కేఈ ఇక అక్కడ ఆశలు వదిలేసుకున్నట్లేనా?

క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం. ఒక‌ప్పుడు టీడీపీకి ప్రతిష్టాత్మక నియోజ‌క‌వ‌ర్గం. క‌ర్నూలులో రాజ‌కీయంగా దూకుడు ప్రదర్శించిన కేఈ కృష్ణమూర్తి, ఆయ‌న సోద‌రుడు కేఈ ప్రభాక‌ర్‌ల‌కు కూడా ఈ [more]

Update: 2020-04-15 00:30 GMT

క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం. ఒక‌ప్పుడు టీడీపీకి ప్రతిష్టాత్మక నియోజ‌క‌వ‌ర్గం. క‌ర్నూలులో రాజ‌కీయంగా దూకుడు ప్రదర్శించిన కేఈ కృష్ణమూర్తి, ఆయ‌న సోద‌రుడు కేఈ ప్రభాక‌ర్‌ల‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం అత్యంత ప్రతిష్టాత్మకం. ఇంకా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజ‌య్‌భాస్కర్ రెడ్డి కుటుంబానికి కూడా ఒక‌ప్పుడు డోన్ కంచుకోట‌. ఇక కేఈ ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే 1999, 2009లో వీరే ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. దీనికి ముందు కాంగ్రెస్ నుంచి కోట్ల సుజాత‌మ్మ కూడా 2004లో ఇక్కడ విజ‌యం సాధించారు. ఇక‌, 2014, 2019లో మాత్రం వైసీపీ నాయకుడు, ప్రస్తుత ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయిన‌ప్పటికీ.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోల్పోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు ఉన్నారు? పార్టీని ఎవ‌రు ముందుకు న‌డిపిస్తారు? అనే ప‌రిస్థితికి దిగ‌జార‌డ‌మే ఇప్పుడు టీడీపీ తీవ్ర చ‌ర్చకు కార‌ణ‌మ‌వుతోంది.

జెండా ఎగరేయ వచ్చని…

డోన్‌లో కేఈ కుటుంబానికి ఎంత ప‌ట్టు ఉందో.. కోట్ల కుటుంబానికి కూడా అంతే ప‌ట్టు ఉంది. అనుచ‌రులు కూడా వేల మంది ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కేఈ కుటుంబం నుంచే కేఈ ప్రతాప్ ఇక్కడ పోటీకి దిగారు. అదే స‌మ‌యంలో కోట్ల, కేఈ వ‌ర్గాలు పాత వైరాలు ప‌క్కన పెట్టి టీడీపీలో జ‌ట్టుక‌ట్టాయి. చంద్రబాబు వ్యూహాత్మకంగా కోట్లను పార్టీలోకి తీసుకున్నారు. కేఈ కృష్ణమూర్తి సోద‌రుల‌ను కూడా చేతులు క‌లిపేలా చేశారు. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘకాలంగా బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలు క‌ల‌సి పోవ‌డంతో డోన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ హ‌వా సాగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, కీల‌క‌మైన డోన్‌లో టీడీపీ జెండా ఎగ‌ర‌డం కూడా ఖాయ‌మ‌నే అనుకున్నారు.

అభివృద్ధి చేసినా….

కానీ, అనూహ్యంగా ఇక్క‌డ టీడీపీ మ‌రోసారి ఓడిపోయింది రెండో సారి వ‌రుస‌గా బుగ్గన వైసీపీ జెండాను రెప‌రెప‌లాడించారు. నిజానికి కేఈ కృష్ణమూర్తి గ‌డిచిన చంద్రబాబు హ‌యాంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న డోన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోయిన హ‌వాను ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే జోరుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేప‌ట్టారు. మేం అంతా చేతులు క‌లిపాం.. వైసీపీ నేత బుగ్గన మట్టి క‌ర‌వ‌డ‌మే ల‌క్ష్యం అంటూ కేఈ కృష్ణమూర్తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రసంగాలు కూడా చేశారు.

పార్టీలోనే గ్రూపులుగా….

కానీ, చిత్రంగా ఆరు మాసాలు గ‌డిచేస‌రికి వ్యూహం త‌ల‌కిందులైంది. కేఈ కుటుంబంలోనే విభేదాలు రావ‌డం, కేఈ సోద‌రుడు, మాజీ మంత్రి ప్రభాక‌ర్ పార్టీని వీడ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అదే స‌మ‌యంలో కోట్ల ఫ్యామిలీ కూడా కేఈ వ‌ర్గంతో మ‌ళ్లీ విభేదిస్తోంది. ఇక‌, కేఈ కృష్ణమూర్తి వ‌యోవృద్దుడు కావ‌డంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో డోన్‌లో టీడీపీ జెండా నిల‌బెట్టేవారు.. ప‌ట్టుకునేవారు.. ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డంపై స‌ర్వత్రా చ‌ర్చ సాగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడు ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆలూరులో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత‌మ్మ కూడా డోన్ వైపు దృష్టి సారిస్తున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను లేదా త‌న కుమారుడు రాఘ‌వేంద్రరెడ్డిని ఇక్కడ నుంచి బ‌రిలోకి దింపే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ఏదేమైనా డోన్ టీడీపీ రాజ‌కీయం మాంచి ర‌స‌కందాయంలో ప‌డింది.

Tags:    

Similar News