కేరళ ఎన్నికల్లో శబరిమల కీలకంగా మారనుందా?

కేరళ రాజకీయం ఇప్పుడు శబరిమల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాంశంగా తీసుకుంటున్నాయి. ఒక్క ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్) [more]

Update: 2021-03-05 16:30 GMT

కేరళ రాజకీయం ఇప్పుడు శబరిమల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాంశంగా తీసుకుంటున్నాయి. ఒక్క ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్) తప్ప అన్ని పార్టీలు శబరిమల అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆఖరికి మత విశ్వాసాలను వ్యతిరేకించే అధికార సీపీఎం కూడా ఈ విషయమై ఆచితూచి మాట్లాడుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని ప్రకటించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు శబరిమల అంశాన్ని భుజానికెత్తుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సయితం…..

మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన హస్తం పార్టీ తొలుత ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే శబరిమల ఆలయంలో మత విశ్వాసాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్, సీఎల్పీ నేత రమేష్ చెన్నితాల, సీనియర్ నాయకుడు తిరుచెందూరు రాధాక్రిష్టన్, మాజీ సీఎం ఉమెన్ చాందీ తదితరులు ఈ మేరకు ప్రకటనలు చేశారు. శబరిమల ఆలయంలో 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై ఎప్పటినుంచో నిషేధం ఉంది. దీనిని జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఆర్. ఎఫ్. నారిమన్, ఎ.ఎం. ఖాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ 2018లో కొట్టి వేసింది. ఈ తీర్పుపై కొన్ని వర్గాల ప్రజల్లో నిరసన వ్యక్తమైంది. మత విశ్వాసాలకు దూరంగా ఉండే సీపీఎం తీర్పును స్వాగతించింది. తీర్పు అమలుకు చర్యలు కూడా తీసుకుంది. కొంతమంది సంప్రదాయవాదులు దీన్ని వ్యతిరేకించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్యేమార్గాన్ని అనుసరించింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో….

కారణాలు ఏమైనప్పటికీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ దెబ్బతిన్నది. శబరిమల అంశంపై స్పష్టమైన విధానం లేకపోవడం, మెజార్టీ ప్రజల మనోభావాలను విస్మరించడం వల్లే ఓడిపోయామన్నది కాంగ్రెస్ భావన. దీనిని సరిదిద్దుకోలేకపోతే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజల తిరస్కారానికి గురవుతామన్నభయంతో ఈనిర్ణయానికి వచ్చింది. కేరళలో ఈ పార్టీకి క్రిస్టియన్లు, ముస్లిములు ప్రధాన మద్దతుదారులు. అయినప్పటికీ హిందువుల ఓట్లు పొందాలంటే శబరిమల విషయంలో స్పష్టమైన వైఖరి అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ర్టంలో సీపీఎంకి హిందువులు దన్నుగా నిలుస్తుండటం గమనార్హం. హిందూత్వకు ప్రతినిధినని చెప్పుకునే భాజపా సహజంగానే ఈ విషయంలో హస్తం పార్టీకి అండగా నిలిచింది.

సుప్రీంకోర్టులో విచారణ….?

దీంతో అధికార సీపీఎం సైతం తన వైఖరిని మార్చుకుంది. ప్రస్తుతం శబరిమల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దాని తీర్పు మేరకు ముందుకు సాగుతామని, అదే సమయంలో ప్రజల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే నాయకత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఒక్క శబరిమల అంశంమే కాకుండా వివిధ మతాల్లో మహిళల పట్ల వివక్షతపై ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇందులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. బానుమతి, జస్టిస్ ఎం.ఎం శాంతన గౌడర్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి,జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. కోర్టు తీర్పునకు ముందే కేరళ పార్టీలు ఓట్ల వేటలో మతాన్ని పావుగా వాడుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News