తుప్పు వదలాల్సిందే....!!

Update: 2018-11-19 17:30 GMT

నామినేషన్ల కు తెరపడటంతోనే ప్రచార పర్వానికి తెరలేస్తోంది. ఇంతవరకూ టిక్కెట్ల కేటాయింపు, బీఫారాల అందచేత, అసంత్రుప్తుల బుజ్జగింపు వంటి పనుల్లో బిజీగా గడిపిన అగ్రనాయకులు పంచెలు బిగకడుతున్నారు. రంగంలోకి ఉరుకుతున్నారు. తాము నెగ్గడం, తమ పార్టీలకు గెలుపు సాధించడం రెండూ పెద్ద నాయకులకు అవసరమే. రానున్న పదిహేను రోజులు సందడే సందడి. తాడో పేడో తేల్చుకోవాల్సిన తరుణంలో నాయకులు ప్రచారసంరంభానికి తెర తీయబోతున్నారు. జాతీయ స్థాయి నాయకులు సైతం ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం విశేషం. దక్షిణాదిన కర్ణాటకలో విజయవంతమైన సంకీర్ణ ప్రయోగాన్ని ముందస్తుగానే ప్రజాకూటమి రూపంలో చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెసు. తన సొంతబలాన్ని అంచనా వేసుకుని మోడీ కరిష్మాను చాటిచెప్పాలని ఉవ్విళ్లూరుతోంది కమలం పార్టీ. తెలంగాణ వాదానికి, సొంత రాష్ట్రానికి తానే గుత్తేదారునని మరోసారి చాటుకునేందుకు సిద్దమవుతోంది టీఆర్ఎస్. ఏతావాతా అన్ని పార్టీలు అత్యంత కీలకంగా భావించడంతో ఈ ఎన్నికలు రంజుగా, రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రజల చెవుల తుప్పు వదిలేలా వాగ్దానాల హోరుతో, ప్రచార జోరుతో నాయకులు బరిలోకి దిగుతున్నారు.

కేసీఆర్ స్టయిలే వేరు...

దీక్షాధారునిగా రంగంలోకి వస్తున్నారు కేసీఆర్. ఎన్నికల్లో విజయాన్ని ఆశిస్తూ యాగాన్ని చేపట్టిన టీఆర్ఎస్ అధినేత నేరుగా అట్నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. సెంటిమెంట్లు, దైవభక్తి మెండుగా ఉండే కేసీఆర్ సోమవారం యజ్ణాన్ని పూర్తి చేసుకున్న వెంటనే ఖమ్మం, వరంగల్లు జిల్లాల్లో తొలి ప్రచార సభలు చేపట్టారు. ఎన్నికల గడువు వరకూ వివిధ నియోజకవర్గాల్లో అవిరామంగా సభల నిర్వహణకు టీఆర్ఎస్ అధినేత సమాయత్తం అవుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. అప్పట్లో కాంగ్రెసు బలమైన పక్షంగా ఉంది. తెలంగాణ సెంటిమెంటు మినహా టీఆర్ఎస్ ఆర్థికంగా అంత ధృఢంగా లేదు. అయినప్పటికీ కేసీఆర్ గాలిని తనకు అనుకూలంగా మలచుకోగలిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అంగబలం, అర్థబలం రీత్యా కాంగ్రెసు కంటే మెరుగుపడింది. అయితే అభ్యర్థులే బలహీనంగా ఉన్నారు. గ్రూపు విభేదాలు వెన్నాడుతున్నాయి. వీటన్నిటినీ అధిగమించేలా కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అభ్యర్థుల బలహీనతలు బయట పడకుండా టీఆర్ఎస్ కు ఓటు వేయడమంటే తనకు ఓటు వేయడమేనన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

బాబు ..రాహుల్ జంటగా...

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీతో చేతులు కలపడం రాజకీయ అనివార్యత. జాతీయ స్థాయిలో కుదిరిన ఈ పొత్తు ప్రజల్లో ఎటువంటి స్పందన కలిగిస్తుందనేదానికి తొలిపరీక్ష తెలంగాణ. ఈ రాష్ట్రంలో విజయసాధన కాంగ్రెసుకు దక్షిణాదిన తన పట్టును నిరూపించుకునే అవకాశం. ఎన్నోకొన్ని సీట్లు గెలుచుకుని తన గతవైభవానికి గుర్తుగా , అస్తిత్వం నిలుపుకోవడం తెలుగుదేశానికి అవసరం. పరస్పర భిన్నమైన ప్రత్యర్థులుగా 36 సంవత్సరాలపాటు తలపడిన ఈరెండు పార్టీలు చేతులు కలిపి, మొదటి సారిగా ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇంకా క్యాడర్, ప్రజలు ఈ ఘట్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారు. వారిలో ఒక భరోసా నింపి తాము కలిసినడుస్తామన్న సందేశాన్నివ్వాలంటే రాహుల్, చంద్రబాబు సంయుక్తంగా బహిరంగసభలో పాల్గొనడం అవసరమనేది రెండు పార్టీల నాయకుల వాదన. లేకపోతే టీడీపీ, కాంగ్రెసు కార్యకర్తలు కలిసి పనిచేయడం కలలోని మాట అనే వాదన ఉంది. అందుకే తమ రాజకీయ అవసరాలు, క్యాడర్ కు స్పష్టత నిచ్చేందుకు వీరిద్దరూ హైదరాబాదు పరిసరాల్లో రోడ్డు షో, లేదా బహిరంగ సభలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. ప్రజాకూటమికి అనుకూలంగా ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లను సంఘటితం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందంటున్నారు. ఎన్నికల ప్రచార చివరిదశలో ఈ మెగా ఈవెంట్ ఉండేందుకు ఆస్కారం ఉంది. సోనియా గాంధీ సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

మోడీ, షాల మోత..

బీజేపీ తన అజెండాలో తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తోంది. అధికార టీఆర్ఎస్ తో సుహ్రుద్భావ సంబంధాలున్నప్పటికీ సొంతబలాన్ని చాటుకోవాలని తహతహలాడుతోంది. పరిపూర్ణానందను ప్రధాన ప్రచారకునిగా ఇప్పటికే రంగంలోకి దింపింది. ఉత్తర,దక్షిణ తెలంగాణ జిల్లాలను కవర్ చేసేలా మోడీతో ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సభలకు సన్నాహాలు చేస్తున్నారు. కనీసం మూడు సభలలో ప్రధాని పాల్గొంటారు. అమిత్ షా 25, 27, 28 తేదీల్లో దాదాపు 12 సభలకు ప్లాన్ చేసుకున్నారు. షా రెండు విధాలుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. బహిరంగసభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించడం, నియోజకవర్గాల్లో వ్యూహరచన రెంటినీ మేళవించి ఆయన పర్యటనలకు రూపకల్పన చేసుకుంటున్నారు. గెలిచేందుకు అవకాశమున్న నియోజకవర్గాల్లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. కనీసం అయిదు స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది బీజేపీ లక్ష్యం. బహిరంగంగా మాత్రం తమకు 20 వరకూ సీట్లు వస్తాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సారి కింగ్ మేకర్ పాత్ర పోషించాలనేది బీజేపీ ఆశయం. 50-60 సీట్ల మధ్యలో ప్రధాన ప్రత్యర్థులు నిలిచిపోతే అయిదారు సీట్లు వచ్చిన పార్టీ సైతం కింగ్ మేకర్ గా మారుతుంది. తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం తమకు అటువంటి అవకాశం కల్పిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News