టైమింగ్ అదుర్స్....!!

Update: 2018-12-17 14:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు అంత ధైర్యమెలా వచ్చిందనే ప్రశ్న రాజకీయ పక్షాలను వేధిస్తోంది. జాతీయ అజెండాను తాను శాసిస్తానంటూ ప్రకటన చేసిన తర్వాత అందుకు సంబంధించి నిర్దిష్టమైన వ్యూహరచనకు శ్రీకారం చుడుతున్నారు. మొండి ధైర్యానికి పెట్టింది పేరు కేసీఆర్. ఆంధ్ర్రప్రదేశ్ లోనూ, జాతీయంగానూ చంద్రబాబు నాయుడి హవా కొనసాగుతున్నప్పుడు టీడీపీని చాలెంజ్ చేసి టీఆర్ఎస్ ను స్థాపించారు. క్రమక్రమంగా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటూ వచ్చారు. రాష్ట్రం సాధించారు. రాజకీయ స్థిరత్వం కూడా వచ్చేసింది. తెలంగాణ కు సంబంధించి తాను సాధించాల్సిన విజయాలు ఇక ఏమీ లేనట్లే చెప్పుకోవాలి. దాంతో దేశం అజెండాను తలకెత్తుకున్నారు. రోల్ మోడల్ గా కొన్ని విజయాలను చూపించగలిగితే దేశ ప్రజల ను ఆకర్షించవచ్చనే లక్ష్యంతో కదులుతున్నారు. తెలంగాణే ప్రయోగవేదికగా దేశానికి ఆధర్శంగా చూపాలని భావిస్తున్నారు. వ్యవసాయరంగానికి నీటిపారుదల, 24 గంటల విద్యుత్తు , ఇంటింటికీ నల్లా, ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందచేసే రైతు బంధు పథకాలకు విస్త్రుత ప్రచారం కల్పించాలని పూనిక వహిస్తున్నారు.

రైతు బంధు..రాష్ట్ర ప్రగతి..

దేశంలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. జైజవాన్, జైకిసాన్ నినాదం తర్వాత కొంతకాలానికే రైతు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాడు. 1999-2004 మధ్య రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ రైతు రుణమాఫీని దేశవ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ రైతు కోలుకోలేదు. ఆ తర్వాత నుంచి ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు రైతు బలాన్ని గుర్తించసాగాయి. రుణమాఫీ పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం మొదలైంది. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు ఇందుకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సహా అనేక చోట్ల రుణమాఫీని అజెండాలో పెట్టుకున్నారు. 2019లో ఇదే ప్రధానాంశంగా ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెసు సిద్ధమవుతోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెసు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలో ఈ విషయం ప్రాధాన్యం గుర్తించి కాంగ్రెసు కంటే ముందే బీజేపీ రుణమాఫీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడుతోంది. అజెండా మారుతోందని గ్రహించిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరు చెబుతూనే రైతు కేంద్రంగానే దేశవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తాను అమలు చేస్తున్న ప్రధాన పథకాలను దేశం ముందు పెట్టాలని భావిస్తున్నారు. రైతు సంక్షేమం, రాష్ట్రాల ప్రగతి ఆయన ప్రధాన నినాదాలు కాబోతున్నాయి.

నాయకులెక్కడ...?

రైతు సంఘాల పేరిట ఉద్యమం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. పార్టీలకు అనుబంధంగా రైతు సంఘాలూ ఉన్నాయి. కానీ అచ్చంగా రైతు నాయకునిగా గుర్తింపు పొంది రాజకీయాలను శాసిస్తున్నవారు నేటి రాజకీయాల్లోకనిపించరు. చౌదరి చరణ్ సింగ్, దేవీలాల్ వంటి నేతలకు గతంలో ఆ తరహా గుర్తింపు ఉంటుండేది. మహారాష్ట్రలో శరద్ పవార్ కొంతకాలం ఈరకమైన అజెండాను ముందుకు తెచ్చినప్పటికీ పూర్తిగా రైతు నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపునకు నోచుకోలేదు. బీజేపీ, కాంగ్రెసు , ప్రాంతీయ పార్టీలను ప్రస్తుతం ఈలోపం వెన్నాడుతోంది. కేసీఆర్ కు ఈవిషయంలో కొంత అడ్వాంటేజ్ ఉంది. ఫామ్ హౌస్ కే పరిమితమవుతారంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తన కాలంలో అధిక సమయం వ్యవసాయ క్షేత్రంలో గడపడానికే ఇష్టపడతారు. ఉద్యమ సమయంలో సైతం ఆయన వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. తన పొలంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. దేశంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఇటువంటి అరుదైన రికార్డు వేరెవరికీ లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం తన వృత్తి గోపాలన అంటూ పాలు పితకడం చేసేవారు. కేసీఆర్ తనకున్న రికార్డుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతు బాంధవునిగా మారాలని యోచిస్తున్నారు. ఇందుకు దేశంలోని వివిధ భాషల్లో తగు ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఉందిలే మంచి కాలం...

మూడు నాలుగు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రను చూస్తే ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక ప్రధానాంశం ప్రచారాస్త్రంగా మారుతోంది. 1984 ఇందిర మరణం సెంటిమెంటు, 1989లో బోఫోర్సు కుంభకోణం, 1991లో కిచిడీ ప్రభుత్వాలకు వ్యతిరేక ఓటు, రాజీవ్ గాంధీ మరణం సెంటిమెంటు, 1996లో ప్రాంతీయపార్టీల అజెండా, 1998లో వాజపేయి, రామమందిరం, హిందూ జాతీయత, 2004 లో ఇండియా షైనింగ్ ప్రచారం , తిప్పికొట్టిన కాంగ్రెసు, 2009లో మన్మోహన్ నిజాయతీ, మధ్యతరగతి వర్గాల ఆర్థిక అభివృద్ధి, 2014లో మోడీ కరిష్మా, 2జీ, బొగ్గు కుంభకోణాలు వంటివి ఫలితాలను శాసిస్తూ వచ్చాయి. ఎక్కడా రైతు సమస్యలు, రైతు సంక్షేమం ఎన్నికల్లో ప్రధానాంశం కాలేదు. అన్నిపార్టీలు రైతుల గురించి మాట్టాడి ఉండవచ్చు. మేనిఫెస్టోలో భాగం కల్పించి ఉండవచ్చు. కానీ మెయిన్ కాన్సంట్రేషన్ మాత్రం రైతు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. దీనిని సరైన సమయంలో క్యాచ్ చేయగలిగితే అజెండాను మొత్తం మలుపు తిప్పవచ్చు. కేసీఆర్ ప్రజలనాడిని, రాజకీయ వాసనను పసిగట్టగల నేర్పరి. ఆయన రంగంలోకి దిగుతున్నారంటే దీనిని రైతు కాలంగా అర్థం చేసుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News