పాత ఫార్ములాను ప్రయోగించడమే మేలా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ను, దూకుడు మీద ఉన్న బీజేపీకి ఒకే దెబ్బతో చెక్ పెట్టాలన్నది [more]

Update: 2021-02-21 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ను, దూకుడు మీద ఉన్న బీజేపీకి ఒకే దెబ్బతో చెక్ పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. అభ్యర్థి ఎవరైనా తనను చూసి ఓటెయ్యమని ఆయన అడుగుతుండటాన్ని బట్టి చూస్తే అభ్యర్థిని ఇక్కడ డమ్మీ చేశారు. జానారెడ్డి ఇక్కడ గెలిచినా మరో మూడేళ్లు ఉపయోగం ఉండదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అంతేకాదు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఓటు వేయవద్దని కూడా ప్రజలకు కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు.

ముందుగానే ప్రచారానికి వచ్చి…..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కేసీఆర్ కు ప్రతిష్టాత్మకం. తన ఏడేళ్ల పాలనలో ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నిక కేసీఆర్ కు ఉపయోగపడుతుంది. ఇటు విపక్షాలతో పాటు సొంత పార్టీలో తలెగరేస్తున్న నేతల నోళ్లను కూడా మూయించవచ్చు. అందుకే కేసీఆర్ స్వయంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ముందుగా వచ్చారు. ఇక సాగర్ ఉప ఎన్నిక తర్వాత అనేక పరిణామాలు ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.

జిల్లాపై వరాలు…..

దీంతో పాటు కేసీఆర్ నల్లగొండ జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతి మండల కేంద్రానికి ముప్ఫయి లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయలు ఇస్తామని, ప్రత్యేకంగా మిర్యాలగూడ మున్సిపాలిటికీ ఐదు కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లికల్లు – జింకలపాలెం భూవివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితోనే?

అయితే ఇది హుజూర్ నగర్ ఫార్ములా అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అక్కడ పర్యటించలేదు. అందుకే అక్కడ ఓడిపోయామని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. హుజూర్ నగర్ లో తన నభ తర్వాత ఓటింగ్ అనుకూలంగా మారిందంటున్నారు. అందుకే నాగార్జున సాగర్ విషయంలోనూ హుజూర్ నగర్ ఫార్ములాను అమలుపర్చడానికి కేసీఆర్ రెడీ అయ్యారంటున్నారు. అయితే కేసీఆర్ ఇచ్చిన వరాలు ఏ మేరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పనిచేస్తాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News