విశాఖ బీజేపీకి షాకేనా.. ?

రాజకీయాల్లో ఉన్న వారిని వేరే చోట కూర్చోబెడితే ఉక్కబోతగా ఉంటుంది. నిత్యం ప్రజలతో గడిపే వారు రాజ ప్రసాదాలలో రాజ్యాంగ బద్ధ పదవుల్లో కొలువు తీరితే గౌరవం [more]

Update: 2021-08-05 00:30 GMT

రాజకీయాల్లో ఉన్న వారిని వేరే చోట కూర్చోబెడితే ఉక్కబోతగా ఉంటుంది. నిత్యం ప్రజలతో గడిపే వారు రాజ ప్రసాదాలలో రాజ్యాంగ బద్ధ పదవుల్లో కొలువు తీరితే గౌరవం సంగతి పక్కన పెడితే మా చెడ్డ ఇరకాటంగానే ఉంటుంది. ఇపుడు అలాంటి ఇబ్బంది ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ హరిబాబుకు వచ్చింది. ఆయన ప్రకాశం జిల్లా నుంచి అయిదు దశాబ్దాల క్రితమే విశాఖ వచ్చేశారు. విద్యార్ధి నాయకుడిగా ఏయూలో పేరు తెచ్చుకున్నారు. అక్కడే అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. ఇక జై ఆంధ్రా ఉద్యమంతో మొదలుపెట్టి ఎమర్జెన్సీ దాకా అనేక పోరాటాలలో భాగమయ్యారు. నాటి జనతా పార్టీకి విద్యార్ధి నాయకుడిగా సేవలు అందించారు. ఇక బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ఏపీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా సేవలు అందించారు. చట్ట సభల్లో ప్రవేశించి అర్ధవంతమైన చర్చలతో ఆకట్టుకున్నారు.

కాషాయం వదిలేసినట్లే …?

బీజేపీతో నాలుగు పదుల బంధానికి స్వస్తివాచకం పలికేశారు హరిబాబు. ఆయన బీజేపీ సభ్యత్వాన్నికి రాజీనామా చేసేసి రాజకీయాలకు రాం రాం అనేశారు. ఆయన మిజోరాం గవర్నర్ గా రాజ్యాంగ బద్ధమైన పదవిని స్వీకరిస్తున్న వేళ పాత జంజాటాలు అన్నీ వదిలేసుకున్నారు. ఇది నిజంగా ఆయన అభిమానులకు అనుచరులకు వేదన కలిగిస్తోందిట. హరిబాబు ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. పార్టీకి బద్ధుడిగా ఉంటూ వచ్చిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆలోచిస్తున్న వేళ మీ రాజకీయం ఇక చాలు అంటూ కేంద్రం గవర్నర్ ని చేసేసింది.

లీడ్ చేయాల్సిందే …?

ఇక విశాఖలో చూసుకుంటే సీనియర్ నేత పీవీ చలపతిరావు కుమారుడు పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన‌తో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు.ఈ ఇద్దరే ఇపుడు పార్టీని విశాఖలో లీడ్ చేయాలి. మిగిలిన వారిలో సీనియర్లు ఉన్నా చట్ట సభలలో అడుగు పెట్టడం ద్వారా జనాలల్లో ఎక్కువగా ఫోకస్ అయిన నేతలు వీరే. దాంతో హరిబాబు వదిలిన బరువు బాధ్యతలు వీరికే అప్పగిస్తారని అంటున్నారు. ఈ ఇద్దరూ కూడా సోము వీర్రాజు రాష్ట్ర కార్యవర్గంలో కీలక నేతలుగా కూడా ఉన్నారు. ఒక విధంగా బీజేపీకి ఇది క్లిష్టమైన పరిస్థితి. పార్టీ ఉనికి కొరకు పోరాటం చేస్తున్న వేళ హరిబాబు రాజకీయ నిష్క్రమణ అంటే పెద్ద లోటుగానే భావిస్తున్నారు.

టీడీపీకేనా…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే హరిబాబు కచ్చితంగా మరో మారు ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నుంచి విశాఖ బరిలో ఉండేవారు. కానీ ఆయన లేకపోవడం వల్ల కచ్చితంగా టీడీపీయే ఇక్కడ నుంచి పోటీకి దిగుతుంది అంటున్నారు. పొత్తులు ఉన్నా కూడా బీజేపీకి ఎంపీ స్థానం అన్నది ఇవ్వరు అన్న మాట కూడా ఉంది. అదే సమయంలో విశాఖ రాజకీయాల్లో హరిబాబు వంటి ధీటు అయిన నేత లేకపోవడం వల్ల సీట్ల షేరింగ్ విషయంలో కూడా డిమాండ్ చేసే స్థాయి బీజేపీకి ఉండదని అంటున్నారు. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో మాధవ్, రాజు ఇద్దరూ విశాఖ ఉత్తరం నుంచే పోటీకి రెడీగా ఉన్నారు. కానీ పొత్తులు కుదిరినా ఈ ఇద్దరికీ కూడా అక్కడ చాన్స్ ఉండదు అంటున్నారు. మొత్తానికి బీజేపీకి విశాఖలో విజయాలు కూడా ఇక ముందు కష్టమే అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి కాషాయం పార్టీ కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News