పోరు నష్టం పొందు లాభం ….

పోరు నష్టం పొందు లాభం. ఇదే సూత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రంలా పఠిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఇరు రాష్ట్రాలకు అభివృద్ధి మార్గం చూపుతుందంటున్నారు నిపుణులు. [more]

Update: 2019-06-30 18:29 GMT

పోరు నష్టం పొందు లాభం. ఇదే సూత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రంలా పఠిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఇరు రాష్ట్రాలకు అభివృద్ధి మార్గం చూపుతుందంటున్నారు నిపుణులు. జల వివాదాలు, ఉద్యోగ సమస్యలు, ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, అనేక కీలక విషయాలు ఎపి విభజన అనంతరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. చంద్రబాబు సర్కార్ కెసిఆర్ ప్రభుత్వాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం తెలుగు ప్రజలకు శాపం గా ఉండేది. పేరుకు తెలుగు రాష్ట్రాలే కానీ ఇండియా పాకిస్థాన్ మాదిరి యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉండేవి. నాగార్జున సాగర్, శ్రీశైలం తదితర ప్రాజెక్ట్ ల వద్ద రెండు రాష్ట్ర ల పోలీసులు, రైతులు మోహరించి ఏ క్షణంలో ఏమి జరుగుతుందా అనే స్థితి కొన్ని సందర్భాల్లో కొనసాగేది.

కొత్త చరిత్ర లిఖిస్తారా …?

జల వివాదాలు రాష్ట్రాల నడుమ ఏర్పడితే దశాబ్దాలు గడుస్తున్నా వాటికి పరిష్కారాలు లభించవు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నడుమ దశాబ్దాలుగా సాగుతున్న సమస్యలే దీనికి దర్పణంగా నిలుస్తున్నాయి. కావేరి జలాల పంపిణీ తమిళనాడులో ఎలాంటి ఘర్షణలకు, విధ్వంసాలకు దారితీస్తుందో అందరికి తెల్సిందే. ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం పై కర్ణాటక తో బాబ్లీ ప్రాజెక్ట్ పై మహారాష్ట్రతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పోరాటాలు అటు కోర్ట్ ల్లోనూ ఇటు ప్రాజెక్ట్ ప్రాంతం వద్ద, రాజకీయంగానూ సాగాయి.అంతరాష్ట్ర జలవివాదాలు పరిష్కరించాలిసిన ట్రిబ్యునల్స్ దశాబ్దాలుగా నీటి వాటాలు తేల్చడం లేదు. హైకోర్ట్, సుప్రీంకోర్ట్ లలో కుప్పలు కుప్పలుగా కేసులు. అవి తీర్పులు వచ్చే పరిస్థితి లేవు. ఎప్పుడైనా నీటి వాటాలు కోర్ట్లు తేల్చినా రాష్ట్రాలు సంతృప్తి చెందడం లేదు. మరోపక్క కేంద్రం లో ఏ ప్రభుత్వం అధికారం లో వున్నా రాష్ట్రాల నడుమ వచ్చే సమస్యలను చోద్యం చూస్తూ ఉండిపోతున్నాయి.

ఆదర్శవంతమైన అడుగు ....

ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూర్చొని సమస్యల పరిష్కారం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలందరికి సేవ చేసినవారం అవుతామని ఇగో లు పక్కన పెట్టేశారు. ఈ పరిణామాన్ని అంతా స్వాగతిస్తున్నారు. కృష్ణా, గోదావరి లలో నాలుగువేల టిఎంసి ల ను ఒడిసి పట్టుకుంటే రెండు రాష్ట్రాలు తాగు సాగునీటికి ఇబ్బంది పడే ప్రశ్నే లేదన్న ఆలోచనతో ముందడుగు వేశారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదర్శవంతమైన ఆలోచన దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఇప్పుడు ఆదర్శమే అంటున్నారు రాజకీయ నిపుణులు

Tags:    

Similar News