పెద్దారెడ్డికి పెద్ద చిక్కే వ‌చ్చింది… కిం క‌ర్తవ్యం..?

కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో రికార్డు సృష్టించిన నాయ‌కుడు. మూడున్నర ద‌శాబ్దాలుగా ఇక్కడ గెలుపు గుర్రాన్ని అధిరోహించిన జేసీ కుటుంబాన్ని ఓడించి [more]

Update: 2020-10-15 08:00 GMT

కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో రికార్డు సృష్టించిన నాయ‌కుడు. మూడున్నర ద‌శాబ్దాలుగా ఇక్కడ గెలుపు గుర్రాన్ని అధిరోహించిన జేసీ కుటుంబాన్ని ఓడించి వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించారు. నిజానికి ఇక్కడ అనేక పార్టీలు.. అనేక రూపాల్లో జేసీ వ‌ర్గానికి చెక్ పెట్టాల‌ని అనుకున్నాయి. కానీ, సాధ్యప‌డ‌లేదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న జేసీ కుటుంబం ఇక్కడ పాగా వేసింది. అయితే, 2014లో టీడీపీలో చేరిన త‌ర్వాత కూడా ఇక్కడ జేసీ ప్రభాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు.

స్థానిక వైసీపీ నేతలు….

అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఇక్కడ వైసీపీ నాయ‌కుడు కేతిరెడ్డి.. పెద్దారెడ్డి విజ‌యం సాధించారు. అయితే, ఏడాదిన్నర తిర‌గ‌కుండానే.. ఇక్కడ పెద్దారెడ్డికి పెద్ద త‌ల‌నొప్పే వ‌చ్చిప‌డింది. అదేంటంటే.. స్థానిక వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను దూరం పెట్టార‌ట‌. ఎవ‌రూ ఇప్పుడు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న ఏ కార్యక్రమం చేద్దామ‌న్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. వ‌చ్చినా.. చుట్టపు చూపుగా ప‌ల‌క‌రించి వెళ్లిపోతున్నారు. దీంతో త‌న‌పై జేసీ వ‌ర్గం కుట్ర చేస్తోంద‌ని అంటున్నారు పెద్దారెడ్డి.

పదవులు ఇస్తామని చెప్పి…..

కానీ, వాస్తవం ఏంటంటే.. పెద్దారెడ్డి.. తాడిప‌త్రిలో విజ‌యం సాధించ‌డం వెనుక‌.. వైసీపీలోని కీల‌క నాయ‌కులు ఎంద‌రో సాయం చేశారు. అదే స‌మ‌యంలో జేసీ వ్యతిరేక వ‌ర్గం కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించింద‌నే టాక్ ఉంది. వీరంద‌రికీ కూడా తాను క‌నుక గెలిస్తే.. పార్టీలో ప‌ద‌వులు ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చిన పెద్దారెడ్డి.. ఇప్పటి వ‌ర‌కు ఏ ఒక్కరికీ ప‌ద‌వి ఇప్పించ‌లేదు. పైగా మార్కెట్ యార్డ్ క‌మిటీ చైర్మన్ ప‌ద‌విని ఇప్పిస్తాన‌ని చెప్పి ఓ కీల‌క నేత‌కు ఇచ్చిన హామీని కూడా పెద్దారెడ్డి నిలబెట్టుకోలేదు. ఇక‌, వ‌లంటీర్ల నియామ‌కాల్లోను ఆయ‌న త‌న‌కు స‌హ‌క‌రించిన వారిని ప‌ట్టించుకోకుండా వ్యవ‌హ‌రించారట‌.

కుమారుడి హవాతో…..

ఈ ప‌రిణామాల‌కు తోడు పెద్దారెడ్డి త‌న కుమారుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే ప్రయ‌త్నాలు చేస్తూ.. త‌ను అధికారికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. త‌న కుమారుడు చ‌క్రం తిప్పేలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న చెప్పిందే వేదంగా ఇక్కడ న‌డుస్తోందని అంటున్నారు. మొత్తానికి పెద్దారెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌లా.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మ‌రోలా వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో.. నాయ‌కులే ఆయ‌న‌ను ఒంట‌రి చేయాల‌ని నిర్ణయించుకుని.. దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. మ‌రోప‌క్క, ఈ అవ‌కాశాన్ని జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. మొత్తానికి తాడిప‌త్రిలో వైసీపీ పాగా వేసినా.. హ‌వా నిల‌బెట్టుకునేలా లేద‌నే విమ‌ర్శలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News