గుస్సా వెనక లో..గుట్టు..?

ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ అయ్యారనేది వార్త. మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అజెండా లో బాగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. [more]

Update: 2021-06-22 06:30 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ అయ్యారనేది వార్త. మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అజెండా లో బాగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏ పని చేసినా దానికో అర్థము, పరమార్థమూ ఉంటుంది. తాను నిజంగా చేయాలనుకున్న పనులను ఎవరికీ చెప్పకుండానే చేసుకుంటూ పోతుంటారు. అందరూ ఫాలో కావాల్సిందే. జగన్ మోహన్ రెడ్డితో మనకు వైరముందని ప్రత్యేకించి పదిమందికి తెలిసే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించడమే విశేషం. ఇది కచ్చితంగా బహిరంగంగా ప్రచారం కావాలనేదే కేసీఆర్ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు. మంత్రులూ విమర్శలు గుప్పిస్తున్నారు. పైపెచ్చు ఈ మధ్యనే ఈటల రాజేందర్ కమలం పార్టీలో చేరిపోయారు. అయినా ఆయా అంశాలను తన రాజకీయ అజెండాలో పెట్టుకుని మంత్రులతో చర్చించలేదు. అంటే బీజేపీపై రాజకీయ విమర్శలకు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చెప్పాలి. అంతర్గత కోణంలో బీజేపీని రాష్ట్రంలో ఇరుకున పెట్టే కొత్త అజెండా తో కేసీఆర్ కదులుతున్నారు. ఏపీ సీఎం పైన మాత్రమే మంత్రులతో మాట్టాడారు. అది కచ్చితంగా చర్చనీయాంశమే. సీఎం సీరియస్ గా ఉన్నారంటే మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు చెలరేగి పోతారు. కచ్చితంగా కేసీఆర్ కు కావాల్సింది అదే. అందుకే సమావేశంలో మాట్టాడారు. ఆంధ్రాతో విభేదాల వల్ల తెలంగాణకు వచ్చే నష్టమేమీ లేదు. ఎంతోకొంత టీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనమే తప్ప.

ఒక్క దెబ్బకే కాంగ్రెసు, బీజేపీలు..

కేసీఆర్ మాట్టాడే మాటలను ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంతో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు. ఒకవైపు బీజేపీ పెరుగుతోంది. మరోవైపు కాంగ్రెసు పూర్తిగా బలహీన పడలేదు. రెండు పార్టీలను తెలంగాణలో ఇరుకున పెట్టాలంటే అంతర్రాష్ట్ర అజెండాను తలకెత్తుకోవడమే మార్గాంతరం. బీజేపీ, కాంగ్రెసులు ఏపీతో తగాదాలపై టీఆర్ఎస్ తరహాలో మాట్టాడలేవు. జాతీయ పార్టీలుగా వాటికి కొన్ని బాధ్యతలు, పరిధులు, పరిమితులు ఉంటాయి. అందులోనూ నీటిపై దోపిడీ చేస్తున్నారనే అంశం సంక్లిష్టమైన రాజకీయ అంశం. అటు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి అన్ని రాష్ట్రాలతో ముడి పడి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెసు, బీజేపీలను కూడా గోదాలోకి లాగుతున్నారు. నిజానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ కు పెద్దగా విభేదాలేమీ లేవు. శాసనసభ ఎన్నికల్లో మిత్ర పక్షంగా బలంగా సహకరించారు. నీటి ప్రాజెక్టులు కూడా ఎప్పట్నుంచో కొనసాగుతున్నవే. ఒకానొక దశలో గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేయాలనేంతగా ముఖ్యమంత్రులిద్దరూ చర్చించారు. రెండు రాష్ట్రాలకు ఆర్థిక భారమే కాకుండా రాజకీయంగా కూడా నష్టం జరుగుతుందని ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నీళ్ల ప్రస్తావనతో జగన్ మోహన్ రెడ్డి కంటే బీజేపీనే టార్గెట్ చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెబుతున్నారంటే తన కోటలోకి దూసుకువస్తున్న కమలం పార్టీకి హస్తినలోనే ,చెక్ పెట్టాలనే ఎత్తుగడ సుస్పష్టం.

షర్మిలపై సందేహాలు..

తెలంగాణలో వైసీపీ చాప చుట్టేసింది. పక్క రాష్ట్రంతో సయోధ్య కోరుకుంటున్నాం. అందుకే అక్కడ పార్టీ రాజకీయ కార్యకలాపాలు ఉండవని వైసీపీ అగ్ర నాయకులు ప్రకటించారు. కానీ షర్మిల రూపంలో మరో కొత్త కుంపటిని తన తలపై తెచ్చి పెట్టారనేది కేసీఆర్ అనుమానం. నిజానికి షర్మిల పార్టీకి రాజకీయంగా తెలంగాణలో పెద్దగా స్టేక్స్ లేవు. రెండు మూడు శాతం ఓట్లు తెచ్చుకుంటే గొప్ప విషయమే అనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఆ ఓట్లు కూడా అధికార పార్టీ ఖాతానుంచే కొల్లగొట్టవచ్చనేది టీఆర్ఎస్ సందేహం. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలలో మెజారిటీ ఓటింగు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తోంది. షర్మిల సైతం అదే వర్గాల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ వైఎస్సార్ పార్టీగా తల్లి, అన్న అనుమతితోనే షర్మిల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అందువల్ల ఈ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఉందని టీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తోంది. షర్మిల కు ఆంధ్రాలో రాజకీయంగా పదవులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కాదని తెలంగాణలో పార్టీ పెట్టించడమేమిటని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ గుస్సా వెనక ఈ కోణం కూడా దాగి ఉండవచ్చు.

ఇంకా తెగని పంపకాలు…

జల వనరుల పంపకాలు, ఎత్తిపోతల పథకాల వంటి విషయాలు రెండు రాష్ట్రాల మధ్య అంత తొందరగా తెమిలిపోయే విషయాలు కాదు. ఆ వివాదాలు అలా సాగుతూనే ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సందర్భాల్లో ప్రయోజనం కలిగిస్తూనే ఉంటాయి. తర్వాత సద్దుమణుగుతుంటాయి. తమ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు రాజకీయ పోరాటం సాగిస్తున్నట్లు ఇరు ప్రాంతాల ప్రజలను నాయకులు నమ్మిస్తూ ఉంటారు. పరిష్కారం కాని సమస్యలపై కేంద్రాన్ని, జాతీయ పార్టీలను నిలదీస్తూనే ఉంటారు. నిజానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం పరిష్కరించుకునే అంశాలు అనేకం ముంగిట్లో ఉన్నాయి. వాటిపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఏపీ , తెలంగాణ సీఎంలు కలిసి కూర్చుని పదో షెడ్యూల్ లోని ఆస్తుల విభజన ప్రక్రియను సాధ్యమైనంత సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. దీనిలో కేంద్రం పాత్ర అవసరం లేదు. విభజన పూర్తయితే రెండు రాష్ట్రాలకు సొంత ఆస్తులు ఏర్పడతాయి. కానీ దానివల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. అందుకే సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు. ప్రజల భావోద్వేగాలు, జాతీయ పార్టీలకు ఇబ్బందులు పెట్టే విషయాల్లోనే శ్రద్ధ కనబరుస్తారు. ఆ దిశలో కేసీఆర్ అప్పుడప్పుడు చేసే ప్రకటనలు, చర్యలు కొంతకాలం ఉద్రిక్తతలు స్రుష్టిస్తూ ఉంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News