అబ్బే...ఆయన కేసీఆర్...I

Update: 2018-05-08 13:30 GMT

నోటితో పొగిడి..నొసటితో వెక్కిరించే కళలో ఆరితేరిపోయారు కేసీఆర్. ఒకవైపు సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్నారు. ఆ దిశలో సాగుతున్న ప్రయత్నాలకు మాత్రం గండి కొడుతున్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆచరణలో ఫెడరల్ ఫ్రంట్ కు చేజేతులారా కొరివి పెడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర పక్షాలు ఏకతాటిపైకి వచ్చే ఒక వేదికను బహిష్కరించడం ద్వారా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేశారు. నిరంకుశమైన షరతులతో కేంద్రప్రభుత్వం రాజ్యాంగ బద్దమైన ఫైనాన్స్ కమిషన్ ను సైతం నియంత్రించాలని చూస్తోంది. కేంద్రరాష్ట్రప్రభుత్వాల మధ్య పన్నుల వాటాను పంపిణి చేసే ఫైనాన్స్ కమిషన్ కు మార్గదర్శకాల పేరిట జారీ అయిన షరతులు కేంద్రయోచనలకు అద్దం పడుతున్నాయి. ప్రగతి బాటలో నడిచే రాష్ట్రప్రభుత్వాలకు సంకెళ్లు వేస్తున్నాయి. ఆయా నిబంధనలను ప్రతిఘటిస్తూ నష్టపోనున్న రాష్ట్రాలన్నీ ఆందోళన బాట పడుతుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి తంతు బీజేపీకి అనుకూలించే తీరులో ఉండటం ఇతర రాష్ట్రాలను కలవరానికి గురి చేస్తోంది. అన్ని ప్రాంతీయ పక్షాలను కలుపుకునిపోయి ఒక సమాఖ్యను ఆవిష్కరిస్తానంటున్న ఆయన మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.

రాష్ట్రమా? రాజకీయమా?..

పదిహేనో ఆర్థిక సంఘానికి జారీ చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అశనిపాతంగా మారబోతున్నాయి. 2011 జనాభా ఆధారంగా పన్నుల వాటా పంపిణీ అంటూ కొత్త రాగం పాడుతోంది కేంద్రం. 1971 జనాభా ప్రాతిపదికన పన్నుల వాటాల పంపిణీని ఇంతవరకూ ఆర్థిక సంఘాలు ఖరారు చేస్తూ వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు అప్పట్నుంచి జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంటూ పెరుగుదల రేటును నియంత్రించుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఈవిషయంలో నిర్లక్ష్యం వహించాయి. ఫలితంగా వాటి జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 2011 జనాభా ను నిధుల పంపిణీకి ప్రామాణికంగా తీసుకుంటే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు సమకూరుతాయి. కష్టనష్టాలకోర్చి జనాభాను నియంత్రించుకున్న రాష్ట్రాలకు వాటా తగ్గిపోతుంది. ఈ రకంగా తెలంగాణ కూడా భారీగానే నష్టపోతుంది. కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అయిదేళ్లలో 80 వేల కోట్ల రూపాయల మేరకు నిధుల పంపిణీ తగ్గుతుందని అంచనా. దీనిపైనే విపక్ష రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి. కేంద్రం చాలా తెలివిగా వీటిమధ్య విభజన తేవాలని చూస్తోంది. కేరళ ప్రభుత్వం చొరవ తీసుకుని గత నెల దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కీలుబొమ్మ ప్రభుత్వాన్నిఈ సమావేశంలో పాల్గొనకుండా కేంద్రం అదుపు చేయగలిగింది. తెలంగాణ ప్రభుత్వమూ హాజరు కాలేదు. తాజాగా పరిధిని విస్తరించి బీజేపీయేతర రాష్ట్రాలన్నీ హాజరయ్యేలా అమరావతిలో మలి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కూడా తెలంగాణ డుమ్మా కొట్టింది. కేంద్రంపై సాంకేతికంగా, బీజేపీపై సిద్దాంతపరంగా విపక్షాలు ఏకమయ్యేందుకు వీలు కల్పించే అరుదైన అవకాశమిది. దీనికి హాజరుకాకపోవడం ద్వారా కేసీఆర్ ఏరకమైన సందేశం పంపుతున్నారనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ. ఉత్తర, దక్షిణ విభజనకు దారితీస్తుందంటూ టీఆర్ఎస్ తొలుత చేసిన వాదన కూడా డొల్లగా తేలిపోయింది. ఇప్పుడు వేదికను విస్తరించడం వల్ల ఈ విభజన సమస్య సమసి పోయింది. కేంద్రప్రభుత్వానికి ఇబ్బందులు కల్పించడం ఇష్టం లేకపోవడం వల్లే కేసీఆర్ రకరకాల సాకులతో తమ ఆర్థికమంత్రిని సమావేశానికి పంపకుండా నిరాకరించారనే చెప్పవచ్చు.

