అనుమానాలు... అవమానాలు..!!!

Update: 2018-12-26 15:30 GMT

కేసీఆర్ పట్టినపట్టువదలని విక్రమార్కుడు. రాజకీయాల్లో ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు. అందుకు ఎన్నిత్యాగాలకైనా సిద్ధమవుతారు. ఎదురుదెబ్బలను లెక్క చేయరు. అవమానాలనూ సహిస్తారు. ఒక లక్ష్యం కోసం ముందడుగు వేస్తే దానంతటదే కాలం కలిసి వస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. పదమూడేళ్లపాటు ఉద్యమం చేసినప్పుడు ఆయన నేర్చుకున్న పాఠం అదే. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ కు రూపకల్పన చేయాలని సంకల్పించారు. దీని వెనకాల ఉద్దేశం ఏదైనప్పటికీ ప్రాంతీయపార్టీలు జాతీయ రాజకీయాలను శాసించాలనే లక్ష్యాన్ని మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు. ఈ ఫ్రంట్ భారతీయ జనతాపార్టీ విజయానికి పరోక్షంగా సహకరిస్తుందనే విమర్శలున్నాయి. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెసు సహా అన్నిపార్టీలు ఒకే వేదికమీదకు రావాలన్న ఉమ్మడి సంకల్పానికి విఘాతం కలిగిస్తుందనే ఆరోపణ ఉంది. విమర్శలు, ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆయన చేపట్టిన రాజకీయ యాత్రకు మిశ్రమస్పందన లభిస్తోంది. ప్రధాన పక్షాలు పాక్షికంగానే సానుకూలత తెలుపుతున్నాయి. అనుమానాస్పద ద్రుక్పథంతో చూస్తున్నాయి. శీలపరీక్ష అనేది ప్రధాన సమస్యగా మారింది.

పట్నాయక్ పలకడు...

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీనియర్ రాజకీయవేత్త. అవినీతి రహిత పాలన అందిస్తారనే పేరుంది. ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచారి జీవితం కారణంగా రక్త బంధువుల బెడద కూడా పెద్దగా లేదు. గతంలో బీజేపీకి మిత్రుడు. కానీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెసులకు సమదూరం పాటిస్తున్నారు. వివాదరహితుడైన నవీన్ పట్నాయక్ ను ఫెడరల్ ఫ్రంట్ లోకి తేగలిగితే ఈ సమాఖ్య క్రెడిబిలిటీ పెరుగుతుంది. పైపెచ్చు నవీన్ అనవసర రాజకీయాలు చేయరు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. అందువల్ల ఆయనను తాను ప్రతిపాదిస్తున్న కూటమిలోకి రావాల్సిందిగా అభ్యర్థించారు కేసీఆర్. ఇప్పటికే ఈ ఫ్రంట్ పట్ల రకరకాల వదంతులు, అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడానికే దీనిని ఏర్పాటు చేస్తున్నారనే వాదన జాతీయ మీడియాలో సైతం వ్యాపించింది. దాంతో నవీన్ ఆచితూచి స్పందించారు. దేశానికి ఏదో ఒకటి చేయాల్సి ఉందని అభిప్రాయపడటంతో సరిపుచ్చారు. కూటమిలోకి వస్తానని కానీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉంటానని కానీ తేల్చి చెప్పలేదు. బీజేపీ నుంచి ప్రత్యేకించి మోడీ కారణంగా ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటోందని కేసీఆర్ తో చెప్పారు. దీనిని తిరస్కారమని చెప్పలేకపోయినప్పటికీ కేసీఆర్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేదు. దీంతో మరోసారి సమావేశమవుదామని కేసీఆర్ ముగించాల్సి వచ్చింది.

మమత మాట చెప్పదు...

