బాబుకు గిఫ్ట్ రెడీ....!!!

Update: 2018-12-13 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి 2019లో ప్రధాన ప్రత్యర్థులైన వైసీపీ, జనసేనల కంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నుంచి ముప్పు ముంచుకురాబోతోంది. రాజకీయాల్లో రాటు తేలిన కేసీఆర్ చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు తన నైపుణ్యాలను వెలికితీయబోతున్నారు. నేరుగా అస్త్రాలు ఎక్కుపెట్టరు. కానీ అవసరమైన సందర్భాల్లో బాబు ప్రత్యర్థులకు పాచికలు అందిస్తారు. వైసీపీ జనాదరణ కలిగిన పార్టీ. 2014లో అధికారం తృటిలో తప్పిపోయింది. తన అవకాశాలను తానే ధ్వంసం చేసుకోవడంలో ఆపార్టీ అధినేత జగన్ సిద్ధహస్తుడు. అనునయించాల్సిన చోట ఆగ్రహం ప్రదర్శించడం, అందర్నీ కలుపుకుని పోవాల్సిన చోట అహం ప్రదర్శించడం జగన్ లక్షణంగా చెప్పుకోవాలి. ఫలితంగా అధికారం అందివచ్చినట్లే అనిపించి చేజారిపోయింది. 2014లోనే పురుడు పోసుకున్న జనసేనది మరో రకమైన బలహీనత. పురుడు పోసుకున్న తొలి రోజుల్లోనే టీడీపీ ట్రాప్ లో చిక్కుకుంది. రాష్ట్రవిభజన నేపథ్యాన్ని ముడిపెట్టి తెలివిగా పవన్ ను తనవైపునకు చంద్రబాబు లాగేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలం చేసుకున్నారు. ఇప్పుడు అటువంటి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు.

ఆయుధంబు ధరింప...

కేసీఆర్ తమ రాష్ట్రంలో ప్రవేశిస్తే చూడాలని తెలుగుదేశం ఆశగా ఎదురుచూస్తోంది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. పార్టీ పల్టీ కొట్టింది. జట్టు కట్టిన పాపానికి కాంగ్రెసుకూ కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణ సెంటిమెంటూ పనిచేసి ఓట్ల పంట పండించింది. దీనికి ప్రధానకారణం చంద్రబాబు నాయుడు. తెలంగాణపై తిరిగి పెత్తనానికి బాబు ప్రయత్నిస్తున్నారన్న వాదనను కేసీఆర్ ప్రజల ముందుకు తెచ్చారు. ఫలితంగా తెలంగాణ ప్రజలు తిరిగి టీఆర్ఎస్ వైపు మూకుమ్మడిగా మొగ్గు చూపారు. ఫలితాల తర్వాత ఈ సంగతిని టీడీపీ గ్రహించింది. కానీ అప్పటికే చేతులు కాలిపోయాయి. అదే తప్పును కేసీఆర్ చేస్తే పార్టీకి ఆంధ్రాలో ప్రయోజనం సమకూరుతుందనే అంచనాతో ఉంది తెలుగుదేశం పార్టీ. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానన్న కేసీఆర్ ప్రకటన సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ఉపకరిస్తుందని యోచిస్తోంది. కేసీఆర్ వైసీపీకి, జనసేనకు ప్రచారంచేసి పెడితే దానిని టీడీపీ అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని చూస్తోంది. అయితే కేసీఆర్ సన్నిహితులు మాత్రం ఆయన ప్రత్యక్షంగా ఏపీలో ప్రవేశించరని చెబుతున్నారు. ఆయుధం చేపట్టకుండానే చంద్రబాబును డామేజ్ చేసే వ్యూహంపైనే కేసీఆర్ దృష్టి పెడతారని ఘంటాపథంగా చెబుతున్నారు.

కూటమి కట్టిస్తారు...

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు కాంగ్రెసుతో కలిసి కూటమి ఏర్పడటానికి ఉపకరించారు. అదే విధంగా కేసీఆర్ సైతం ఏపీలో ఒక కూటమి ఏర్పడటానికి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. వామపక్షాలు, వైసీపీ, జనసేనలను ఒకే బాటలోకి తెచ్చేందుకు అవకాశాలున్నట్లుగా పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం పరస్పరం ప్రత్యర్థులుగా వ్యతిరేక దిశలో కొనసాగుతున్నాయి వైసీపీ, జనసేనలు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీకి ప్రయోజనం సమకూరుతుంది. అదే ఈ రెండు పార్టీలు జతకూడితే బలమైన శక్తిగా మారతాయి. కానీ రెండూ ఇప్పటికిప్పుడు చేతులు కలిపే వాతావరణం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా లోపాయికారీ అవగాహనతో బలాబలాల ఆధారంగా సహకరించుకుంటే పని జరిగిపోతుంది. దీనికి గాను పిల్లిమెడలో గంట కట్టే పాత్రను తాను తీసుకోబోతున్నారు కేసీఆర్. జగన్ తోనూ, పవన్ తోనూ కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2014లో ఫలితాలు రాకముందే ఏపీలో జగన్ అధికారంలోకి వస్తున్నాడంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. పరస్పరం సహకరించుకుంటామని కూడా ప్రకటించారు. కానీ ఫలితం విరుద్ధంగా వచ్చింది. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ సలహాలు, సూచనల కోసం అప్పుడప్పుడూ కేసీఆర్ ను సంప్రతిస్తూ ఉంటారు. ఈ సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుంటూ వారిరువురి రాజకీయ భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా కేసీఆర్ సలహాలిచ్చి సర్దుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఏపీలో ..నిజంగా పిలుస్తున్నారా...

ఉత్తరాంధ్రలో కేసీఆర్ సామాజిక వర్గం ప్రజలు అధికసంఖ్యలో ఉన్నారు. ఆయన పూర్వీకులు కొన్ని శతాబ్దాల పూర్వం అక్కడ్నుంచే తెలంగాణకు వచ్చారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. కేసీఆర్ పనితీరు పట్ల ఏపీలోని కొన్నివర్గాల్లో ఆదరణ, ఆసక్తి ఉంది. రైతు రుణమాఫీ , సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేస్తున్నారనే అభినందనలు వినవస్తున్నాయి. ప్రత్యేకించి కేసీఆర్ మాట్టాడే తీరు, ప్రత్యర్థులపై ఎక్కుపెట్టే విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు ఆంధ్రాలోనూ అభిమానులను సంపాదించి పెట్టాయి. ప్రధానంగా చంద్రబాబును వ్యతిరేకించే వర్గాలు కేసీఆర్ పై ఎనలేని ఆదరణ చూపుతుంటాయి. రైతు బంధు వంటి వినూత్న పథకాలపై ఆంధ్ర ప్రాంతంలోని రైతుల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టే సాహసం చేయలేకపోతోంది. ప్రజలైతే వాటిని కోరుకుంటున్నారు. ఇటువంటి స్కీములను వైసీపీకి అస్త్రాలుగా అందించే అవకాశం ఉంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడి వ్యూహాలకు దీటైన ప్రతివ్యూహాలతో వైసీపీకి సహకరించడం ద్వారా చంద్రబాబు అధికార రథానికి పగ్గాలు వేసే సూచనలున్నాయి. తన తెలివితేటలు, వ్యూహాలకు తోడు ఆర్థికంగానూ వైసీపీకి సహకరిస్తే చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయం. జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబుకు కేసీఆర్ ప్రత్యర్థిగా మారబోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News