పది నెలలే సమయం… జూన్ నెలలో ముహూర్తం

తెలంగాణ ప్రభుత్వం సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. వచ్చే జూన్ నాటికి సచివాలయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. [more]

Update: 2020-08-11 17:30 GMT

తెలంగాణ ప్రభుత్వం సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. వచ్చే జూన్ నాటికి సచివాలయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సచివాలయం డిజైన్లను మంత్రి వర్గం ఆమోదించడంతో త్వరలో టెండర్లను పిలిచి పనులు మొదలు పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. శ్రావణ మాసం పూర్తయ్యే లోపే పనులు ప్రారంభించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారు.

న్యాయపరమైన చిక్కులు…..

సరిగ్గా ఏడాది క్రితం కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. అయితే న్యాయపరమైన చిక్కులు రావడంతో ఏడాదిగా సచివాలయం నిర్మాణ ప్రతిపాదన ఆగిపోయింది. అయితే సచివాలయంలో ముఖ్యమైన విభాగాలన్నింటినీ తరలించారు. ఇటీవలే న్యాయస్థానం నూతన సచివాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.

నిధులు కేటాయించి….

కొత్త సచివాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించింది. మంత్రివర్గం ఆమోదించిన డిజైన్ల మేరకు మూడు ఎకరాల స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణం కానుంది. అక్కడ ఉన్న 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం మూడు ఎకరాల్లోనే జరగనుంది. 278 అడుగుల ఎత్తు, 600 మీటర్ల వెడల్పుతో సచివాలయం నిర్మాణం కానుంది. కొత్త సచివాలయం భవనం జీ ప్లస్ ఆరు అంతస్థుల్లో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తులో ఉంటుంది.

వెరీ వెరీ స్పెషల్ గా…

మొత్తం ఏడు లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరగనుంది. కిటికీలకు నీలి రంగు అద్దాలను అమర్చనున్నారు. భవనానికి ఇరు వైపులా మూడు గుమ్మటాలు రానున్నాయి. ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ కు పోను అంతా గ్రీనరీ ఉంటుంది. వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయనున్నారు. సీఎం కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వాహనం దిగిన వెంటనే ఆయన కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. పది నెలల్లో సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. జూన్ లో కొత్త సచివాలయం ప్రారంభం కానుంది.

Tags:    

Similar News