కేఈ కూడానా….?

తెలుగుదేశం పార్టీకి నిన్న మొన్నటి వరకూ పెద్దదిక్కుగా ఉన్న నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం అని చెప్పాలి. సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం [more]

Update: 2019-07-18 14:30 GMT

తెలుగుదేశం పార్టీకి నిన్న మొన్నటి వరకూ పెద్దదిక్కుగా ఉన్న నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం అని చెప్పాలి. సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కొందరైతే… తమ వారసుల రాజకీయ భవితవ్యం బాగుండాలని మరికొందరు పార్టీని వీడుతుండటం మనం చూశాం. ఇక తాజాగా రాయలసీమ జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. ఇందులో ప్రముఖంగా విన్పిస్తున్న పేరు కేఈ కృష్ణమూర్తి.

అసంతృప్తిని బాహాటంగానే….

కేఈ కృష్ణమూర్తి నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖను ఐదేళ్ల పాటు చంద్రబాబునాయుడు అప్పగించారు. అయితే రెవెన్యూ శాఖలో తన ప్రమేయం లేకుండానే బదిలీలు జరగడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కేఈని బాధించిందని చెబుతారు. ఆయన తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

కుమారుడి భవిష్యత్ కోసమే….

తనకు తెలుగుదేశం ప్రభుత్వంలో అవమానాలు జరుగుతున్నా తన కుమారుడు శ్యాంబాబు భవిష్యత్ కోసం కేఈ కృష్ణమూర్తి దిగమింగుకుని ఉన్నారన్న వాదన కూడా లేకపోలేదు. అందుకే ఈసారి జరిగిన ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు. ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయమిది. తన కుమారుడు శ్యాంబాబును పత్తికొండ నుంచి, సోదరుడు కేఈ ప్రతాప్ ను డోన్ నుంచి గెలిపించుకోలేకపోయారు. ఇందుకు కారణం బీసీ వర్గాలు పార్టీకి దూరం కావడమేనని కేఈ భావిస్తున్నారు.

పార్టీని వీడాలని…?

ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకు దూరమయిందన్న వాదనలో నిజముందని కేఈ సయితం నమ్ముతున్నారు. కొన్ని అనాలోచిత నిర్ణయాలవల్లనే టీడీపీకి బీసీలు దూరమయ్యారని ఆయన పలు సందర్బాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే తాను రాజకీయాలకు దూరం కావడంతో తన కుటుంబాన్ని మాత్రం టీడీపీలో ఉంచడానికి కేఈ ఇష్టపడటం లేదంటున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరటం ఇష్టం లేని కేఈ ఇక తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కుటుంబం పార్టీకి దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. మరి కేఈ ఏ పార్టీలోకి వెళతారన్నది సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News