‘రిటర్న్ గిఫ్ట్’ పార్సిలా..? డైరెక్ట్ డెలివరీనా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలన్నీ రేపే ఎన్నికలు అన్నంతలా రాజకీయాల్లో తలమునకలయ్యాయి. చేరికలు, ఆరోపణలు, ఎత్తులు, పైఎత్తులతో ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారిపోతున్నాయి. [more]

Update: 2019-01-31 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలన్నీ రేపే ఎన్నికలు అన్నంతలా రాజకీయాల్లో తలమునకలయ్యాయి. చేరికలు, ఆరోపణలు, ఎత్తులు, పైఎత్తులతో ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారిపోతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ లో పార్టీల వ్యూహాలు అంతిచిక్కుతున్నా… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. తెలంగాణలో విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఈ మాటను కేటీఆర్, కవిత కూడా పలుమార్లు నొక్కి చెప్పారు. కచ్చితంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పారు. అయితే, కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటి..? అసలు ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఎవరికీ తెలియడం లేదు. నిజంగానే ఆయన ఏపీలో అడుగుపెడతారా..? అనేది ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్న టీడీపీ

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానిక కేసీఆర్ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే.. ఆయనను బూచీగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలుగుదేశం పార్టీ కాచుకొని కూర్చుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో కేటీఆర్.. వైసీపీ అధినేత జగన్ ను కలిస్తేనే తెలుగుదేశం చేసిన రచ్చ అంతాఇంతా కాదు. టీఆర్ఎస్ తో జగన్ పొత్తు అంటూ ప్రచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా కూడా అదే చేసింది. ఇక ఆంధ్రాద్రోహి కేసీఆర్ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో జగన్ తో పాటు వైసీపీ మొత్తం సెల్ప్ డిఫెన్స్ లో పడిపోయి… ఫెడరల్ ఫ్రంట్ కోసం మాత్రమే చర్చలు జరిగాయని.. అవి కూడా ప్రాథమిక చర్చలే అని.. ఏపీలో లేని టీఆర్ఎస్ తో పొత్తు ఎలా పెట్టుకుంటామని సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి ఏపీలో ప్రచారమో, జగన్ కు నేరుగా మద్దతు ఇవ్వడమో గనుక చేస్తే తెలుగుదేశం పార్టీ దానికి సాధ్యమైనంత వరకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంటుంది.

పరిస్థితి అంచనా వేస్తున్న కేసీఆర్

అయితే, రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కేసీఆర్ ఇది కచ్చితంగా అంచనా వేస్తారు. తాను ఏపీలో అడుగుపెడితే టీడీపీ తదుపరి అడుగులు ఏముంటాయో కేసీఆర్ అంచనా వేయగలరు. మరి, ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం కష్టమే అంటున్నారు. అయితే, చంద్రబాబును ఓడించాలంటే జగన్ కి గానీ, పవన్ కళ్యాణ్ కి గానీ మద్దతు ఇవ్వాలి. నేరుగా మద్దతు ఇస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అయితే, అంతర్గతంగా తాను గెలవాలనుకుంటున్న పార్టీకి మద్దతు ఇవ్వడం, సలహాలు, సూచనలు ఇవ్వడం మాత్రం చేసే అవకాశం ఉంది. ఇంకా ఏ విధంగానైనా మద్దతు ఇవ్వవచ్చు. కానీ, నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు.

Tags:    

Similar News