దొర బంగళా అదిరిపోలా…. కొత్త సెక్రటేరియట్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా దానిపై విస్తృత చర్చే సాగుతుంది. ఈసారి ఈ చర్చ తో పాటు రచ్చకూడా మొదలైపోయింది. పాత సచివాలయ పునాదులు [more]

Update: 2020-07-13 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా దానిపై విస్తృత చర్చే సాగుతుంది. ఈసారి ఈ చర్చ తో పాటు రచ్చకూడా మొదలైపోయింది. పాత సచివాలయ పునాదులు ఒక పక్క పెకలిస్తున్న తరుణంలోనే కొత్త భవనం డిజైన్ ను విడుదల చేసి ప్రజల్లోకి వదిలారు గులాబీ బాస్. రాజమౌళి సినిమాల్లో రాజసౌధం మాదిరి అద్భుత కట్టడాన్ని తన మార్క్ తో డిజైన్ చేయించారు ఆయన. ఇంద్ర భవనం లాంటి సచివాలయం తెలంగాణ వాసుల్లోనే కాదు ఎపి లో కూడా చర్చనీయం అయ్యింది.

పక్కా వాస్తు ….

సువిశాల సచివాలయం అంతా పక్కా వాస్తు ప్రకారం ఉండేలా డిజైన్ తయారైంది. నైరుతి లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువు తీరేలా తూర్పు నుంచి ప్రవేశించేలా ఈ రాజప్రాసాదం నమూనా సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి తో పాటు అద్భుత రాజసౌధాలను తలపించేలా చేస్తూనే అత్యాధునిక సౌకర్యాలు, సోలార్ విద్యుత్, గ్రీన్ వ్యాలీ లను కొత్త సచివాలయ డిజైన్ లో ఇంజనీర్లు రూపొందించారు. చెన్నై కి చెందిన కన్సల్టెంట్ ల నమూనా నే టి సిఎం కేసీఆర్ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు అవసరమా ….

తెలంగాణ కు కొత్త సచివాలయం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అవసరమా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉంటే ఉన్న భవనాల్లో సర్దుకుని ఆ తరువాత నిర్మించుకోవొచ్చని పలువురు నేతలు విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పాత సెక్రెటేరియట్ ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేసే స్థితిలో ఉన్నా ప్రజాధనం కేసీఆర్ వృధా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు కోదండరాం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన పిచ్చి తుగ్లక్ అంటున్నారు. బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ వంటివారు ఇదో మసీదు తరహాలో ఉందంటూ తనదైన శైలిలో రాజకీయ బాణాలు వదిలారు. మరో పక్క కొత్త సచివాలయ రూపురేఖలపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కి మంచి టేస్ట్ ఉందన్న ప్రశంసలు అందుతున్నాయి. చూడాలి కొత్త సచివాలయ భవన నిర్మాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Tags:    

Similar News