మమత ను కూడా కేసీఆర్ కలిశారు. రాజకీయాల్లో తాను సంపాదించిన అనుభవం ఆమె ముందు ఏమాత్రం సరిపోదని కేసీఆర్ కు అర్థమైంది. గతంలోనూ మమతను కలిశారు . ఫ్రంట్ అంశాన్నే ప్రస్తావించారు. చూద్దామన్న ధోరణినే ఆమె కనబరిచారు. తెలంగాణలో ఘన విజయం తర్వాత మళ్లీ యాత్ర పెట్టుకున్నారు. నేషనల్ పాలిటిక్స్ లో తన మాటకు బాగా విలువ పెరుగుతుందని కేసీఆర్ ఆశించారు. తెలంగాణ 17 సీట్లున్న చిన్న రాష్ట్రం. పాలిటిక్స్ లో టర్మ్స్ ను డిక్టేట్ చేయలేదు. తామే దేశరాజకీయాలను శాసించాలని భావిస్తారు మమత. అటువంటిది కేసీఆర్ ఏర్పాటు చేసే ఫ్రంట్ లో తాను చేరడమేమిటనే భావనతో ఒకింత ఉదాసీనంగానే వ్యవహరించినట్లు సమాచారం. మమత అంతరంగం అంతుచిక్కలేదు. తొలి సమావేశానికి ద్వితీయ భేటీకి మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. ఇప్పుడే తమ ప్రయత్నాలు మొదలుపెట్టామంటూ కేసీఆర్ ముక్తాయింపునివ్వాల్సి వచ్చింది. ఒకవేళ దీదీ ఫ్రంట్ లోకి వచ్చి ఉంటే పెద్ద విజయం కిందే లెక్క. 42 లోక్ సభ స్థానాలున్న పశ్చిమబంగ చేతులు కలిపితే ఫ్రంట్ కు పెద్దదిక్కు ఏర్పడుతుంది. ఇదే ఉద్దేశంతో మమతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు కేసీఆర్. కానీ అటువైపు నుంచి అంతటి సానుకూల సంకేతాలు రాకపోవడం కేసీఆర్ బృందాన్ని నిరాశపరిచింది.

సొంత శోషే....

ఎన్నికలకు ముందు, ఘన విజయం తర్వాత రెండు దఫాలుగా చేసిన జాతీయ పర్యటనలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా కేసీఆర్ పట్టువదులుతారనుకోలేం. ఇంకా ఆయనకు అనేక ఛాన్సులున్నాయి. కొంత ఒడిదుడుకుల వాతావరణం కనిపించిన రాష్ట్రాల్లో ప్రవేశించి అక్కడి పరిస్థితిని ఫ్రంట్ కు అనుకూలంగా మార్చే యత్నాలు చేపడతారు. తక్షణం ఆయన ముందున్న కర్తవ్యం ఎస్పీ, బీఎస్పీల్లో ఏదో ఒకపార్టీని ఆకట్టుకోవడం. ఈ రెండూ కలిసి వస్తే డబుల్ ధమాకా. దేశంలోని మిగిలిన పార్టీలను పక్కనపెట్టి టీఆర్ఎస్, ఎస్పీ,బీఎస్పీల కలయిక బలమైన ఫ్రంట్ గా మారుతుంది. పైపెచ్చు అసదుద్దీన్ కు చెందిన ఎంఐఎం ను కూడా కలుపుకోవచ్చు. తద్వారా జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపించవచ్చు. ఈ విడత పర్యటన పాక్షికంగానే ఫలితమిచ్చింది. అయితే హైదరాబాదుకు వచ్చి కలుస్తానని అఖిలేశ్ భరోసానివ్వడమొక్కటే మిగిలింది. దాంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఫ్రంట్ కు సంబంధించి వాస్తవిక చిత్రం జనవరి నెలాఖరు నాటికి తేలిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అటు ఎన్డీఏ, ఇటు కాంగ్రెసుతో కూడిన కూటములు తమ బలాబలాలను సంఘటితం చేసుకునే ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. జాతీయపార్టీలు అనేక రకాల హామీలను గుప్పిస్తాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఆ వైపే ఆకర్షితమవుతుంటాయి. వాటన్నిటినీ తోసిపుచ్చి నిజమైన ఫెడరల్ స్ఫూర్తి కోసం ఏ పార్టీలు నిలుస్తాయనేది వేచి చూడాల్సిన అంశం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News