పత్తికొండ అండగా లేదటగా..?

కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి సత్తా చాటింది. ఈసారి కూడా మళ్లీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంటే పైచేయి [more]

Update: 2019-03-17 11:00 GMT

కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి సత్తా చాటింది. ఈసారి కూడా మళ్లీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంటే పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన స్థానాలను మళ్లీ దక్కించుకోవడంతో పాటు ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక్కడ 2009లో కూడా కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. దీంతో పత్తికొండ కేఈ కుటుంబానికి బలమైన నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఏడాది క్రితమే పాదయాత్రలో భాగంగానే వైఎస్ జగన్ అభ్యర్థిని ప్రకటించారు. చెరుకులపాడు శ్రీదేవి వైసీపీ తరపున ఈసారి పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో ఇద్దరు కొత్త అభ్యర్థుల మధ్య పత్తికొండలో పోటీ నెలకొననుంది.

కేఈ కుటుంబం హవా కొనసాగుతుందా..?

2014లో కేఈ కృష్ణమూర్తి మొదటిసారి పత్తికొండ నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డిపై ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జిల్లాలోనే సీనియర్ నేతగా ఉన్న ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకులపాడు నారాయణరెడ్డి ఈ నియోజకవర్గంలో ఏకంగా 31 వేల ఓట్లు సాధించి రాష్ట్రవ్యాప్తంగా డిపాజిట్ దక్కించుకున్న కొద్దిమంది కాంగ్రెస్ నేతల్లో ఒకరిగా నిలిచారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గంలో ఉన్న ఆయన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ సమన్వయకర్తగా ఆయనను నియమించారు. కొంతకాలం పాటు చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఆయనను ఏడాదిన్నర క్రితం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు ఉన్నారనే ఆరోపణలు నారాయణరెడ్డి వర్గం నుంచి వచ్చాయి. తర్వాత పోలీసులు ఆయన పాత్ర ఏమీ లేదని ఈ కేసు నుంచి శ్యాంబాబును తొలగించారు.

గట్టి పోటీ ఇవ్వనున్న శ్రీదేవి

నారాయణరెడ్డి హత్య తర్వాత ఆయన భార్య శ్రీదేవిని పత్తికొండ వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలు బాగానే చేపట్టారు. ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి ఉంది. ఆమె భర్త నారాయణరెడ్డికి ప్రత్యేకంగా కొంత ఓటు బ్యాంకు ఉంది. దీనికి ఈసారి తమ పార్టీ ఓటు బ్యాంకు కూడా తోడయితే విజయం సాధించవచ్చని వైసీపీ ధీమాగా ఉంది. అయితే, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. ఆయనకు పత్తికొండలో కూడా కొంత వర్గం ఉంది. కేఈ కృష్ణమూర్తి మంత్రిగా ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేశారు. టీడీపీ సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఇవి శ్యాంబాబుకు కలిసిరానున్నాయి. అయితే, ఇదే సమయంలో శ్యాంబాబుపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి కేఈ వారుసుడికి వైసీపీ నుంచి శ్రీదేవి గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News