కృష్ణమూర్తి భయం అదేనట

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం పూర్తిగా మౌనంగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయాల జోలికి రావడం లేదు. ఎన్నికలకు ముందు [more]

Update: 2019-08-04 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం పూర్తిగా మౌనంగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయాల జోలికి రావడం లేదు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన కేఈ కృష‌్ణమూర్తి ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయి పోయారు. ఓటమి బాధ నుంచి తేరుకోలేకనే అని కొందరు అంటుంటే అసలు కారణం వేరేది ఉందన్నది సన్నిహితుల అభిప్రాయం. కేఈ కృష్ణమూర్తి సోదరులు కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరించడం ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల ఫలితాల తర్వాత….

కర్నూలు జిల్లా అంటేనే కేఈ కృష్ణమూర్తి పేరు గుర్తొస్తుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకూ దాదపు నలభై ఏళ్ల పాటు రాజకీయాలు నెరపిన వ్యక్తి. చంద్రబాబునాయుడుకు సమకాలీన నేతగా కేఈ కృష్ణమూర్తికి పేరుంది. అలాగి కేఈ కృష్ణమూర్తి ఈ ఎన్నికల ఫలితాలను చూసి పూర్తిగా నిరుత్సాహంలో పడిపోయారట. ఎన్నికలకు ముందే కేఈ కృష‌్ణమూర్తి రాజకీయంగా విశ్రాంతి తీసుకోనున్నట్లు ప్రకటించారు.

హత్య కేసులో…..

తాను ప్రాతినిధ్యం వహించే ప్రత్తికొండ నియోజకవర్గంలో తనయుడు కేఈ శ్యాంబాను పోటీకి దింపారు. డోన్ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్ ను బరిలో ఉంచారు. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇది కేఈ కృష‌్ణమూర్తి దిగులుకు ఒక కారణమైతే.. మరో బలమైన కారణం తనయుడు కేఈ శ్యాంబాబుపై హత్య కేసు నమోదయి ఉండటమే. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

తనయుడికి ఇబ్బంది కలగకుండా….

ప్రస్తుతం ప్రత్తికొండ నియోజకవర్గానికి నారాయణరెడ్డి భార్య శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన కుమారుడు శ్యాంబాబుకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోనన్న ఆందోళన కేఈ కృష్ణమూర్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రత్తికొండకు వెళ్లొద్దని కేఈ శ్యాంబాబుకు ఆయన సూచించినట్లు చెబుతున్నారు. తాను జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుందనే కేఈ కృష‌్ణమూర్తి మౌనంగా ఉన్నారన్నది సన్నిహితుల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరి శ్రీదేవి తన భర్త హత్య కేసులో దోషుల సంగతి తేల్చకుండా ఊరుకుంటారా?

Tags:    

Similar News