కేసీఆర్ వ్యూహాలే వేరులే

కేసీఆర్ ది చాలా ముందుచూపు. హస్తిన లో పార్టీ భవనానికి శంకుస్థాపన చేయడం ద్వారా ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న తెలంగాణ [more]

Update: 2021-09-03 11:00 GMT

కేసీఆర్ ది చాలా ముందుచూపు. హస్తిన లో పార్టీ భవనానికి శంకుస్థాపన చేయడం ద్వారా ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి అధికారికంగా తెలంగాణభవన్ ఆశ్రయమిస్తుంది. ఎంపీల నివాసాలున్నాయి. అయినా పార్టీకి ప్రత్యేకంగా భవనం ఉండాలనే లక్ష్యంతో కేంద్రం మంజూరు చేసిన స్థలంలో తక్షణం నిర్మాణం చేపట్టారు కేసీఆర్. ఇందులో దీర్ఘకాలిక లక్ష్యాలు ఇమిడిఉన్నాయి. ఢిల్లీలో పార్టీ యాక్టివిటీస్ ను విస్తరించడం, కేంద్రంలో పనులు నిమిత్తం వచ్చే పార్టీ నాయకులకు ఆశ్రయం కల్పించడం, దేశంలోని చిన్నపార్టీలను అనుసంధానించే ఒక సమావేశ స్థలిని ఏర్పాటు చేయడం లక్ష్యంగా కేసీఆర్ ఢిల్లీలో భవన నిర్మాణానికి పూనుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనేది ఆయన ఆకాంక్ష. అధికారిక హోదాలో తెలంగాణ భవన్ ను వినియోగించుకోవడం కంటే పార్టీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుంటూ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడమే సముచితం. విమర్శలు, ఆరోపణలు తలెత్తవు. అందుకే పార్టీ భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని కేసీఆర్ సంకల్పించారు.

దక్షిణాది తొలి ముద్ర…

ఏపని చేపట్టినా కేసీఆర్ వినూత్నమైన పంథానే అనుసరిస్తారు. తెలంగాణ ఉద్యమం మొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాల వరకూ ఒక ప్రత్యేక శైలితో రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఢిల్లీలో సొంత పార్టీ భవనం కూడా ఆ కోవలోకే చెందుతుంది. డీఎంకే, ఏఐడీఎంకే, తెలుగుదేశం, వైసీపీ వంటి పెద్ద పార్టీలేవీ ఇంతవరకూ ఢిల్లీ గడ్డపై సొంత ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. తెలుగుదేశం, డీఎంకే, ఏఐడీఎంకే, జేడీఎస్ వంటి పార్టీలు ఎనిమిదో దశకం నుంచే కేంద్రంలో క్రియాశీల పాత్ర పోషించాయి. ఒక స్థలం సమకూర్చుకుని సొంత భవనాలు నిర్మించుకోవాలనే ఆలోచన వాటికి రాలేదు. జాతీయ పార్టీలకు మాత్రమే ప్రత్యేక భవనాలున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలకు చెందిన అధికార భవనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతిపక్షంగా ఉండే వాటికి కనీస వసతి కూడా లభించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఏదో ఒక హోదా ఉండాల్సిందే. అటువంటి స్థితిలో దేశంలోని ఇతర పార్టీలతో సంప్రతింపులకు శాశ్వత చిరునామా కరవు అవుతుంది. ముఖ్యమైన పెద్ద పార్టీలకు డిల్లీలో కార్యాలయాలతో కూడిన వసతి ఉండటం చాలా అవసరం. ఈ దిశలో దక్షిణాది నుంచి తొలి ప్రాంతీయ పార్టీ కార్యాలయంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ భవనం నిలవబోతోంది.

జాతీయ ఆకాంక్షలు…

కేసీఆర్ చాలా కాలంగా జాతీయ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు, బీజేపీ వంటి జాతీయ పార్టీల కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో పక్షం పెరగాలనేది ఆయన చిరకాల వాంఛ. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటం, జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎప్పటికప్పుడు సైలంట్ కావాల్సి వస్తోంది. 2024 నాటికి ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరుగుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రాబల్యం తగ్గుముఖం పడుతోంది. కాంగ్రెసు పార్టీ పూర్తిగా పుంజుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. కేసీఆర్ వంటి మాటకారికి , అనుభవజ్ణుడికి అటువంటి సందర్బం సువర్ణావకాశమే. కాలం కలిసి వస్తే రాష్ట్రం లో పగ్గాలు తర్వాతి తరానికి అందచేసి , ఢిల్లీలో కేసీఆర్ మకాం వేసే ఆలోచనను కూడా తోసిపుచ్చలేం. అందుకే చాలా వేగవంతంగా తాను చేయాలనుకున్న పనులన్నిటినీ రాష్ట్రంలో చేసేస్తున్నారు. అన్నివర్గాలకు స్కీములను ప్రవేశపెడుతున్నారు. పదేళ్ల అధికారం తర్వాత టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. అందుకు కూడా కేసీఆర్ సిద్దమవుతున్నారు. హస్తినను వేదిక చేసుకుంటూ ప్రాంతీయ పార్టీల కూటమిని బలోపేతం చేసేందుకు ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ ఆ దిశలోనూ ఒక ముందడుగే.

మన వాటా.. మన కోటా…

ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవడానికి కొన్ని ఇబ్బందులున్నాయి. వాటికి వసతి దొరకడం కష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీలకు కొంతమేరకు ఫర్వాలేదు. కానీ పార్టీ అధికారంలో లేకపోయినా, తగిన సంఖ్యలో ఏంపీలు లేకపోయినా ఢిల్లీలో అడ్రస్ గల్లంతవుతోంది. రాష్ట్రాల్లో ప్రజాదరణ ఉన్న పార్టీలకు దేశ రాజధానిలో రాజకీయ సంప్రతింపులు, మంతనాలకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. ఆ ఉద్దేశంతోనే కనీసం ఏడుగురు ఎంపీలను కలిగిన పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించింది కేంద్రం. ఇది శాశ్వత వసతికి ఉపయోగపడుతుంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల సంప్రతింపులకు ఉపయోగపడుతుంది. ప్రాంతీయ నేతలు, కార్యకర్తలు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైన సందర్భాల్లో ఢిల్లీలోనే మకాం వేసేందుకు ఈ భవనాలు తోడ్పడతాయి. గతంలో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల రాజధానుల నుంచే ఢిల్లీతో సంప్రతింపులు చేస్తుండేవి. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలకూ హస్తిన చిరునామా లేదు. పార్టీ కార్యాలయాల నిర్మాణం వల్ల కచ్చితంగా ప్రాంతీయ పార్టీల ప్రెజెన్స్ ఢిల్లీలో పెరుగుతుంది. సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి ఇదొక మంచి పరిణామం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News