వార్ వన్ సైడేనట.. నో ఫియర్ అంటున్నారే?

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో అభ్యర్థి ఎవరన్నది ఇంకా [more]

Update: 2020-09-20 11:00 GMT

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ ఇప్పటికే టీఆర్ఎస్ దుబ్బాకలో ప్రచారాన్ని ప్రారంభించినట్లే అనుకోవాలి. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలూ ఎన్నికకు సమాయత్తమవుతున్నాయి.

మండలాల వారీగా బాధ్యులు…..

అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మండలాల వారీగా నియోజకవర్గ బాధ్యులను నియమించింది. ఎమ్మెల్యేలు ఇప్పటికే మండలాల వారీగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వాటికి హాజరవుతున్నా ఏదో ఒక సమయంలో నియోజకవర్గానికి వెళ్లి వచ్చారు. తమకు అప్పగించిన మండలంలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అధిష్టానానికి పంపుతున్నారు. అభ్యర్థితో పాటు ఈ ఉప ఎన్నికపై ప్రజాభిప్రాయాన్ని కూడా వారు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

టిక్కెట్ వారికే…..

సోలిపేట రామలింగారెడ్డి మరణంతో రానున్న ఉప ఎన్నిక కావడంతో ఆ కుటుంబంలోనే ఒకరికి టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నా ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రామలింగారెడ్డి భార్యకు లేదా కుమారుడికి ఈ టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయినా ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయకుండా ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులకు సూచించారు.

హరీశ్ పైనే భారం…..

ఈ ఎన్నిక మొత్తాన్ని మంత్రి హరీశ్ రావు చూసుకుంటున్నారు. హరీశ్ రావుకు ఉప ఎన్నికను డీల్ చేయడం వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఆయనకే ఈ బాధ్యతలను అప్పగించారు. దీంతో హరీశ్ రావు ఎక్కువగా మెదక్ జిల్లా నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిని చూసి వ్యూహం మార్చే అవకాశముంది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీంతో హరీశ్ రావు దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని ఎమ్మెల్యేలను కోరినట్లు తెలిసింది. గెలుపు కంటే మెజారిటీపైనే దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు.

Tags:    

Similar News