కేశినేని మోస‌పోయాడా… మోసం చేశారా ?

ఒకే ఒక్క కార్పొరేష‌న్‌పై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్ని కార్పొరేష‌న్ల ప‌రిస్థితి ఎలా ఉన్నా టీడీపీ ఖ‌చ్చితంగా గెలిచే కార్పొరేష‌న్ విజ‌య‌వాడే అనుకున్నారు. అమరావ‌తి సెంటిమెంట్‌, [more]

Update: 2021-03-15 03:30 GMT

ఒకే ఒక్క కార్పొరేష‌న్‌పై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్ని కార్పొరేష‌న్ల ప‌రిస్థితి ఎలా ఉన్నా టీడీపీ ఖ‌చ్చితంగా గెలిచే కార్పొరేష‌న్ విజ‌య‌వాడే అనుకున్నారు. అమరావ‌తి సెంటిమెంట్‌, క‌మ్మ ఓట‌ర్లలో మార్పు… జ‌గ‌న్ ప్రభుత్వం వ‌చ్చాక విజ‌య‌వాడ బ్రాండ్ ప‌డిపోయింద‌న్న ప్రచారం…. చంద్రబాబు, లోకేష్ సైతం ప్రచారం చేయ‌డం… ఇటు ఎంపీ కుమార్తె మేయ‌ర్‌గా ఉండ‌డం లాంటి కార‌ణాల‌తో టీడీపీకి మంచి హైప్ వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు మూడు రోజుల ముందే పార్టీలో బ‌య‌లు దేరిన ముస‌లంతో ఈ హైప్ కాస్తా పాల‌పొంగులా చల్లారిపోయింది. తీరా ఈ రోజు ఫ‌లితాలు చూస్తే విజ‌య‌వాడ‌లో టీడీపీ నుంచి పెద్ద పోటీ లేకుండానే వైసీపీ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకుంది. వైసీపీ క‌నీసం మేయ‌ర్ అభ్యర్థిని కూడా ముందుగా ప్రక‌టించ‌లేదు… పైగా టీడీపీ అంత హ‌డావిడి లేకుండానే మేయ‌ర్ ప‌ద‌వి గెలుచుకుంది.

అంతర్గత కుమ్ములాటలే…..

పార్టీ ఖ‌చ్చితంగా గెల‌వాల్సిన చోట ఎందుకు ఓడిపోయింద‌న్నది విశ్లేషిస్తే పార్టీలో అంత‌ర్గత కుమ్ములాట‌ల‌తో పార్టీ ప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చేసింది. ఎంపీ కేశినేని నాని గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్పటి నుంచే ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ముందుకు వెళుతున్నారు. అంద‌రూ ఓడినా నేను గెలిచాను అన్న ధీమాతో న‌గ‌ర పార్టీ నేత‌ల‌ను ఎవ్వరిని క‌లుపుకోకుండా ముందుకు వెళ్లారు. కేశినేని నానికి వ్యతిరేకంగా బోండా, బుద్ధా, నాగుల్ మీరా లాంటి కీల‌క నేత‌లంతా అద‌నుచూసి దెబ్బకొట్టారు. కేశినేని నానికి స‌హ‌క‌రించ‌బోమ‌ని ప్రెస్‌మీట్ పెట్టేశారు. చివ‌ర‌కు చంద్రబాబు జోక్యంతో సాయంత్రానికే ఈ వివాదం చ‌ల్లారినా అప్పటికే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ అయితే జ‌రిగిపోయింది.

అందరూ వ్యతిరేకమే…..

ఎంపీ కేశినేని నాని పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వేలుపెట్టడాన్ని బుద్ధా వెంక‌న్న, నాగుల్ మీరా ఇద్దరూ స‌హించ‌లేక‌పోతూ వ‌స్తున్నారు. ఇప్పుడు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పాటు కేశినేని నాని ఎంపీగా ఉండ‌డంతో ఓవ‌రాల్‌గా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం పార్టీని కంట్రోల్ చేయ‌డాన్ని ఆ ఇద్దరు నేత‌లు స‌హించ‌లేక‌పోయారు. ఇక్కడ వీరు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేదన్నది వాస్తవం. ఇటు సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గానికి మేయ‌ర్ ప‌ద‌వి తీసుకుపోవాల‌ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర ప్రయ‌త్నాలు చేశారు. కేశినేని నాని ముందుగానే త‌న కుమార్తెను మేయ‌ర్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవ‌డంతో పాటు అధిష్టానం సైతం ఆయ‌న బెదిరింపుల‌కు త‌లొగ్గక త‌ప్పలేదు. దీంతో ఉమా సైతం గుస్సాగానే ఉన్నారు.

కమ్మ ఈక్వేషన్ దెబ్బకొట్టిందా?

ఇలా కేశినేని నాని దూకుడుతో పార్టీలోనే అంద‌రూ నేత‌లకు దెబ్బేయాల‌ని చూస్తే… వాళ్లంద‌రూ కలిసి ఆయన్ను క‌ట్టగ‌ట్టుకుని మ‌రీ ప‌క్కనే ఉన్న కృష్ణాలో ముంచేశార‌న్న సెటైర్లు కూడా ప‌డుతున్నాయి. ఇక న‌గ‌రంలో కాస్తో కూస్తో వ‌ర్గం ఉన్న మాజీ మంత్ర దేవినేని ఉమానే ఎంపీ కేశినేని నాని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న సైతం ఈ ఎన్నిక‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. అస‌లే క‌మ్మ ఈక్వేష‌న్ పార్టీకి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే మైన‌స్ అయ్యింద‌న్న చ‌ర్చలు ఉన్నా కూడా మ‌ళ్లీ అదే వ‌ర్గానికి చెందిన నేత‌నే మేయ‌ర్ అభ్యర్థిగా ప్ర‌క‌టించ‌డం కూడా మైన‌స్ అయ్యింది. అదే ఎన్నిక‌ల్లో గెలిచి వ‌చ్చాక మేయ‌ర్ అభ్యర్థిని ప్రక‌టిస్తామ‌న్న ప్రక‌ట‌న చేసి ఉంటే ఇక్కడ ఇంత దారుణ ఫ‌లితం వ‌చ్చి ఉండేదే కాద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

వైసీపీ వ్యూహం ముందు…..

వైసీపీ ముందు నుంచే విజ‌య‌వాడ‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టింది. జ‌గ‌న్ ఎక్కడిక‌క్కడ నేత‌ల‌కు వార్నింగ్‌లు ఇచ్చేశారు. పైగా మంత్రి పెద్దిరెడ్డికి ఇక్కడ ప్రత్యేక బాధ్యత‌లు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా అధిష్టానం బాగా సాయం చేసింది. న‌గ‌రంలో ఉన్న మంత్రి వెల్లంప‌ల్లి, బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ మ‌ల్లాది విష్ణుతో పాటు తూర్పులో అవినాష్ సైతం గ‌ట్టిగా పోరాడ‌డంతో వైసీపీ ముందు టీడీపీ తల వంచ‌క త‌ప్పలేదు.

Tags:    

Similar News