మధ్యవర్తిగా...దెబ్బతీయాల్సిందే...!!!

Update: 2018-12-22 14:30 GMT

అన్నట్లుగానే కేసీఆర్ జాతీయ యాత్రకు సిద్ధమయ్యారు. 23 వ తేదీనుంచి తలపెడుతున్న దేశవ్యాప్త రాజకీయ యాత్రకు అజెండాను సెట్ చేసుకున్నారు. స్పష్టమైన లక్ష్యంతోనే ఈ పర్యటన చేపడుతున్నారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, నూతన ప్రభుత్వ ప్రణాళిక అమలు వంటి పనులన్నిటినీ పక్కనపెట్టి టూర్ చేపట్టడం చిన్న విషయం కాదు. సీఎం దృష్టిలో మిగిలిన విషయాలన్నీ కుదించుకుపోయాయి. జాతీయంగా తాను పోషించాలనుకుంటున్న పాత్రనే కీలకంగా భావిస్తున్నారు. సర్కారీ బాధ్యతలతోపాటు సొంతపార్టీ వ్యవహారాలకు రానున్న అయిదు నెలలు దూరంగానే ఉండ బోతున్నారు. తాను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే దిశలోనే ప్రయత్నాలను పూర్తిగా చేపట్టాలని భావిస్తున్నారు. ప్రతి వారంలో రెండు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసేందుకూ సిద్ధమవుతున్నారు. ప్రాంతీయపార్టీల నేతలతో, లోక్ సభలో ప్రాతినిధ్యం వహించే సభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తన ఆలోచనలను వారికి వివరించాలనుకుంటున్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ఎవరినైనా ఒప్పించగల నేర్పు కేసీఆర్ కు ఉంది. తనలోని ఆ నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రాంతీయ పార్టీలను ఒకే బాటలోకి తేవాలనేది ప్రయత్నం. ఇందుకుగాను ఇప్పటికే ఆయా రాష్ట్రాల వారీ అధ్యయనంతో కూడిన నివేదికలను తయారుచేసినట్లు తెలుస్తోంది.

దాయాది నుంచే మొదలు...

పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచే తన పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని చెప్పాలి. ఏపీలో రాజకీయంగా ఇంకా ఏరకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయంలో సమగ్ర చిత్రం పూర్తి కాలేదు. కానీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి సహకరించి అధికారంలోకి తేవాలనేది స్థూల వ్యూహం. దీనికి సంబంధించి వైసీపీ, జనసేనలు ఎదురుగా కనిపిస్తున్నాయి. జనసేన ఇంకా చిన్నపార్టీయే. వైసీపీ కి మాత్రమే టీడీపీని నిలువరించి అధికారంలోకి వచ్చే శక్తియుక్తులున్నాయి. అయితే ఈ పార్టీ విజయానికి జనసేన ఆటంకంగా మారుతుందేమోనన్న అనుమానాలున్నాయి. ఓట్లచీలికతో ప్రభుత్వ వ్యతిరేకతకు గండి కొడితే టీడీపీకి లాభిస్తుంది. దీనిని అడ్డుకోవడానికి మధ్యేమార్గం అనుసరించి కేసీఆర్ మధ్యవర్తి పాత్రను పోషించాల్సి ఉంటుంది. అది కూడా అంతర్గతంగానే సాగాలి . నేరుగా రంగప్రవేశం చేస్తే ప్లాన్ వికటించే ప్రమాదం ఉంది. టీఆర్ఎస్ బూచిని చూపి టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ముందుగా ఆధ్యాత్మిక మార్గంలో ఏపీలో ఎంటర్ అవుతున్నారు కేసీఆర్. శారదాపీఠాన్ని సందర్శించి స్వామి స్వరూపానందతో తొలిగా చర్చలు జరపనున్నారు. తొలి నుంచి స్వరూపానంద టీడీపీ పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. వైసీపీకి మద్దతునిస్తున్నారు. కీలకమైన రాజకీయాంశాలపై వీరి మధ్య చర్చ చోటు చేసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్రాల అజెండా....

