పెత్తనం చేసిన వారే….

అయితే దీనిని ఆయన ఖండిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కువ టీడీపీ నేతలకే పనులు జరుగుతున్నాయన్నది వాస్తవం. గతంలో టీడీపీలో పెత్తనం చేసిన వారే ఇప్పుడు ఆయన చుట్టూ కనపడుతున్నారు. దీంతో పొన్నూరులో వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి పెద్దయెత్తున కనపడుతుంది. కిలారు రోశయ్య కూడా ఇది తనకు పొన్నూరులో చివరి ఛాన్స్ అనుకుని పనిచేస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మొత్తం మీద పొన్నూరులో పెత్తనమంతా టీడీపీ వారిదేనట. అదేదో ఒకసారి చూడరాదు జగనూ.

Tags:    

Similar News