ఫ్రంట్ ఇక పడకేసినట్లే...

కేసీఆర్ ఫ్రంట్ పట్ల తొలి నుంచీ రాజకీయపార్టీలకు అనుమానాలున్నాయి. బీజేపీయేతర శక్తులు ఏకం కాకుండా మధ్యలో మూడో కుంపటి పెడితే ఓట్ల చీలిక కమలనాథులకు లాభిస్తుందనే వాదనను కాంగ్రెసు ముందుకు తెచ్చింది. దీనికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ పాత్ర నామమాత్రం . కాంగ్రెసు పార్టీయే ప్రధాన ప్రత్యర్థి. పైపెచ్చు బీజేపీ తెలంగాణ విషయంలో ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతి కేంద్రమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారికంగా కితాబునిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి అది సరిపోతుంది. ఇక బీజేపీ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు స్వేచ్ఛ కల్పించారు. లక్ష్మణ్, కిషన్ వంటివారు ఎంత గొంతుచించుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. కేంద్రమంత్రుల కితాబుల ముందు వీరి వాయిస్ లు తేలిపోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెసు ఆరోపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ ఎదురీదుతోంది. త్రిముఖ పోటీ నెలకొని ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెసులు ముఖాముఖి తలపడితే కాంగ్రెసువైపు మొగ్గు ఉంటుందనేది పరిశీలకుల అంచనా. జేడీఎస్ ను బలోపేతం చేస్తే కాంగ్రెసు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కేసీఆర్ స్వయానా వెళ్లి దేవెగౌడ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చారు. దీని ఆంతర్యం కాంగ్రెసు వైపు ఓటు బ్యాంకు సంఘటితం కాకుండా చూడటమనే వాదన వినవస్తోంది. ప్రత్యేకించి తెలుగు వారిని ప్రభావితం చేయడం ద్వారా త్రిముఖ పోటీని రసవత్తరంగా మార్చేందుకు కేసీఆర్ ఎత్తు వేశారనేది ఒక ప్రచారం. మొత్తమ్మీద కేసీఆర్ తన ప్రవర్తన ద్వారా ఐక్య సంఘటన నమ్మకాన్ని చూరగొనలేకపోతున్నారు. మాటల ద్వారా మంత్రం వేసి అప్పటికప్పుడు వివిధ పక్షాలను, మీడియాను సమ్మోహన పరుస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రతిపక్షాల విశ్వాసం మాత్రం పొందలేకపోతున్నారు. తమిళనాడులో డీఎంకే శిబిరాన్ని సందర్శించడంపైనా అనుమానాలున్నాయి. డీఎంకే కాంగ్రెసుకు మిత్రపక్షం. వారి మైత్రిని చెడగొట్టడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చాలనేది ఒక దూరాలోచన అంటున్నారు కేసీఆర్ విమర్శకులు. ఆయా విమర్శలకు తగిన ప్రాతిపదికను నిర్మించడం కష్టమే. కానీ కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ గళమెత్తుతుంటే తాను మాత్రం దూరంగా ఉండటాన్ని సమర్థించుకోవడం కష్టం. ఏవో సాకులు చెప్పినా ఇది సరైనది కాదంటూ తప్పుపట్టే వేలు కేసీఆర్ వైపే చూస్తుంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News