Andhra : కేసీఆర్ జగన్ ను క్రమంగా ఇరికించేస్తున్నాడా?

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార, విపక్ష పార్టీలు గెలుపు కోసం అన్ని దారులు వెతుక్కుంటాయి. సహజంగా [more]

Update: 2021-11-03 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార, విపక్ష పార్టీలు గెలుపు కోసం అన్ని దారులు వెతుక్కుంటాయి. సహజంగా పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రజలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటారు. ఇప్పటికే ఏపీలోని ప్రతి ఇంట్లో ఒకరు హైదరాబాద్ లో ఉండటంతో అక్కడి ప్రభుత్వ పనితీరు, పథకాలపై ఆసక్తి ఉంటుంది.

ఏడాది తర్వాత….

తెలంగాణలో 2023లోనే ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఏడాది ఏపీలో జరగనున్నాయి. ఇటీవల కేసీఆర్ ప్లీనరీ సందర్భంగా చేసిన ప్రసంగాన్ని తోసిపుచ్చలేం. ఏపీ నుంచి తనకు వినతులు అందుతున్నాయని, అక్కడ పార్టీని పెట్టి పోటీకి దింపాలని కోరుతున్నారని చెప్పారు. కేవలం తన పథకాలను చూసే ఏపీ ప్రజలు తనను కోరుకుంటున్నారని చెప్పారు. అందులో నిజనిజాలెలా ఉన్నప్పటికీ ఏపీ ప్రజల ఆసక్తి పక్కనే ఉన్న తెలంగాణపై ఉంటుంది.

దళిత బంధు.. బీసీ బంధు….

ముఖ్యంగా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారు. అలాగే రానున్న కాలంలో బీసీ బంధువంటివి ఖచ్చితంగా తెస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని రాష్ట్రం కావడంతో కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ ఏపీ అలా కాదు. ఈ పథకాల ద్వారా కొన్ని సామాజికవర్గాలకు కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడమంటే సాధ్యం కాని పని. ఇప్పటికే ఏపీలో దళితబంధుపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్న మాట వాస్తవమే.

ఇక్కడ చెల్లుతాయా?

అలాగని ఈ పథకాన్ని ఏపీలో సేమ్ టు సేమ్ కాకపోయినా మార్చి ప్రవేశపెట్టేదానికి జగన్ కు ఇప్పట్లో వీలుపడదు. ఇక ఎన్నికల హామీల్లో చెప్పాల్సిందే. ఒక్క దళితబంధు అని జగన్ హామీ ఇస్తే సరిపోదు. బీసీ బంధు కూడా ఖచ్చితంగా హామీల్లో చెప్పాల్సిందే. చంద్రబాబు విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాటి స్కీమ్ లు మ్యానిఫేస్టోలో పెడతారు. కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాని పనిని జగన్ తన హామీల్లో చేరుస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కేసీఆర్ పది లక్షల పథకం తెలంగాణలోని విపక్షాలకే కాకుండా ఏపీలోని పాలక, ప్రతిపక్షాలకు కూడా మింగుడు పడకుండా ఉంది.

Tags:    

Similar News