కేరళకే ఎందుకింత కష్టం?

కేరళ అక్షరాస్యతలో తొలి స్థానం. అత్యధిక శాతం మంది ఉద్యోగులు. వాతావరణ పరిస్థితులు కూడా స్వర్గాన్ని తలపిస్తాయి. అలాంటి కేరళ తరచూ అతలాకుతలమవుతోంది. ప్రతి ఏడాది ఏదో [more]

Update: 2020-04-01 17:30 GMT

కేరళ అక్షరాస్యతలో తొలి స్థానం. అత్యధిక శాతం మంది ఉద్యోగులు. వాతావరణ పరిస్థితులు కూడా స్వర్గాన్ని తలపిస్తాయి. అలాంటి కేరళ తరచూ అతలాకుతలమవుతోంది. ప్రతి ఏడాది ఏదో ఒక విపత్తుతో కోలుకోలేని దెబ్బ తీస్తుంది. దీంతో కేరళ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది. గతంలో వచ్చిన నిఫా వైరస్ కేరళను అతలాకుతలం చేసింది. నిఫా వైరస్ కారణంగా కేరళలో 17 మంది చనిపోయారు. ఆ తర్వాత వరసగా వరదలు కేరళలో విలయతాండవం చేశాయి.

వరదలు..వైరస్ లతో….

అయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏమాత్రం అధైర్య పడకుండా ముందుకు సాగుతున్నారు. నిఫా వైరస్ అనుభవంతో కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2018, 2019 సంవత్సరాల్లో వచ్చిన వరదల కారణంగా దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. కేరళకు దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయినా తేరుకున్న కేరళ తిరిగి కోలుకునే ప్రయత్నాలు చేస్తోంది. కమ్యునిస్టు ప్రభుత్వం కావడంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అరకొరగా అందుతుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి…..

వరదల్లో 20 వేల కోట్ల నష్టం వాటిల్లినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అతి స్వల్పంగానే ఉంది. అయినా పినరయి విజయన్ ఏ మాత్రం లెక్క చేయలేదు. నిజానికి దేశంలోనే కేరళలో తొలి కరోనా వైరస్ నమోదయింది. చైనా నుంచి వచ్చిన యువతికి కరోనా వైరస్ సోకింది. వెంటనే ఆమెకు వైద్య చికిత్స అందించడంతో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడంతో తిరిగి చర్చనీయాంశమైంది.

ఎక్కువ మంది విదేశాల్లో…..

వైరస్ లు కేరళనే ఎక్కువగా తాకడానికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి వేలాది మంది ఇతర దేశాల్లో ఉపాధి పొందుతుండటమే. వారు ఏడాదిలో ఒకసారి కేరళకు వస్తుంటారు. అన్ని దేశాల్లో కేరళ వాసులు వివిధ వృత్తుల్లో ఉన్నారు. ప్రధానంగా నర్సులుగా కేరళకు చెందిన వారు ఎక్కువగా కన్పిస్తారు. దీంతో పినరయి విజయన్ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీ కంటే ముందుగానే ఇక్కడ ప్రభుత్వం 20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అనుమానితులకు వైద్య పరీక్షలను ఎక్కువగా నిర్వహించి ఐసొలేషన్ కు తరలించింది. 4,603 రిలీఫ్ క్యాంప్ లను ఏర్పాటు చేసింది. బ్రేక్ ది చైన్ నినాదంతో కేరళ ముందుకు వెళుతుంది. అయినా కేరళలో పాజిటివ్ సంఖ్యలు ఆగడం లేదు. అయినా సరే పినరయి విజయన్ టీం మాత్రం అహర్నిశలూ కరోనాను కట్టడి చేేసేందుకు ప్రయత్నిస్తుంది. కేరళ త్వరగా కోలుకుంటుందని ఆశిద్దాం.

Tags:    

Similar News