తుమ్మలకు కేసీఆర్ ఆ ఛాన్స్ ఇస్తున్నారా..?

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పుడు రాజకీయంగా కష్టకాలం ఎదుర్కుంటున్నారు. స్వంత పార్టీలో విభేదాలే ఆయనను రాజకీయంగా ముంచేస్తున్నాయనేది [more]

Update: 2019-02-27 09:30 GMT

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పుడు రాజకీయంగా కష్టకాలం ఎదుర్కుంటున్నారు. స్వంత పార్టీలో విభేదాలే ఆయనను రాజకీయంగా ముంచేస్తున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు జిల్లా టీడీపీలో మరో కీలకనేత అయిన నామా నాగేశ్వరరావుతో విభేదాల కారణంగా ఆయన వర్గం సహకరించకపోవడంతో తుమ్మల ఓడిపోయారు. అయినా, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో తుమ్మలకు టైమ్ కలిసొచ్చింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి దక్కింది. తర్వాత వచ్చిన పాలేరు ఉపఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. నాలుగేళ్ల పాటు జిల్లాలో తుమ్మల చక్రం తిప్పారు.

వర్గ పోరుతోనే ఓటమి..!

ఇక, ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు మరోసారి స్వంత పార్టీలోని వర్గ విభేదాలు దెబ్బతీశాయని చెప్పాలి. కాకపోతే అప్పుడు టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్. అప్పుడు ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుతో విభేదాలు. ఇప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు. పొంగులేటి వర్గం సహకరించకపోవడంతో ఇటీవలి ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తుమ్మలను ఓడించడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పరోక్షంగా పనిచేసిందనే ప్రచారమూ ఉంది. మొత్తానికి వర్గపోరే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ను ముంచేసిందని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అంగీకరించారు. అయితే, ఓటమితో దెబ్బతిన్న తుమ్మల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

మంత్రి పదవి ఎవరికి..?

ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే గత ఎన్నికల్లోలాగానే ఓడిపోయినా మళ్లీ తుమ్మలకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా జరిగిన మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో తుమ్మలకు కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. తుమ్మలకే కాదు.. ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికీ ఛాన్స్ దక్కలేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తుదిదశ మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికైనా అవకాశం దక్కనుంది. ఇక, తాజాగా తుమ్మలను ఖమ్మం ఎంపీగా బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, అదే నిజమైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవితవ్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన కూడా జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యే ఎన్నికలోనే తుమ్మలకు సహకరించని పొంగులేటి పార్లమెంటు ఎన్నికకు సహకరిస్తారని ఊహించలేం. మరి, వీరిద్దరి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఏంటో చూడాలి. ఇక, తుమ్మలను ఎంపీగా పోటీ చేయించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ ఒక షరతు పెడతారని, తుమ్మల ఎంపీగా గెలిస్తే పొంగులేటికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారమూ జరుగుతుంది.

Tags:    

Similar News