ఫైనల్ డెసిషన్ అదేనట

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ రాజకీయ చాణక్యుడుగా పేరు సంపాదించుకున్నారు. ఆయనది ముందు చూపు రాజకీయం. దేశంలో ఏం జరుగుతుందో వూహించి ఆ దిశగా అడుగులు [more]

Update: 2019-08-31 08:00 GMT

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ రాజకీయ చాణక్యుడుగా పేరు సంపాదించుకున్నారు. ఆయనది ముందు చూపు రాజకీయం. దేశంలో ఏం జరుగుతుందో వూహించి ఆ దిశగా అడుగులు వేస్తారని పేరు. అటువంటి కేసీయార్ తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అతి విశ్వాసంతో దెబ్బ తిన్నారు. కొన్ని ఎంపీ సీట్లు ఆయనకు తగ్గాయి. అంత మాత్రం చేస్త తెలంగాణాలో టీఆర్ఎస్ పని అయిపోయిందని ఎవరూ అనుకోరు. కేసీయార్ బలం జనంలో ఉంది. ఆయన నీటిలో మొసలిలాంటివారు. ఆయన్ని ఓడించాలంటే జనంలో నుంచే పోరాడాలి. అది కేసీయార్ రాజకీయంగా చురుకుగా ఉన్నంతవరకూ సాధ్యపడదు కూడా. ఇక నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ తెలంగాణా మీద కన్నేసింది. భవిష్యత్తు తమదేనని జబ్బలు చరుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ కుంగిపోవడం కూడా బీజేపీకి కలసివస్తోంది. రేపటి తెలంగాణా ఎన్నికలు టీయారెస్ బీజేపీ మధ్యనే జరుగుతాయనడంలో సందేహం లేదు.

కుమారుడికి పీఠం…

కేసీయార్ ఒక వ్యూహం ప్రకారం ఇపుడు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన రెండవమారు గెలిచినపుడు కొద్ది నెలలు మాత్రమే కేసీయార్ సీఎం గా ఉంటారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం సాగింది. అయితే జాతీయ రాజకీయాలలో బీజేపీ ప్రభంజనంగా దూసుకురావడంతో కేసీయార్ ముఖ్యమంత్రిగానే కొనసాగాల్సివచ్చింది. ఇక రెండవమారు గెలిచిన బీజేపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ విభజన ఇపుడు బీజేపీకి వజ్రాయుధాలుగా మారాయి. ఇంకా మిగిలి ఉన్న సమయంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మూడవసారి కూడా గెలిచేందుకు బీజేపీ రెడీగా ఉంది. దాంతో కేసీయార్ కి ఇక జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదని అంటున్నారు. మరో వైపు తన కుమారుడు కేటీయార్ ని రాజకీయ వారసుడిగా ప్రకటించడానికి కూడా ఆయన ముహూర్తం చూస్తున్నారని కూడా తెలుస్తోది. అధికారం ఇంకా మూడేళ్ళు ఉండగానే కొడుకు చేతికి పగ్గాలు అప్పగిస్తే ఎన్నికల వేళకు సర్దుకుంటాడన్న వ్యూహంతో కేసీయార్ ఉన్నట్లు చెబుతున్నారు.

రాజకీయ విరామమేనా…?

కేసీయార్ రాజకీయ విరామం ప్రకటిస్తారని కూడా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అన్నిటికీ మించి ఉద్యమకారునిగా నిలిచి రాదనుకున్న తెలంగాణాను సాధించి పెట్టారు. ఈ విజయాలు చాలు కేసీయార్ కి అని అనేవాళ్ళు ఉన్నారు. 2023 చివర్లో తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు, ఆ మరుసటి ఏడాదికి కేసీయార్ కి డెబ్బై ఏళ్ళు వస్తాయి. అంతకు ముందు రెండు మూడేళ్ళకే రాజకీయాలకు స్వస్తి చెప్పి కేటీయార్ ని ముఖ్యమంత్రిని చేయాలన్నది కేసీయార్ ఆలోచనగా చెబుతున్నారు. 2023 ఎన్నికలను కేటీయార్ సారధ్యంలో ఎదుర్కోవాలని కూడా తలపోస్తున్నారట. ఇదిలా ఉండగా తన కళ్ల ముందే కొడుకుని సీఎం కుర్చీలో కూర్చోబెడితే రేపటి ఎన్నికల్లో రిజల్ట్ తేడా కొట్టినా కూడా ఆ ముచ్చట ముందే తీరుతుంది కదా అన్న ఆత్రం కూడా కేసీయార్ లో ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మరో ఏడాదిలోగా కేటీయార్ సీఎం గా బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న మాట టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News