గులాబీ బాస్ కు పెను సవాలే?

తెలంగాణ లో పంట చేతికొచ్చిన తరుణం ఆసన్నం అయ్యింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల పంట ను ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అన్ని [more]

Update: 2020-03-30 09:30 GMT

తెలంగాణ లో పంట చేతికొచ్చిన తరుణం ఆసన్నం అయ్యింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల పంట ను ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు గ్రామాల వారీగా చేపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రైతులు మార్కెట్ యార్డ్ లకు పోయి విక్రయించకుండా వారి చెంతకే వెళ్ళి కొనుగోలు చేయడం ద్వారా కరోనా వైరస్ ను అదుపు చేయవచ్చని అన్నదాతలను ఆదుకోవచ్చన్నది టి సర్కార్ ఆలోచన. ఇక్కడ దాకా ముచ్చట బాగానే ఉన్నా ఈ కొనుగోలు చేసేందుకు చిక్కు సమస్యలనే తెలంగాణ సర్కార్ ఎదుర్కోనుంది. ఇంత భారీ మొత్తంలో పంటను తరలించడానికి అవసరమైన సరుకు సరంజామా ఇప్పుడు అసలు సమస్య గా మారింది.

లాక్ డౌన్ దెబ్బతో …

పంట తీసివేతకి బీహార్ నుంచి వచ్చే హమాలీలు చాలా కీలకం. లాక్ డౌన్ తో వీరంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వీరి సాయం లేకుండా ఇంత మొత్తంలో పంట తరలించడం సాధ్యం అయ్యే పని కాదు. అలాగని దేశవ్యాప్త లాక్ డౌన్ ఉన్నందున వారిని రప్పించడం కూడా అంత సులువు కాదు. ఇదే ఇప్పుడు టి సర్కార్ ను కలవర పెడుతుంది. దీనితో బాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే గొనె సంచుల కొరత మరో పెద్ద సమస్యగా కనిపిస్తుంది. సుమారు 60 లక్షల సంచుల అవసరం ఉండగా ప్రస్తుతం 35 లక్షల సంచులు వ్యవసాయ శాఖ దగ్గర అందుబాటులో ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం విశేషం.

చిన్న సమస్యలే అనిపించినా?

ఎక్కడికక్కడ సంచుల తయారీ పరిశ్రమలు షట్ డౌన్ చేయడంతో ఇప్పుడు చిన్న చిన్న సమస్యలే పెనుసవాళ్ళను టి సర్కార్ కి విసురుతున్నాయి. వీటినుంచి బయటపడి విజయవంతంగా కరోనా ప్రభావం ఉన్నా అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూసాం అనే రీతిలో పనిచేసేందుకు కేసీఆర్ బృందం సాహసాలే చేయాలిసివుంది. ఇప్పటినుంచి సంచులను స్థానికంగా ఎక్కడికక్కడ తయారు చేయించడం, అలాగే బీహార్ కూలీలు చేసే పనులు స్వయంగా రైతులే చేసుకుంటే కానీ పని జరిగేలా కనిపించడం లేదు. మరి గులాబీ బాస్ ఏమి చేయనున్నారో..?

Tags:    

Similar News