క్లైమాక్స్ లో కౌంట్ అదిరిపోతుందా...???

Update: 2018-12-24 15:30 GMT

తృతీయ ప్రత్యామ్నాయం.. సమాఖ్యకూటమి..ప్రజాస్వామ్య సంఘటన.. పేరు ఏదైనా కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి జట్టు కట్టి జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలనే యత్నం. ఇందులో సాఫల్య, వైఫల్యాల సంగతి పక్కనపెడదాం. కచ్చితంగా పెద్ద పార్టీల పెత్తనాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఏదో ఒక జాతీయపార్టీని పట్టుకుని తోకలా నడవడం కంటే రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడటం అవసరమే. ఇందులో వేరే ఉద్దేశాలు ఉండకూడదు. వేరొకరి ప్రయోజనాల కోసం ఓట్ల చీలిక వ్యవహారాల కోసం గూడుపుఠాణి చేయకూడదు. అటువంటి అనుమానాలకు తావివ్వని విధంగా ప్రాంతీయపార్టీలన్నీ కలిసికట్టుగా కదిలితే దేశానికే మేలు జరుగుతుంది. రాష్ట్రాల అవసరాలను కేంద్రం పట్టించుకొంటుంది. విస్తృతమైన అధికారాలను అనుభవించే స్థాయి నుంచి దిగి వస్తుంది. నిజమైన సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. సొంత రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం వంటి కార్యాలను సైతం పక్కనపెట్టి జాతీయ యాత్ర చేపట్టడం చిన్నవిషయం కాదు. ఈ సీరియస్ ప్రయత్నాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకువెళతారనే దానిపైనే సెక్యులర్ ఫ్రంట్ విజయం ఆధారపడి ఉంటుంది.

ఏడాదిగా ఏర్పాట్లు...

దాదాపు ఏడాది క్రితం ఈ ఫ్రంట్ ముచ్చట్లకు ముందుగా తెరతీసింది కేసీఆర్ నే. ఆ తర్వాత కాలంలో కొంత హడావిడి చేసి మళ్లీ గప్ చుప్ అయిపోయారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేంత సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కేంద్రప్రభుత్వం అవసాన దశకు చేరింది. మరో ఆరునెలల్లో లోక్ సభ కాలవ్యవధి ముగిసిపోనుంది. కొత్త రాజకీయాలు ఊపిరిపోసుకోవడానికి సరైన అదును ఇదే. ఆలోచన ఉంటే సరిపోదు. అందుకు తగినంత బలం ఉండాలి. వ్యూహం ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా సమయం కేటాయించి అందర్నీ కలిపేంత ఓపిక ఉండాలి. బలాబలాల లెక్కలు సరి చూసుకున్న తర్వాతనే కేసీఆర్ రంగంలోకి దిగారని చెప్పవచ్చు. తన రాష్ట్రంలో 17 స్థానాల బలమే ఉంది. కానీ పశ్చిమబంగ, ఒడిసా, ఉత్తరప్రదేశ్ కలిస్తే మొత్తంగా తెలంగాణతో కలిపి 160 స్థానాలవుతాయి. ఇప్పుడు కేసీఆర్ కలిసిన, కలుస్తున్న నాయకులకు, పార్టీలకు ఉన్న బలాన్ని అంచనా వేస్తే 100 నుంచి 120 స్థానాలు గెలిచేంత సామర్థ్యం ఉంది. అదే జరిగితే ఈ కూటమి జాతీయ పార్టీలను శాసించడం ఖాయం. మిగిలిన నాయకులు ప్రాంతీయంగా తమ రాష్ట్రాల్లో శక్తియుక్తులను కేంద్రీకరించాల్సి ఉంటుంది. కేసీఆర్ కు ఆ సమస్య లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ బలం సంఘటితంగా కనిపిస్తోంది. ఆయన ప్రచారం చేయకపోయినా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. మెజార్టీలో అటు ఇటు తేడా ఉండవచ్చు తప్పితే. అందుకే టీఆర్ఎస్ అధినేత తగినంత సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు.

లెక్కలు సరిపోయాయ్...

ఫ్రంట్ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కేసీఆర్ గతంలోనే మమత, అఖిలేష్ వంటి వారితో చర్చలు జరిపారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ను కలిసి ఫ్రంట్ ఆవశ్యకతను వివరించారు. మాయావతి, అఖిలేష్ ను కలిపేస్తే ఉత్తరప్రదేశ్ ను స్వీప్ చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఉన్న 80 స్థానాలకు గాను ఎస్పీ, బీఎస్పీ కలిస్తే 55 నుంచి 60 స్థానాలు చేజిక్కించుకోవచ్చనేది అంచనా. పశ్చిమబంగలో 32 నుంచి 34 స్థానాలు టీఎంసీ తెచ్చుకోగలుగుతుందని విశ్వసిస్తున్నారు. అలాగే ఒడిసాలో బిజూ జనతాదళ్ 15 నుంచి 16 స్థానాలు వస్తాయనుకుంటోంది. తెలంగాణలో 14 నుంచి 16 స్థానాలు టీఆర్ఎస్, ఎంఐఎం లకు వస్తాయని అంచనా. ఈ లెక్కల నేపథ్యంలోనే కూటమి భవిష్యత్తుపై ఆశలు మొగ్గలు తొడుగుతున్నాయి. జాతీయ రాజకీయ చిత్రపటంలో కేసీఆర్ బలం చాలా తక్కువ. ఆత్మవిశ్వాసం , అందర్నీ కలపగల సామర్థ్యం ఉన్నాయి తప్పితే ఒంటరిగా దేశరాజకీయాలను శాసించలేరు. ఈ వాస్తవం తెలుసు కాబట్టే ప్రధానమైన పార్టీలను కలుపుకునిపోవాలనే యత్నంలో ఉన్నారు. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు బలమైన శక్తులు, 42 స్థానాలతో మమతది పెద్ద ప్రాంతీయ పార్టీ. చివరికి ఒడిసా సైతం తెలంగాణకంటే ఎక్కువ సంఖ్యలోనే 21 లోక్ సభస్థానాలతో ఉంది. అందువల్ల తానే ఒక మెట్టుదిగి వీరందరితో సంప్రతింపులు జరుపుతున్నారు.

ముందస్తు సంకేతాలు...

గతంతో పోలిస్తే ఈసారి కేసీఆర్ కు మిత్రుల నుంచి పాజిటివ్ సిగ్నల్సే వచ్చాయని చెప్పుకోవాలి. మమత, నవీన్ పట్నాయక్ లు గతంలో కేసీఆర్ పర్యటనలపై మొహమాటంగా స్పందించారు. మాయావతి అసలు పట్టించుకోలేదు. కలవను కూడా లేదు. అఖిలేష్ మాత్రం హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ఇంట చర్చలు జరిపారు. ప్రస్తుతమున్న పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని మమత కరాఖండిగా చెప్పేస్తున్నారు. అంటే కాంగ్రెసు నేతృత్వంలోని కూటమికి దూరంగా ఉండనున్నట్లే. రాహుల్ గాంధీకి సైతం మమత వైఖరి తెలుసు కాబట్టి, పశ్చిమబంగలో ఒంటరిపోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టాలిన్ పీఎం అభ్యర్థిత్వానికి రాహుల్ ను ప్రతిపాదిస్తే అఖిలేష్ తోసిపుచ్చారు. నవీన్ పట్నాయక్ కాంగ్రెసు, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్నచోట్లే సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తమ్మీద ఈ భావసారూప్యత కూటమి కట్టడానికి అనుకూల సంకేతాలిస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News