ఏజెన్సీ ఎడారిలో కిడారి రాజకీయ వ్యవసాయం ?

ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా గ్రూప్ వన్ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం చేయాలనుకుంటున్న క్రమంలో తండ్రి కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యతో ఈ [more]

Update: 2021-05-23 02:00 GMT

ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా గ్రూప్ వన్ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం చేయాలనుకుంటున్న క్రమంలో తండ్రి కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యతో ఈ వైపుగా నెట్టబడ్డారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు హతమార్చిన సంగతి విదితమే. ఆ వెంటనే చంద్రబాబు సింపతీ కార్డు బయటకు తీశారు. దాని ఫలితంగా కిడారు పెద్ద కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ఒక్కసారిగా మంత్రి అయిపోయారు. ఆరు నెలల పాటు ఆ పదవిని అనుభవించిన ఆయన ఎమ్మెల్యే కాకుండాగే గద్దె దిగాల్సి వచ్చింది.

కత్తి మీద సామే …?

ఇక చంద్రబాబు 2019 ఎన్నికల్లో కిడారి శ్రావణ్ కుమార్ కి అరకు నుంచి టీడీపీ టికెట్ ఇచ్చారు. కానీ అప్పటికే అక్కడ బాగా పాతుకుపోయిన వైసీపీ నేత చెట్టి ఫల్గుణ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన రాజకీయాల ముఖం అసలు చూడరు అని కూడా అంతా భావించారు. దానికి తగినట్లుగా కొన్నాళ్ళు మౌనంగా ఉన్న కిడారి శ్రావణ్ కుమార్ ఈ మధ్య కాలంలో మళ్ళీ జోరు పెంచారు. విశాఖలోనే నివాసం ఉంటున్నా అక్కడ నుంచి అరకు తరచూ వెళ్తూ టీడీపీ ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అరకులో టీడీపీ ఎదుగుదల అన్నది ఇప్పటికైతే కత్తి మీద సామే అంటున్నారు.

వైసీపీకే పట్టు…?

ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి గట్టి పట్టుంది. పైగా అరకు నుంచి తాజా ఎన్నికల్లో గెలిచిన చెట్టి ఫల్గుణ కూడా కష్టపడే నైజం కలిగిన నేత. ఆయన పూర్వాశ్రమంలో బ్యాంక్ ఎంప్లాయ్. దాంతో ప్రజలతో ఆయన కలసిపోతున్నారు. ఇక గిరిజనులు వైసీపీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా అభ్యర్ధి ఎవరు అన్నది చూడకుండానే వైసీపీకి ఓటేసే నైజం గిరిజనానిది. ఇలా ఏకపక్షంగా సాగుతున్న మన్యం రాజకీయాన్ని కీలక మలుపు తిప్పడం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కిడారి శ్రావణ్ కుమార్ కి కష్టమే అని చెప్పాలి.

బాబునే నమ్ముకుని….

కిడారి శ్రావణ్ కుమార్ మొదట్లో ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చారని ప్రచారం జరిగింది కానీ ఇపుడు మాత్రం ఆయన పూర్తి రాజకీయ అవతారం ఎత్తేయాలనుకుంటున్నారుట. యువకుడిగా ఉన్న కిడారి శ్రావణ్ కుమార్ తనకు ఇదే సరైన మార్గం అనుకుంటున్నారుట. ఇప్పటి నుంచి కష్టపడితే ఏదో రోజున తాను ఎమ్మెల్యే అవుతాను అని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏజెన్సీలో టీడీపీ విత్తనాలు వేసినా మొలవవు అని తెలిసినా కూడా ఆయన భగీరధ ప్రయత్నమే చేస్తున్నారు. ఏదో రోజున ఏడారిలోనూ పసుపు మొక్కలు మొలుస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ మరోటి కూడా చెప్పుకోవాలి. సీనియర్ నాయకులు అంతా టీడీపీని పట్టించుకోకపోయినా కిడారి శ్రావణ్ కుమార్ లాంటి వారు పార్టీ కోసం ముందుకు రావడంతో హై కమాండ్ కూడా ఆయనను ప్రోత్సహిస్తోందిట. మరి వైసీపీ మీద విరక్తి కలుగుతుందో కిడారి మీద అనురక్తి పుడుతుందో కానీ ఏదైనా అద్భుతం జరిగితే అరకు సైకిలెక్కినా ఎక్కవచ్చేమో.

Tags:    

Similar News