కేజ్రీవాల్ కు డేంజర్ బెల్స్....!

Update: 2018-10-02 16:30 GMT

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడినవే. వాటి ప్రయోజనాల అనంతరమే అవి జాతి హితం గురించి ఆలోచిస్తాయి. అకాళీదళ్, శివసేన పూర్తిగా మతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు. అకాళీదళ్ సిక్కులకు, శివసేన హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకుంటాయి. తమిళనాడులో డీఎంకే పేరుతో ఉన్న పార్టీలకూ ద్రవిడ వాదమే ముఖ్యం. తమిళుల ప్రయోజనాలు తప్ప ఇతర అంశాలు వారికి పట్టవు. ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వంటి పార్టీలు కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ యాదవుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది.

ప్రాంతీయ పార్టీలన్నీ....

మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీకి దళితుల సంక్షేమమే లక్ష్యం. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ కర్షకుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. హరియానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కూడా రైతుల సమస్యలకే పట్టం కడుతోంది. మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ బెంగాలీలకే పెద్దపీట వేస్తుంది. శరద పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్), నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ (యు) ప్రాధాన్యాలు కూడా ముందు రాష్ట్ర ప్రయోజనాలే. కశ్మీర్ లోని మెహబూబా సారథ్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ముస్లింల ప్రయోజనాలకే అగ్రతాంబూలం ఇస్తాయి. ఇక ఈశాన్య భారతంలో జిల్లాకో పార్టీ, కుటుంబానికో పార్టీలు విస్తరించాయి. వీటికి వ్యక్తిగత ఎజెండాలే ముఖ్యం.

కేజ్రీవాల్ పార్టీ మాత్రం.....

అయితే అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలకన్నా పూర్తిగా భిన్నం. ఇది కుటుంబపార్టీ కాదు. కుల పార్టీ కాదు. ఒక ప్రాంత ప్రయోజనాలే దానికి ముఖ్యం కాదు. నిజం చెప్పాలంటే ఇది సామాన్యుడి పార్టీ. సామాన్యుడి సంక్షేమమే దీని సిద్ధాంతం. ఈ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామాన్య వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన అరవింద్ కేజ్రీవాల్ యువ మేధావి. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఖరగ్ పూర్ ఐఐఐటీ విద్యార్థి. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. తొలి రోజుల్లో అంటే 2010 ప్రాంతంలో అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నాహజారే, మాజీ పోలీస్ అధికారి కిరణ్ బేడీలతో కలసి ఉద్యమించారు. జన్ లోక్ పాల్, రాష్ట్రాల్లో పటిష్టమైన లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. నాటి యూపీఏ ప్రభుత్వం కంటితుడుపుగా చట్టం తీసుకు వచ్చింది. దీంతో రాజకీయాలను ప్రక్షాళించేందుకు స్వయంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2013లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 70 స్థానాలకు గాను 28 స్థానాలను సాధించారు. బీజేపీ 31, కాంగ్రెస్ 8 స్థానాలు సాధించాయి. నాటి ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమెను ఓడించారు. 2013 డిసెంబరు 28న కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్, బీజేపీ వైఖరులకు నిరసనగా 49 రోజుల అనంతరం 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. అసెంబ్లీని రద్దు చేశారు. నాటి కేజ్రీవాల్ చర్యను పలువురు విమర్శించారు. ఇది తొందరపాటు నిర్ణయమని తప్పుపట్టారు. పలాయనవాదానికి నిదర్శనమని నిందించారు. అయినా కేజ్రీవాల్ చలించలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలను సాధించి చరిత్ర సృష్టించింది. బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కు ప్రాతినిధ్యమే కరువైంది. అంతకు ముందు 2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

భ్రమలు తొలగిపోతున్నాయా....?

రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. కాంగ్రెస్, బీజపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆయన చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు, కేజ్రీవాల్ పార్టీకి ఒకే ఒక ప్రధాన తేడా. ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపో, కాంగ్రెస్ వైపో మొగ్గు చూపుతుండగా, ఆప్ మాత్రం రెండు పార్టీలకూ దూరంగా ఉంటుంది. రెండింటినీ శత్రువులుగా పరిగణిస్తోంది. రెండు పార్టీలనూ ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్ ఎంత ప్రమాదకారో? బీజేపీ కూడా అంతే ప్రమాదరకారి అని వాదిస్తున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రతిపత్తిపై కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ తో నిత్యం పోరాడుతున్నారు. కేంద్రంతో సయితం అదే స్థాయిలో ఘర్షణ పడుతున్నారు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం కూడా చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కేజ్రీవాల్ వైఖరిని సమర్థిస్తూ స్పష్టమైన తీర్పు నిచ్చింది. ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రి నిర్ణయాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ గౌరవించాలన్న సుప్రీంకోర్టు తీర్పు కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనం. అయితే ‘‘ఆప్‘‘ పై ప్రజలకు నాడున్న ఆశలు నేడు లేవు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో నాలుగు లోక్ సభ సీట్లు, 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 26 శఆతం ఓట్లు సాధించిన ఆప్ తాజాగా అదే రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఖాతాలు కూడా తెరవలేకపోయింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఫలితాలు శూన్యం. ఆప్ పై ప్రజలకు భ్రమలు తొలుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ భవిష్యత్ ప్రశ్నార్థకమే అని చెప్పక తప్పదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News