ఎమ్మెల్సీ జాబితా ఖరారయిందా? ఛాన్స్ వీరికేనా?

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీలో అందరినీ ఊరిస్తున్నాయి. పెద్దల సభ కావడంతో ఎక్కువగా పెద్దలే దీనిపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే మూడు ఎమ్మెల్సీ పదవులను [more]

Update: 2020-08-26 09:30 GMT

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీలో అందరినీ ఊరిస్తున్నాయి. పెద్దల సభ కావడంతో ఎక్కువగా పెద్దలే దీనిపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే మూడు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారు. త్వరలోనే జాబితాను విడుదల చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అనేక మంది సీనియర్ నేతలు తమ యత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ను నేరుగా కలిసే అవకాశం లేకున్నా తమకున్న మార్గాల ద్వారా కబురు పంపుతున్నారు.

స్పీకర్ గా పనిచేసి….

కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రధానంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి పోటీ పడుతున్నారు. ఆయన గత ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేశారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో మధుసూదనా చారి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజ్యసభ పదవి పొందాలంటే ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అందుకే ఎమ్మెల్సీగా తనను కేసీఆర్ ఎంపిక చేస్తారని మధుసూదనాచారి గట్టిగా భావిస్తున్నారు.

కేసీఆర్ కు సన్నిహితుడుగా…

ఇక మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కూడా అంతే. తొలి విడతలో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. తుమ్మలను కేసీఆర్ ఎంపిక చేస్తే తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా వత్తిడి వస్తుందని ఆలోచిస్తున్నారట. అందుకే తుమ్మల నాగేశ్వరావు విషయంలో కొంత వెనకగడుగు వేసే అవకాశముందంటున్నారు. తుమ్మల మాత్రం తన ప్రయత్నాలను ఎప్పుడో ప్రారంభించారంటున్నారు.

మంత్రి పదవిని త్యజించి…..

మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈయన కాంగ్రెస్ లో మంత్రిపదవికి రాజీనామా చేసి మరీ టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకు కేసీఆర్ ఈ దఫా ఎమ్మెల్సీ ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను బరిలోకి దించడంతో జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్ వద్ద మైనస్ మార్కులు పడ్డాయంటున్నారు. మొత్తం మీద ముగ్గురు సీనియర్ నేతలు మాత్రం ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మరి కేసీఆర్ మదిలో ఎవరున్నారన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News