ఆ ట్యాగ్ లైన్ ఇక పనిచేయదా?

కేఈ కృష్ణమూర్తి బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. 2014లో ఎమ్మెల్యే గెలిచిన కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. [more]

Update: 2020-07-18 15:30 GMT

కేఈ కృష్ణమూర్తి బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. 2014లో ఎమ్మెల్యే గెలిచిన కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం కేఈ కృష్ణమూర్తిది. ఆయన అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో బలహీన వర్గాల నేతగా ఎదగడం ఒక్క కేఈ కృష్ణమూర్తికే సాధ్యమయిందని చెప్పక తప్పదు.

రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించి…..

గత ఎన్నికలకు ముందే ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన కుటుంబం నుంచి రాజకీయంగా ఇక ఎదిగే వాళ్లు లేరన్నది ఆ ఎన్నికల్లోనే స్పష్టమయింది. కేఈ కృష్ణమూర్తి హేమాహేమీలను ఎదుర్కొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారినే ధీటుగా ఎదుర్కొన్నారు. కేఈ కృష్ణమూర్తి 1970లో యూత్ కాంగ్రెస్ లో పని చేశారు. 1978లో డోన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1983లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని గెలిచారు కేఈ కృష్ణమూర్తి.

హేమాహేమీలను ఓడించి…..

ఆ తర్వాత టీడీపీలో చేరి 1985లో మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు కేఈ కృష్ణమూర్తి. ఎన్టీఆర్ తో విభేదాల కారణంగా తిరిగి కాంగ్రెస్ లో కి వచ్చి 1989లో మళ్లీ గెలిచారు. మొత్తం ఆరుసార్లు అసెంబ్లీకి, ఒక సారి పార్లమెంటుకు కేఈ కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. 1999లో కర్నూలు పార్లమెంటుకు పోటీ చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఓడించగలిగారు. అంత చరిత్ర ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది. బలహీన వర్గాల ట్యాగ్ లైన్ ప్రస్తుతం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి ఏమాత్రం ఉపయోగ పడటం లేదంటున్నారు.

కుటుంబంలో విభేదాలు…..

కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా తప్పుకోవడంతో కుటుంబంలోనే విబేదాలు తలెత్తాయి. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. కుమారుడు శ్యాంబాబు మెడపై హత్య కేసు వేలాడుతోంది. దీంతో కేఈ కృష్ణమూర్తి పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయి పోయారంటున్నారు. కేఈ కృష్ణమూర్తి డోన్, పత్తికొండల్లో పట్టు ఉన్నప్పటికీ కనీసం స్థానిక సంస్థల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయింది. ఇది ఆ కుటుంబం దుస్థితికి అద్దం పడుతుందంటున్నారు. కేఈ కృష్ణమూర్తి తర్వాత బలహీన వర్గాల నేతగా మరొకరు ఆ కుటుంబం నుంచి వచ్చే అవకాశమే కన్పించడం లేదు.

Tags:    

Similar News