తూచ్..అంతా మనోళ్లే.....!

Update: 2018-04-29 15:30 GMT

కేసీఆర్ మాటకారే కాదు. చమత్కారి. ఒక్క దెబ్బతో వంద పిట్టలు కొట్టగలరు. తాజా ప్లీనరీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులపై మాటల మంత్రజాలం ప్రయోగించారు. గడచిన కొంతకాలంగా ఆందోళనతో , అయోమయంలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఒక్క దెబ్బకు దారికి తెచ్చేశారు. జోరు, హుషారు నింపారు. అబ్బే మీకేం భయం లేదు, అందరికీ టిక్కెట్లిస్తానంటూ అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అభయమిచ్చేశారు. ఇది వారికి గొప్ప రిలీఫ్. కానీ ఇందులోనూ వ్యూహం దాగి ఉంది. పుంజుకుంటున్న కాంగ్రెసును కట్టడి చేయడం, గోడదూకాలని చూస్తున్న తన సొంత ఎమ్మెల్యేల ముందరి కాళ్లకు బంధం వేయడమే కేసీఆర్ ఎత్తుగడ. దీంతో అటు పార్టీలో అసమ్మతిని పూర్తిగా అదుపులోకి తెచ్చేశారు. కాంగ్రెసు కదనకుతూహలంపై నీళ్లు చిలకరించారు.

సర్వేల సంగతేమిటి?....

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ నిర్వహించినన్ని సర్వేలను వేరే ఏ పార్టీ కూడా నిర్వహించలేదు. ప్రొఫెషనల్ సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చి మరీ ఇప్పటికే 12 సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులో పది సర్వేలు పూర్తిగా బయటి సంస్థలు నిర్వహించినవి. రెండు మాత్రం ప్రభుత్వం యంత్రాంగం, ఇంటిలిజెన్సు సమాచారం ఆధారంగా కసరత్తు చేసినవి. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలలో 28 నుంచి 35 మంది ప్రజల్లో ఆదరణ కోల్పోయారనేది ఆంతరంగిక అంచనా. వీరిలో పన్నెండు మంది ఆర్థికంగా బలమైన నేతలుగా పార్టీ గుర్తించింది. మరో 8 మంది సామాజిక సమీకరణల రీత్యా అవసరమైన అభ్యర్థులు. అయినప్పటికీ వీరికి టిక్కెట్లు ఇస్తే కాంగ్రెసు పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపితే పార్టీకి ఎదురీత తప్పదని కేసీఆర్ గ్రహించినట్లుగా చెబుతున్నారు. అందుకనే ఆరునెలల ముందు నుంచే ఆయన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. పనిచేయని వారికి టిక్కెట్లు ఇవ్వమంటూ ఘాటుగానే చెప్పేశారు. నియోజకవర్గాల్లో ప్రజల ఆదరణ పొందని వారికీ టిక్కెట్లు లేనే లేవన్నారు. దీంతో బెంబేలెత్తిపోయిన కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు. తమకు టిక్కెట్లు పక్కాగా రావని తేలినవారు కాంగ్రెసులోకి వెళ్లాలనే యత్నాలూ ప్రారంభించారు. దీనిని అవకాశంగా మలచుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆహ్వానాలు పంపుతోంది. ఎన్నికల ముందు ఇటువంటి ఫిరాయింపులు జోరందుకుంటే ప్రజల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఎన్నికలపై కూడా ప్రభావం పడుతుంది. సర్వేల సమాచారం తమ పార్టీ కొంప ముంచుతుందని కేసీఆర్ కు పార్టీ వర్గాలు మొరపెట్టుకున్నాయి. దీంతో భరోసా నివ్వాలనే గడచిన పదిహేను రోజులుగా కేసీఆర్ యోచన చేస్తున్నట్లుగా తెలిసింది. ప్రెస్ మీట్ నిర్వహించి అభయమిద్దామని తొలుత భావించినప్పటికీ పార్టీ ప్లీనరీలో ప్రకటిస్తేనే సమంజసంగా ఉంటుంది. ప్రజల్లోకి, క్యాడర్ లోకి కూడా వెళుతుందనే భావనతో కేసీఆర్ ప్లీనరీ వేదికపైనుంచే ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లిస్తామని ప్రకటన చేశారు.

మాటకు మన్నన దక్కేనా...?

పార్టీలో జోష్ నింపేందుకు , అసంతృప్తి ఆగ్రహంగా మారి పార్టీ మారేందుకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ దానిని చివరివరకూ నిలబెట్టుకుంటారా? అన్న విషయంలో ఇంకా అనుమానాలున్నాయి. మన వాళ్లల్లో లోపాలుంటే సరిదిద్దుకుంటాం. కలుపుకుని పోతాం. టిక్కెట్లపై ఎటువంటి చిల్లర మాటలు వినవద్దని సింపుల్ గా తేల్చేశారు కేసీఆర్. కానీ అంత సులభంగా రాజకీయం తేలిపోతుందని పార్టీ నాయకులు భావించడం లేదు. కేసీఆర్ ఫక్తు పొలిటీషియన్. తనదైన సమీకరణలు సరిచూసుకుంటుంటారు. త్యాగాలు, ముందస్తు హామీల కంటే ఆనాడున్న పరిస్థితులే నిర్ణయాలకు కారణంగా నిలుస్తాయి. చివరిక్షణాల్లో టిక్కెట్లలో మార్పులు, చేర్పులు సహజమే. కాంగ్రెసు లో సీట్లు కన్ఫమ్ అయిపోయాక టీఆర్ఎస్ నుంచి వచ్చేవారికి ఏమీ మిగలవు. అసలే ప్రతి నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెసు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అందువల్ల ఎన్నికల సమయంలో వాళ్లలో వాళ్లకే పడని స్థితి నెలకొంటుంది. ఈలోపు టీఆర్ఎస్ లో ని ప్రజాప్రతినిధులను కాంగ్రెసు ఆకర్షించకుండా చూసుకోగలిగితే చాలు. దీనిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ సీట్ల హామీ ఇచ్చారు. ఇకపై పక్క చూపులు లేకుండా నియోజకవర్గంలో పార్టీ పనిపై దృష్టి పెడతారని సీఎం ఈ వ్యూహం పన్నినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. నిజంగానే అందరికీ టిక్కెట్లు ఇచ్చేటట్లయితే కొత్తగా వలసలు ఉండవు. పార్టీలో అనేకమందిని చేర్చుకుంటున్నారు. వారిలో కొందరికి పార్టీ టిక్కెట్లిస్తామని లోపాయికారీగా చెబుతున్నారు. వీరందరి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. మరో ఆరు నెలల వరకూ వీటికి సమాధానాలు దొరకవు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తామనే బలమైన హామీనే నిలబెట్టుకోని కేసీఆర్ టిక్కెట్ల విషయంలో మాటమీద నిలబడరులే అనే విమర్శ ప్రత్యర్థుల నుంచి వస్తోంది . రాజకీయ నిర్ణయాలను పరిస్థితులే శాసిస్తాయి. చివరి దశలో ఈక్వేషన్లు చూసుకున్న తర్వాత ఫైనల్ వర్డ్ కేసీఆర్ నోటి వెంట వెలువడుతుంది. అదే పొలిటికల్లీ కరెక్టు అని నిరూపించుకుంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News