జగన్ అలా చల్లారుస్తారట

రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమ బాట పట్టారు. రాజధాని నుంచి సచివాలయాన్ని తరలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే మరికాసేపట్లో జరగబోయే మంత్రివర్గ [more]

Update: 2019-12-27 03:30 GMT

రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమ బాట పట్టారు. రాజధాని నుంచి సచివాలయాన్ని తరలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే మరికాసేపట్లో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో రాజధాని రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలో ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులపై వరాల జల్లు కురిపిస్తారని సమాచారం. ఇదే విషయాన్ని వైసీపీ రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

రైతులకు ప్రత్యేకంగా….

ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో మూడు రాజధానుల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించడంతో పాటు రాజధాని రైతులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలుంటాయన్నారు. దాదాపు 80 శాతం మంది ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులే ఉండటంతో వారికి లబ్ది చేకూర్చే విధంగా క్యాబినెట్ నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. దీంతో రాజధాని రైతుల ఆందోళన చల్లార్చే అవకాశముందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఐదెకరాల లోపు ఉన్న…..

మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చి పదిరోజులు గడుస్తున్నా పెద్దగా రాజధాని ప్రాంతం నుంచి తప్ప ఇతర ప్రాంతాల నుంచి వ్యతిరేకత ప్రభుత్వ నిర్ణయంపై కన్పించడం లేదు. కేవలం రైతులే ఆందోళన బాట పట్టారు. దీన్ని గమనించిన వైసీపీ ప్రభుత్వం చిరు, మధ్యతరగతి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. వారికి సంతృప్తి కరంగా నిర్ణయాలు ప్రకటిస్తే ఇక ఉద్యమం ఉండబోదని అంచనా వేస్తున్నారు.

రాజకీయంగా నష్టం లేదని….

అమరావతి అభివృద్ధితో పాటు రిటర్న్ బుల్ ప్లాట్లపై కూడా కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యంగా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా వైసీపీ అగ్రనేతలు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో రాజకీయంగా ఎలాంటి నష్టం జరగదని వారు భరోసా కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News