వీరివల్లనే ఇన్ని ఇబ్బందులా…?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్షేత్రస్థాయిలో క‌నీస సంఖ్యలో కూడా స‌భ్యత్వం లేని జాతీయ పార్టీ బీజేపీ. గ‌త ఏడాది డిసెంబరులో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, ఇటీవ‌ల [more]

Update: 2019-07-11 03:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్షేత్రస్థాయిలో క‌నీస సంఖ్యలో కూడా స‌భ్యత్వం లేని జాతీయ పార్టీ బీజేపీ. గ‌త ఏడాది డిసెంబరులో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టుమ‌ని ఐదు స్థానాల‌ను కూడా సంపాయించుకోవ‌డం అటుంచి అస్థిత్వానికే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్న బీజేపీ.. నేడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే రెండేళ్లలోనే త‌మ స‌త్తా చాటుతామని గంభీర ప్రక‌ట‌న‌లు చేస్తోంది. అంతేకాదు, కుదిరితే 2024లోనే ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా వ‌చ్చేస్తామ‌ని చెబుతోంది. మ‌రి ఏమీలేని పార్టీకి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వ‌చ్చింది? అస‌లు ఏం జ‌రిగింది? బీజేపీ ధైర్యానికి కార‌కులు ఎవ‌రు?

వారే కారణమా…?

ఇప్పుడు ఈ ప్రశ్నలే ఏపీ, తెలంగాణ రాజ‌కీయ వేదిక‌ల‌పై త‌చ్చాడుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. బీజేపీకి ఇంత ధైర్యం వ‌చ్చేందుకు, వ‌చ్చే రెండేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రబ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతామ‌ని చెప్పడం వెనుక ఖ‌చ్చితం గా ఇద్దరు చంద్రులు ఉన్నార‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. వారే తెలంగాణ ప్రస్తుత సీఎం కేసీఆర్‌. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. వీరిద్దరి కార‌ణంగానే బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదుగుతామ‌నే ధైర్యం వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బ‌ల‌మైన పార్టీగా ఉండి, కొన్ని ద‌శాబ్దాల పాటు అధికారాన్ని కూడా చ‌లాయించిన కాంగ్రెస్ పార్టీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నిఈ ఇద్దరు చంద్రులు భావించారు.

బలపడేందుకు పరోక్షంగా…

ఎవ‌రి పార్టీనివారు బ‌ల‌ప‌రుచుకునే ఉద్దేశం మంచిదే. అయితే, ప‌క్క పార్టీల‌ను బ‌ల‌హీన ప‌రిచి తాము బ‌లప‌డ‌దామ‌నే సంస్కృతిని ఈ ఇద్దరు చంద్రులు అలవ‌రుచుకున్నారు. ఫ‌లితంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యే ల‌ను కేసీఆర్ త‌న పార్టీలోకి విలీనం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కు పుట్టగ‌తులు లేకుండా పోయాయి. దీంతో కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌లోని మిగిలిన నాయ‌కులు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు అడుగులు వేసే ప‌రిస్థితిని క‌ల్పించారు. దీంతో బీజేపీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు కేసీఆర్ ప‌రోక్షంగా స‌హ‌క‌రించినట్టు అయింది.

సొంత లాభం కోసం….

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. విభ‌జ‌న‌తో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ విష‌యంలో చంద్రబాబు గోడ‌మీద పిల్లి వాటంగా వ్యవహ‌రించారు. త‌న స్వలాభం కోసం తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అదే ఏపీ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం కాంగ్రెస్‌ను ప‌క్కన పెట్టారు. అంతేకాదు, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను కూడా పార్టీలో చేర్చుకుని ప‌ద‌వులు ఇచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ పంచారు. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. దీంతో రెండు ప్రాంతీయ పార్టీలే క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల‌పై అసంతృప్తితో ఉన్న నాయ‌కులు బీజేపీ వైపు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడింది.

కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని…..

ఇక్కడే మ‌రో ముఖ్య విష‌యం చెప్పుకోవాలి. ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు అవ‌త‌రించ‌డం వెనుక‌ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ఎంతో కొంత నిజాయితీ ఉంది. ఆ పార్టీ ఏనాడూ.. ప‌క్క పార్టీల‌ను కూల‌దోసి ఎద‌గాల‌ని భావించ‌లేదు. కానీ, నేడు బీజేపీ అలా కాకుండా ప‌క్క పార్టీల‌ను కూల‌దోయ‌డం ద్వారా కేవ‌లం అధికార‌మేప‌ర‌మావ‌ధిగా రాజ‌కీయాలు చేస్తోంది. ఇలాంటి పార్టీకి ఇద్దరు చంద్రులు ముందు చూపు లేకుండా తీసుకున్న “ఎలాగైనా కాంగ్రెస్ అంతు చూడాల‌నే“ నిర్ణయం క‌లిసి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్లలో ఎదిగిపోతామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రి ఏమేర‌కు సాకారం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News