కేఈ, కోట్ల మార్కు రాజ‌కీయాలకు చెక్ ప‌డిందా..?

క‌ర్నూలు రాజకీయాలు చాలా డిఫ‌రెంట్‌. కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ రాజ‌కీయాలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వీరిలో వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. దీంతో ఒక‌ప్పుడు [more]

Update: 2020-06-29 08:00 GMT

క‌ర్నూలు రాజకీయాలు చాలా డిఫ‌రెంట్‌. కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ రాజ‌కీయాలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వీరిలో వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. దీంతో ఒక‌ప్పుడు ఎవ‌రి హ‌వా ఎంత‌? ఎవ‌రి దూకుడు ఎంత‌? ప‌్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఏమేర‌కు చేరువ అవుతున్నారు? అనే విష‌యాలపై గ‌ట్టి ప‌రిశీల‌న‌, పోటీ త‌త్వం, పోటా పోటీ వంటివి ఉండేవి. గ‌త మూడున్నర ద‌శాబ్దాల‌కు పైగా ఈ రెండు కుటుంబాల మ‌ధ్య జిల్లా రాజ‌కీయాల్లో ఆధిప‌త్య పోరాటం నడిచేది. ఈ క్రమంలోనే వీరిమ‌ధ్య టీడీపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌గా రాజ‌కీయ పోరాటం హోరాహోరీగా జ‌రిగిన‌ సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన నాయకులు మౌనం పాటిస్తున్నారు. కొంద‌రు వ‌యోవృద్ధులు కావ‌డం, మ‌రికొంద‌రిలో చీలిక రావ‌డం, ఇంకొంద‌రిలో ఉత్సాహం స‌న్నగిల్లడం వంటి కార‌ణాల‌తో ఎవ‌రికి వారే అన్నట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

రెండు కుటుంబాలు…..

వాస్తవానికి క‌ర్నూలు జిల్లా పేరు చెప్పగానే కోట్ల, కేఈ కుటుంబాలు ఎక్కువ‌గా జ‌నాల నోళ్లలో నానేవి. కొన్ని ద‌శాబ్దాల పాటు నువ్వానేనా అనే రేంజ్‌లో ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయాలు నడిచాయి. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజ‌య భాస్కర్‌రెడ్డి టైం నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండేది. కోట్ల కుటుంబం నుంచి కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి, కేఈ కుటుంబం నుంచి కృష్ణ‌మూర్తిలు రాజ‌కీయాల్లో దూకుడు ప్రద‌ర్శించారు. కోట్ల కాంగ్రెస్ త‌ర‌ఫున‌, కేఈ టీడీపీ త‌ర‌ఫున ఢీ అంటే ఢీ అనేలా రాజ‌కీయాలు చేసుకున్నారు. త‌ర్వాత కాలంలో కోట్ల కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

ఇద్దరూ ఓటమి పాలయి….

కేఈ ఫ్యామిలీ నుంచి కూడా ఆయ‌న సోద‌రుడు ప్రభాక‌ర్‌ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఇలా ఒక‌ప్పుడు క‌ర్నూలులో ఉన్న రాజ‌కీయాలు ఇప్పడు క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ అంత‌రించిపోయిన నేప‌థ్యంలో కోట్ల కుటుంబం గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుం ది. కోట్ల కేఈ కుటుంబాల‌ను రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు క‌లిపేలా చేశారు. కేఈ కుటుంబం నుంచి ఆయ‌న వార‌సుడు రంగంలోకి దిగారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఇరు ప‌క్షాలు క‌లిసిమెలిసి ప్రచారం చేసుకున్నా.. జ‌గ‌న్ సునామీ ధాటికి ఓడిపోక త‌ప్పలేదు. కేఈ కుటుంబం ప‌త్తికొండ‌, డోన్‌లో ఓడితే, కోట్ల కుటుంబం క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరులో ఓడింది.

ఆ సఖ్యత ఏదీ?

అయితే, ఇప్పుడు ఏడాది పూర్తయింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందున్న ఐక్యత‌, స‌ఖ్యత ఇప్పుడు కేఈ, కోట్ల కుటుంబాల్లో ఎక్కడా క‌నిపించడం లేదు. టీడీపీ కోసం క‌లిసి ప‌నిచేస్తున్న వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. కృష్ణమూర్తి పూర్తిగా రాజ‌కీయ స‌న్యాసం చేయ‌గా.. ఆది దిశ‌గానే కోట్ల దంప‌తులు కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగేళ్ల స‌మ‌యం ఉండ‌డం, వ‌యోవృద్ధులు కావ‌డంతో రాజ‌కీయాల‌కు కోట్ల కుటుంబం దూరం అవుతోంద‌ని జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది. కేఈ కుటుంబంలోనూ ఆ త‌ర‌హాలో రాజ‌కీయాలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేని ప‌రిస్థితి పైగా కేఈ కుటుంబంలో చీలిక వ‌చ్చి వైసీపీకి మ‌ద్దతిస్తున్నారు.

ఇక చరిత్రగానే….

ఈ నేప‌థ్యంలో కేఈ కుటుంబం కూడా టీడీపీలో యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. కేఈ సోద‌రుడు ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాక‌ర్ సైతం టీడీపీకి రాజీనామా చేసేశారు. ఫ‌లితంగా ఒక‌ప్పుడు జిల్లాలో ఓ రేంజ్‌లో కొన‌సాగిన కేఈ, కోట్ల కుటుంబాల రాజ‌కీయాలు దాదాపు స‌న్నగిల్లాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. మొత్తానికి క‌ర్నూలు రాజ‌కీయాల్లో కోట్ల, కేఈ ఫ్యామిలీ రాజ‌కీయ చ‌రిత్రలో చేరిపోయింద‌నే చెప్పాలి.

Tags:    

Similar News