రాష్ట్రాలవారీగా అవసరాలు, సాధించుకునే మార్గాలపై కేసీఆర్ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేశారు. తొలి పర్యటనలో కలవబోతున్న బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్, టీఎంసీ మమతా బెనర్జీలు ఒడిసా, పశ్చిమబెంగాల్ లో తిరుగులేని నాయకులు. ఒడిసా లో రాజకీయ సుస్థిరత నెలకొని ఉంది. దీర్ఘకాలంగా బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. అయినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. అక్కడి సమస్యలకు తనకు తోచిన పరిష్కారాలపై కొంత సమాచారాన్ని వెంట తీసుకెళుతున్నారు కేసీఆర్. ప్రాంతీయ ఫ్రంట్ లో చేరడం ద్వారా ఒడిసాను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లవచ్చని చెప్పబోతున్నారు. అందుకు అవసరమైన కన్విన్సింగ్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. మమతా బెనర్జీ కి ఇప్పట్లో రాష్ట్రంలో తిరుగు లేదు. అయినప్పటికీ బీజేపీ చాలా వేగంగా విస్తరించే ఎత్తుగడలు వేస్తోంది. హిందూ అజెండాను ముందుకు తెస్తోంది. దీనివల్ల కొంత రాజకీయ సంకటం ఏర్పడుతోంది. ఈ ఇబ్బందిని తాను ఎలా అధిగమించిందీ వివరించేందుకు ప్రయత్నించబోతున్నారు కేసీఆర్. తెలంగాణలో సైతం బీజేపీ విస్తరణకు ప్రయత్నించినప్పటికీ 103 స్థానాల్లోకనీసం డిపాజిట్ రాని వైనాన్ని, కమలం పార్టీని తాను దెబ్బతీసిన తీరును చెప్పి, మమతను సైతం ఫ్రంట్ లోకి లాగాలనే యత్నంలో ఉన్నారు. అవసరమైతే మమతను ఫ్రంట్ కు ఛైర్మన్ గా ప్రతిపాదించేందుకూ అవకాశం ఉందంటున్నారు. మాయావతి, అఖిలేష్ నూ కలిసి యూపీఏకు చేరువ కాకుండా నిరోధించాలని భావిస్తున్నారు.

అన్నీ ఉన్నా...

భారతదేశానికి తగినన్ని వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదనే అంశాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తెస్తున్నారు కేసీఆర్. దేశంలో 70 వేల టీఎంసీల జల వనరులు అందుబాటులో ఉన్నాయి. కేవలం 40వేల టీఎంసీలను మాత్రమే వాడుకోగలుగుతున్నాం. నీళ్లకోసం రాష్ట్రాల మధ్య నిత్యం సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. 18 లక్షల కోట్ల పైచిలుకు నిధులు రిజర్వు బ్యాంకు, నవరత్న కార్పొరేషన్ల వద్ద వ్రుథాగా పడి ఉన్నాయి. వాటిని అభివృద్ధి, సంక్షేమాలకు వినియోగించలేకపోతున్నాం. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను వెంటనే విపరీతంగా పెంచితే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండునూ వినిపిస్తున్నారు. దీనిపై ప్రాంతీయపార్టీలను ఒప్పించడం కూడా తన పర్యటనలో ప్రధానాంశంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఆయా పార్టీలకు రాష్ట్రాల్లో రాజకీయాధికారం సుస్థిరమవుతుందనే భరోసాను ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ప్లాన్ పకడ్బందీగా తయారుచేసుకున్నారు. ఆయా ప్రాంతీయపార్టీల అధినేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే యూపీఏ కూటమికి కొంత మేరకు చేరువగా ఉన్న పక్షాలను ఆకట్టుకోవడం ఒక లక్ష్యం కాగా, ఏ కూటమితో ను కలవకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం మరో లక్ష్యం. పొలిటికల్ మేనేజ్ మెంట్, కన్విన్సింగ్ కళ లో ఆరితేరిన కేసీఆర్ కచ్చితంగా 2019లో అద్భుతం ఆవిష్కరిస్తారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News