నిలువరించేది ఇలాగేనా?

ఆర్టీసీ కార్మికుల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు రావడం లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఇక [more]

Update: 2019-11-11 09:30 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు రావడం లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఇక ఎన్ని రోజులు గడుస్తుందో చెప్పలేని పరిస్థితి తెలంగాణలో నెలకొని ఉంది. 38 రోజుల నుంచి కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను నియమించినా పూర్తి స్థాయిలో బస్సులు మాత్రం తిరగడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్టీసీ బస్సులు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. మరోవైపు రూట్లను ప్రయివేటీకరణ చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ ఉంది.

ఎన్ని నిరసనలు చేసినా….

ఆర్టీసీ కార్మికులు ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా ఫలితం కన్పించడం లేదు. అధికార పార్టీ తీరుకు నిరసనగా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించాయి. ఇది కేసీఆర్ కు మరింత ఆగ్రహం కల్గించింది. సమ్మె చట్ట బద్ధమైనది కాదని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ కార్మికులు చేరడానికి విధించిన డెడ్ లైన్ కూడా ముగిసింది. దీంతో ఇక కార్మికులు తన దారికి రారని భావించిన కేసీఆర్ అన్ని రూట్లను ప్రయివేటు పరంచేయాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు.

నిత్యం సమీక్షలతో….

ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రతిరోజూ కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారు. అయితే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు, న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలపైనే కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు తప్పించి సమ్మె పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నించడం లేదు. ఆర్టీసీ కార్మికులు కూడా చర్చలకు ఆహ్వానిస్తేనే తాము సమ్మె విరమణ చేసే ఆలోచన చేస్తామంటున్నాయి. దీంతో గత 38 రోజులుగా తెలంగాణాలో ఎర్రబస్సుల సమ్మె జరుగుతూనే ఉంది.

వేతన సవరణతో…

ఆర్టీసీ కార్మికుల కు మద్దతుగా మిగిలిన ఉద్యోగ సంఘాలు మరలకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులతో లంచ్ మీటింగ్ పూర్తి చేశారు. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇక తాజాగా ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సిద్ధమయ్యారు. పదవ పీఆర్సీ కాలపరిమితి ముగియడంతో కేసీఆర్ వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఉద్యోగుల ఫిట్ మెంట్ శాతం ఎంత పెంచనున్నారన్న దానిపై కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయనున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలవకుండా ఉండేందుకే కేసీఆర్ వేతన సవరణకు సిద్దమవుతున్నారన్నది వాస్తవం.

Tags:    

Similar News