కేసీఆర్ కక్కేశారు …శాపాలు పెట్టేశారు

ఉపద్రవం వచ్చిపడింది. ఈ దశలో కేంద్రంపై రాష్ట్రాలు … రాష్ట్రాలపై కేంద్రం కీచులాడుకునే సమయం కాదు. దాంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా రాష్ట్రాలు మోడీ సర్కార్ వైఖరిని [more]

Update: 2020-05-06 03:30 GMT

ఉపద్రవం వచ్చిపడింది. ఈ దశలో కేంద్రంపై రాష్ట్రాలు … రాష్ట్రాలపై కేంద్రం కీచులాడుకునే సమయం కాదు. దాంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా రాష్ట్రాలు మోడీ సర్కార్ వైఖరిని విమర్శించే సాహసానికి పోవడం లేదు. ఎన్ని బాధలు ఉన్నా సంయమనం పాటిస్తూ తమ వేదన అంతా కడుపులోనే దాచుకుంటున్నాయి. ఇప్పటివరకు కేంద్రం వైఖరిని తొలినుంచి తప్పుపడుతుంది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమే జాతీయ స్థాయిలో కనపడుతున్నారు. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చాలా కాలం నుంచే మోడీ వర్సెస్ మమత అన్న రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పుడు మమత బాటలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చేశారు.

ఇదా సమయం ….?

కేంద్రం వైరస్ పై యుద్ధం చేస్తున్న సమయంలో రాష్ట్రాలపై మోయలేని భారాన్ని మోపడం అన్యాయం అని ఇక ఉండబట్టలేక కేసీఆర్ గొంతు చింపుకున్నారు. ఒక పక్క ఆర్ధిక సాయం అందించకపోగా వలసకూలీల రైల్వే చార్జీలు రాష్ట్రాలే భరించాలని ఆదేశించడాన్ని గులాబీ బాస్ తనదైన శైలిలో దుమ్మెత్తిపోశారు. సుమారు నాలుగుకోట్ల రూపాయలు వలసకూలీలకు చెల్లించి రైల్ టికెట్స్ కొనుగోలు చేయాలిసి వచ్చిందని వాపోయారు ఆయన. పైగా రిజర్వేషన్ చార్జీలు, స్పెషల్ ట్రైన్ చార్జీలంటూ రైల్వే ముక్కుపిండి రాష్ట్రాల నుంచి ప్రజలు బాధలో అదీ వలసకూలీలను తరలించే సందర్భంలో వసూలుకు పాల్పడటం దుర్మార్గం అంటూ ధ్వజమెత్తేశారు.

ఇదే బాటలో …

ముందుగా మమతా బెనర్జీ ఆ తరువాత కెసిఆర్ తో మొదలైన ఈ విమర్శలు ఇక వివిధ రాష్ట్రాలనుంచి వినిపించే అవకాశాలే కనిపిస్తున్నాయి. కేంద్రం ఉదారంగా ముందుకు రావలిసింది పోయి మరింత కఠినమైన ఆర్ధిక సమస్యలను తమ నెత్తిన రుద్దడాన్ని ముఖ్యమంత్రులు సహించేందుకు ఇప్పుడు సిద్ధం కావడం లేదు. రాష్ట్రాలకు ఆర్ధిక ప్యాకేజీలు అందించడంలో కానీ, అన్ని వర్గాలను ఆదుకునే ఉద్దీపన ప్యాకేజీలు తగినంతగా ఇచ్చేందుకు చొరవ చూపకపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. మరీ ముఖ్యంగా అప్పు చేసుకునే పరిమితిని పెంచమని కోరినా కేంద్రం మౌనం వహించడం ఏమిటన్నది ముఖ్యమంత్రుల ప్రశ్న. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదన్న చందంగా ఇలాగే ఉంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని కేసీఆర్ కేంద్రానికి పెట్టిన శాపాలపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

Tags:    

Similar News