ఛాలెంజ్ 30

Update: 2018-11-14 15:30 GMT

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కొంత ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలై రెండు రోజులైనా కూటమి కసరత్తు పూర్తిగా కొలిక్కిరాలేదు. మరోవైపు తమ పార్టీకి చెందిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజల్లో ఉంటున్నారు. ప్రచారం జోరుగా సాగుతోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వర్గ విభేదాలతోనే కాంగ్రెసు జాబితాను బయటపెట్టింది. బలమైన క్యాండిడేట్లను రంగంలోకి దింపినప్పటికీ పార్టీపరమైన అసంతృప్తుల బలహీనతలను దాచుకోలేకపోయింది. మొత్తమ్మీద 30 స్థానాలలో గట్టిపోటీకి సంబంధించి పీటముడి కేసీఆర్ ను వెన్నాడుతోంది. కూటమి కట్టడంతో మిత్రులకు కేటాయించిన 25 స్థానాలపై కాంగ్రెసు పార్టీకి అనుమానాలున్నాయి. ఇరు పార్టీలు నేరుగా కాకపోయినా అంతర్గత సమీక్షల్లో తమ లోపాలను అంగీకరిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఇక చేసేదేమీ లేదు. ఓటరు దేవుడిపై భారం వేసి సత్తా చాటుకోవాలనే దిశలో కదులుతున్నారు.

హేమాహేమీలపై దృష్టి...

తెలంగాణ రాష్ట్రసమితి ఈ విడత సొంతబలంతో పాటు ప్రత్యర్థుల బలాబలాలపైనా దృష్టి పెడుతోంది. పార్టీకి సంక్షేమ పథకాలు రక్షణ కవచంగా నిలుస్తాయనే భరోసా ఉంది. రాష్ట్రంలో ఏటా నలభైవేల కోట్ల రూపాయలపైచిలుకు మొత్తాన్ని సంక్షేమానికే వెచ్చిస్తున్నారు. పింఛన్ల వంటి వ్యక్తిగత లబ్ధి పొందే పథకాలే వీటిలో అధికం. వివిధ స్కీముల రూపేణా కోటిమందికి పైగా లబ్ధి పొందుతున్నట్లు అంచనా. ఇదంతా ఓటు బ్యాంకుగానే భావించాలని అధినేత పార్టీ క్యాడర్ కు నూరిపోస్తున్నారు. చేసిన మంచి పనులు చెబితే చాలు బంపర్ మెజార్టీ ఖాయమని నొక్కి చెబుతున్నారు. అయితే ఇంకా శ్రేణుల్లో ఆ స్థాయి విశ్వాసం నెలకొనలేదు. ప్రధానంగా గ్రామాల్లో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలు వారికి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. నలభై రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులకు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ ప్రజల నుంచే రావడం గమనార్హం. దీనిని కేసీఆర్ సైతం గమనించారు. వీటిని దృష్టిలో పెట్టుకునే తన ప్రచార ప్రణాళికను ఖరారు చేసుకుంటున్నారు. కాంగ్రెసు, కూటమి తరఫున బలమైన అభ్యర్థులు బరిలో నిలిచిన స్థానాలపైనే ఆయన కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కీలక నాయకులను స్థానికంగా నిలువరించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే మిగిలిన చోట్ల ప్రత్యర్థుల్లోని అగ్రనాయకులు ప్రచారం చేయలేరు. దీంతో కూటమి క్యాంపెయిన్ వెలవెల బోతుంది. దీనిని అడ్వాంటేజ్ టీఆర్ఎస్ గా మలచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

క్యాంపెయిన్ లో కొత్తదనం...

టీఆర్ఎస్ ప్రచారంలో సైతం నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. రికార్డు చేసిన సందేశాలను గతంలో అన్ని మొబైళ్లకు పంపుతుండేవారు. సాధారణంగా ఇది అధినేతల వాయిస్ లో ఉంటుండేది. దీనిని వింటూనే ఓటర్లు కట్ చేసేస్తుండేవారు. పూర్తిగా సందేశాన్ని వినేంత ఓపిక వారికి ఉండేది కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రచారం ఇంటరాక్టివ్ మోడ్ లోకి మార్చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ బూత్ కు ఒకరు చొప్పున పనిచేసేలా మొబైల్ మెసెంజర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా బూత్ ల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి దారుల వివరాలను వారికి అందచేస్తారు. వారికి ఆ మెసెంజర్ నేరుగా ఫోన్ చేసి మాట కలుపుతారు. తిరిగి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తారు. స్థానికంగా ఉన్న అభ్యర్థులపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తే సావధానంగా ఆలకిస్తారు. వారికి సమాధానం చెబుతారు. అభ్యర్థి నడవడికను సరిదిద్దే చర్యలు కేసీఆర్ తీసుకుంటారని భరోసా నిస్తారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ నియమించే ఉన్నతకమిటీకి తాము సమర్పిస్తామని హామీ ఇస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థి కూటమి అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని విశదీకరిస్తారు. ఢిల్లీ , అమరావతి పెత్తనం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేస్తారు. మొత్తమ్మీద ఓటర్లను ఒప్పించడమే లక్ష్యంగా తగు శిక్షణతో ఈ మెసెంజర్లు రంగంలోకి దిగుతున్నారు.

రోజువారీ సమీక్షలు...

కేసీఆర్ స్వయంగా ప్రతిరోజూ కొంతసమయాన్ని అభ్యర్థుల కోసం కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా క్యాండిడేట్లను గైడ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేయకపోతే సమస్య ముదిరిపోయే ప్రమాదం ఉంది. కొందరు క్యాండిడేట్లు ప్రజలకు సర్దిచెప్పలేకపోతున్నారు. కొన్ని చోట్ల ప్రజలకు, క్యాడర్ కు మధ్య ఘర్షణ తలెత్తుతోంది. ఇదంతా టీఆర్ఎస్ కు సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉంది. రానున్న 20 రోజులు పార్టీకి చాలా కీలక సమయం. అభ్యర్థులకు బీ ఫారములు అందచేసే సమయంలో విలువైన సలహాలనిచ్చారు. ఒకరకంగా క్లాసు తీసుకున్నారనే చెప్పాలి. ప్రజలతో చాలా సంయమనం తో వ్యవహరించాలి. చేసిన పనులు చెప్పాలి. సమస్యలపై నిలదీసిన చోట్ల అవసరమైతే క్షమాపణ చెప్పాలి. పనులు పూర్తికానందుకు కారణాలు వివరించాలి. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో వ్యక్తిగతంగా ఎవరికి ఏమేమి చేశామో కూడా చెప్పాలని కేసీఆర్ హిత బోధ చేశారు. అప్పటికీ ప్రజలు నిరసన గళాలతో విరుచుకుపడితే సున్నితంగానే భవిష్యత్తును విశ్లేషించాలని సూచించారు. రానున్నది టీఆర్ఎస్ సర్కారే అని తేల్చి చెప్పాలి. అప్పుడు ఫస్టు ప్రయారిటీలో ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసానివ్వాలి. తద్వారా మళ్లీ ఈ గవర్నమెంటు వస్తుంది కాబట్టి వ్యతిరేకంగా వెళ్లడమెందుకనే భయం వారిలో నెలకొంటుంది. పని అయిపోతుంది. ఇదీ కేసీఆర్ క్లాసు సారాంశం. అభ్యర్థులు పూర్తిగా వంటబట్టించుకుని ఆయన బాటలోనే నడిచేందుకే నిత్యం సమీక్షించాలని తలపోస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News